shiva swamy
-
శివస్వాముల అరెస్ట్.. పరిగి సబ్ జైల్ వద్ద హైడ్రామా
సాక్షి, వికారాబాద్: పరిగి సబ్ జైల్ వద్ద హైడ్రామా నెలకొంది. మూడు రోజుల క్రితం యాలాల్ మండలం దేవనూరులో జరిగిన గొడవలో ఐదుగురు శివస్వాములను పోలీసులు అరెస్టు చేశారు. అయితే.. శనివారం ఉదయం ఆ శివ స్వాములను రిమాండుకు తరలించేందుకు పరిగి సబ్ జైలుకు తీసుకొచ్చారు తాండూరు పోలీసులు. ఈ క్రమంలో అక్కడ హైడ్రామా నెలకొంది. శివ స్వాములు మాలలు తీసి వేస్తేనే జైల్లోకి అనుమతి ఇస్తామని జైలు సిబ్బంది తాండూరు పోలీసులకు తేల్చి చెప్పారు. దీంతో.. స్వాములను మళ్ళీ జైలు బయటకు తీసుకొచ్చి కూర్చోబెట్టారు పోలీసులు. ఇదిలా ఉంటే.. మాయమాటలు చెప్పి తమను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారని శివ స్వాములు చెప్తున్నారు. శివమాలలు తీయబోమని స్వాములు చెప్పడంతో.. పోలీసులు ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఉండిపోయారు. మీడియాతో సహా జైలు ఆవరణలో ఎవరినీ ఉండకుండా పంపించేస్తున్నారు పోలీసులు. -
‘సీఎం జగన్ స్పందన అభినందనీయం’
సాక్షి, విజయవాడ: ఇంద్రకీలాద్రిపై కొండ చరియలు విరిగిపడ్డ ప్రాంతాన్ని నిపుణుల కమిటీ పరిశీలించింది. ఈ సందర్భంగా జియో ఎక్స్పర్ట్ కమిటీ సభ్యులు త్రిమూర్తిరాజు మాట్లాడుతూ.. ఓంకారం మలుపు, మౌనముని గుడి వద్ద కొండచరియలు విరిగిపడే అవకాశం ఉందని తెలిపారు. ‘‘ఇంద్రకీలాద్రిపై కొండలు మట్టి, రాళ్లు కలిసి ఉన్నాయి. వర్షాలు ప్రభావంతో జారి పడుతున్నాయి. ప్రమాదాలను అరికట్టే విధంగా అలారం ఏర్పాటు, ఐరెన్ మెష్ మరింత పటిష్టం చేయాలి. వదులుగా ఉన్న కొండచరియలను తొలగించాలి’’ అని పేర్కొన్నారు. ఈ ఘటనపై వారం రోజుల్లో నివేదిక అందజేస్తామని వెల్లడించారు. కాగా విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కనకదుర్గ ఆలయ ఆవరణలో బుధవారం కొండ చరియలు విరిగిపడిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో ఇద్దరు ఆలయ ఉద్యోగులు, ఒక కానిస్టేబుల్ గాయపడ్డారు.(చదవండి: ఇంద్రకీలాద్రిపై విరిగిపడ్డ కొండ చరియలు) సీఎం జగన్ స్పందన అభినందనీయం శైవక్షేత్ర పీఠాధిపతి శివస్వామి నేడు ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొండచరియలు విరిగిపడిన వెంటనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మెహన్‌రెడ్డి స్పందించడం అభినందనీయమన్నారు. దుర్గగుడి మాస్టర్ ప్లాన్‌కు అవసరమైన నిధులను తక్షణమే విడుదల చేయాలని సీఎం ఆదేశించడం మంచి నిర్ణయమని, ఇంద్రకీలాద్రి అభివృద్ధికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని హర్షం వ్యక్తం చేశారు. -
‘టీడీపీ అధర్మ పాలన వల్లే 29 మంది మృతి’
సాక్షి, అమరావతి : శైవక్షేత్ర పీఠాధిపతి శివస్వామి టీడీపీ ప్రభుత్వం, జస్టిస్ సోమయాజులు కమిషన్‌పై నిప్పులు చెరిగారు. గోదావరి పుష్కరాల్లో జరిగిన తొక్కొసలాటకు మీడియా అత్యుత్సాహం, భక్తుల అవగాహనాలేమి కారణమని తేల్చిన సోమయాజులు కమిషన్‌కు భారతరత్న, ఆస్కార్ అవార్డులు ఇవ్వొచ్చని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో చంద్రబాబు అధర్మపాలన సాగుతోంది కనుకనే అంతటి ఘోరం జరిగిందని వాపోయారు. పుష్కరాల్లో చనిపోయిన 29 మంది కుటుంబాల ఉసురు ప్రభుత్వానికి తగులుతుందని అన్నారు. టీడీపీకి తగిన గుణపాఠం ప్రజలే చెప్తారు.. తిరుమల శ్రీవారి ఆభరణాలపై ప్రశ్నించినందుకే ప్రభుత్వం తనపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని శివస్వామి ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటివరకు పోలీసులు తనపై మూడు అక్రమ కేసులు పెట్టారని, విచారణ పేరుతో వేధిస్తున్నారని అన్నారు. కేసుకు సంబంధించిన విషయాలను విచారించాల్సిందిపోయి.. శైవక్షేత్ర ఆర్థిక లావాదేవీలు, బ్యాంక్ బ్యాలెన్స్‌లు అడుగుతున్నారని ఆరోపించారు. రాష్ట్రాన్ని అధోగతిపాలు చేసిన టీడీపీకి వ్యతిరేకంగా ప్రజలు మంచి తీర్పునిస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. చదవండి : దోషం భక్తులది.. పాపం మీడియాది -
శివస్వామి పాదయాత్రకు అనుమతి లేదు
-
శివస్వామిపై ఎస్సీ, ఎస్టీ కేసు
-
శివస్వామిపై ఎస్సీ, ఎస్టీ కేసు
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి హిందూత్వ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ, జేఏసీ ద్వారా మహా పాదయాత్రను తలపెట్టనున్న శివస్వామిపై శనివారం కేసు నమోదైంది. శివస్వామి అనుచరులు కులం పేరుతో దూషించి దాడి చేశారని ఫిర్యాదు అందటంతో పోలీసులు జేఏసీ చైర్మన్ అయిన శివస్వామిపై ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేశారు. ఆదివారం డీఎస్పీ కార్యాలయంలో ఈ మేరకు హాజరుకావాలని శివస్వామికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. పాదయాత్రను అడ్డుకునేందుకే ప్రభుత్వం ఈ కుట్ర పన్నుతోందని శివస్వామి ఆరోపించారు. రాత్రి నుంచి శైవ క్షేత్రంలో లేని తాను అసైన్డ్ రైతులపై ఎలా దాడి చేస్తానని ప్రశ్నించారు. ఏపీలో అరాచక పాలన నడుస్తోందని అన్నారు. కొంతమంది రైతులను అడ్డంపెట్టుకుని ప్రభుత్వం వేధింపులకు పాల్పడుతోందని ఆరోపించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆదివారం సాయంత్రం పాదయాత్ర చేసి తీరుతామని స్పష్టం చేశారు. ప్రభుత్వ బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. -
‘టీడీపీ డ్రామాలకు వెరవం.. పాదయాత్ర ఆపం’
సాక్షి, అమరావతి: చంద్రబాబు హిందుత్వ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ హిందూ జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టనున్న మహా పాదయాత్రను అడ్డుకోవడానికి అధికార యంత్రాంగం తీవ్ర ప్రయత్నాలు చేస్తోందని జేఏసీ చైర్మన్ శివస్వామి ఆరోపించారు. నాలుగేళ్లుగా అధికారం చలాయిస్తున్న టీడీపీ ప్రభుత్వం హిందూవ్యతిరేక చర్యల్ని ప్రజలకు వివరించడానికే పాదయాత్ర తలపెట్టామని ఆయన అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జూలై 29న విజయవాడ దుర్గా గుడి నుంచి ప్రారంభమై ఆగస్టు 12న తిరుపతిలో ఈ పాదయాత్ర పూర్తవుతుందని ఆయన తెలిపారు. ప్రభుత్వం పాదయాత్రకు అనుమతినివ్వడం లేదనీ, అడుగడుగునా అడ్డుకునే ప్రయత్నాలు చేస్తోందని ఆయన వాపోయారు. హిందుత్వ వ్యతిరేక చర్యలను ప్రశ్నించినందువల్లే గత నాలుగేళ్లుగా ప్రభుత్వం తనను వేధింపులకు గురిచేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. కొత్తగా తాను అసైన్డ్ భూములను లాక్కొన్నానంటూ టీడీపీ ఆధ్వర్యంలో కొందరు ధర్నా కూడా చేపట్టారని ఆయన మండిపడ్డారు. ఏదేమైనా పాదయాత్ర చేసి తీరుతామని ఆయన ఉద్ఘాటించారు. కాగా, పాదయాత్రను అడ్డుకోవడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. శైవక్షేత్రం చుట్టూ పోలీసులను మోహరించింది. ఈ పాదయాత్రలో శివస్వామితో పాటు మరో 30 మంది ఈ పాల్గొననున్నారు. -
‘టీడీపీ డ్రామాలకు వెరవం.. పాదయాత్ర ఆపం’
-
పీఠాధిపతి అరెస్ట్.. శైవ క్షేత్రంలో తీవ్ర ఉద్రిక్తత
సాక్షి, అమరావతి : శైవక్షేత్ర పీఠాధీపతి శివస్వామిని మరో సారి పోలీసులు హౌజ్ అరెస్ట్ చేశారు. హిందూ సంస్థలపై జరుగుతున్న దాడులకు నిరసనగా గురువారం తెలుగు రాష్ట్రాల్లో జాతీయ రహదారుల దిగ్భంధానికి పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసలు శివస్వామిని హౌజ్ అరెస్ట్ చేశారు. శైవక్షేత్రం చుట్టూ భారీగా పోలీసు బలగాలు మోహరించాయి. ఈ నేపథ్యంలో పోలీసులకు భక్తులకు మధ్య వాగ్వివాదం జరిగింది. శివస్వామిని ఎందుకు హౌజ్ అరెస్ట్ చేసి వేధిస్తున్నారని భక్తులు పోలీసులను నిలదీశారు. శివస్వామి మాట్లాడుతూ.. నాలుగేళ్లుగా సీఎం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తనను మానసికంగా వేధిస్తోందని తెలిపారు. క్షేత్రంలో పోలీసుల్ని చూసి భక్తులు భయపడుతున్నారని పేర్కొన్నారు. నోటీసులు ఇవ్వకుండా తనను ఎలా అరెస్ట్ చేస్తారని ప్రశ్నించారు. హిందుత్వంపై దాడి చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వానికి ప్రజలే బుద్ది చేబుతారని విమర్శించారు. కాగా ఈ నెలలో శివస్వామిని హౌజ్ అరెస్ట్ చేయడం ఇది రెండోసారి. హిందులపై కత్తి మహేశ్ చేసిన వాఖ్యల పట్ల చర్యలు తీసుకోవాలంటూ తహశీల్దార్‌కు వినతిపత్రం ఇవ్వడానికి యత్నించిన శివస్వామిని ఈ నెల 16న హౌజ్ అరెస్ట్ చేశారు. -
బ్రహ్మంగారి మాట నిజమౌతోంది
సాక్షి, ఏలూరు : పవిత్రమైన స్వామీజీలను బహిష్కరించడం, అరెస్టు చేయడం దుర్మార్గమని కోటిలింగాల శైవక్షేత్ర పీఠాధిపతి శివస్వామి అన్నారు. బుధవారం ఏలూరులో మీడియాతో మాట్లాడిన ఆయన హిందూసంస్థలపై జరుగుతున్న దాడులపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఈ నెల 19న (గురువారం) తెలుగు రాష్ట్రాల్లో జాతీయ రహదారుల దిగ్బంధానికి పిలుపునిచ్చారు. ఈ ఆందోళనల్లో అన్నీ ధార్మక సంస్థలు పాల్గొంటాయని తెలిపారు. టీటీడీలో అవకతవకలు బయటపెట్టేందుకు ఈ నెల 29నుండి హిందూ సమాజం రోడ్డెక్కుతుందని అన్నారు. ఈ సందర్భంగా విజయవాడ కనక దుర్గమ్మకు సారె సమర్పించిన అనంతరం 30 మంది పీఠాధిపతులతో చలో తిరుపతి పాదయాత్రకు శ్రీకారం చుట్టనున్నట్లు తెలిపారు. 300 మంది శిష్యులతో రోజూ 30 కిలోమీటర్లు మేర 15 రోజుల పాటు పాదయాత్ర కొనసాగుతుందన్నారు. 500 గ్రామాల్లో హిందూత్వంపై చైతన్యం తీసుకొచ్చి, ఆగస్టు 12న సాయంత్రం తిరుపతిలోని ఇందిరా మైదానంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని చెప్పారు. ఈ సభకు తెలుగు రాష్ట్రాలనుండి 100 మంది పీఠాధిపతులు పాల్గొననున్నట్లు వెల్లడించారు. తిరుమల గురించి బ్రహ్మంగారు ముందే చెప్పారని, కొండపైకి దారులన్నీ మూసుకుపోయి, ఆరుగురు దొంగలు స్వామి వారి ఆభరణాలు దోచుకుంటారని కాలజ్ఞానంలో చెప్పారని అన్నారు. తొమ్మిది రోజులు శ్రీవారి ఆలయాన్ని మూసివేస్తామనడంపై ఇప్పుడు అవే అనుమానాలు కలుగుతున్నాయని అన్నారు. ప్రభుత్వానికి నిజాయితీ చిత్తశుద్ధి ఉంటే కమిటీ వేయాలని, హిందూ సమాజానికి భరోసా ఇవ్వాలని డిమాండ్ శివస్వామి డిమాండ్ చేశారు. -
శైవక్షేత్ర పీఠాధీపతి శివస్వామి అరెస్ట్
-
పీఠాధిపతి అరెస్ట్.. శైవక్షేత్రం వద్ద ఉద్రిక్తత
సాక్షి, అమరావతి : టీడీపీ సర్కార్ ప్రజల వ్యక్తిగత స్వేచ్ఛను హరిస్తోందని, దేవాలయాలను సైతం కూల్చివేస్తూ అక్రమాలకు పాల్పుడుతున్నారని శైవక్షేత్ర పీఠాధీపతి శివస్వామి తీవ్ర ఆరోపణల చేశారు. నాలుగేళ్లుగా సీఎం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తనను మానసికంగా వేధిస్తోందని తెలిపారు. హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా సినీ విమర్శకుడు కత్తి మహేష్ చేసిన వ్యాఖ్యల పట్ల చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ క్రమంలో తహశీల్దార్‌కు వినతిపత్రం ఇవ్వడానికి యత్నించిన పీఠాధిపతి శివస్వామిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎమ్మార్వోకు వినతిపత్రం ఇవ్వడానికి వెళ్లినందుకు హౌస్ అరెస్ట్ చేశామని పోలీసులు చెబుతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు శివస్వామి హౌస్ అరెస్ట్ నేపథ్యంలో శైవక్షేత్రం చుట్టూ పోలీసు బలగాలు మోహరించినా ఉద్రిక్త వాతావరణం నెలకొన్నట్లు సమాచారం. హిందుత్వంపై జరుగుతున్న దాడులను క్షేత్రానికి చెందిన పలువురు ఖండించారు. శ్రీవారి ఆభరణాల మాయంపై ఏపీ ప్రభుత్వం కమిటీ వేయాలని డిమాండ్ చేశారు. కమిటీ వేసి విచారణ చేయకుంటే ఆరోపణల్లో నిజముందని భావించాల్సి ఉంటుందన్నారు. హిందుత్వంపై టీడీపీ సర్కార్ చేస్తున్న దాడులను నిరసిస్తూ చలో తిరుపతి కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ నెల 29న విజయవాడ నుంచి ప్రారంభం కానున్న పాదయాత్ర ఆగస్టు 12కు తిరుమల చేరుకుంటుందని వెల్లడించారు. 30 మంది స్వామిజీలు, 200 మంది శిష్యులు ఈ పాదయాత్రలో పాల్గొంటారని.. ఇందులో భాగంగా 500 గ్రామాల్లో సభలు నిర్వహిస్తామన్నారు. హిందుత్వంపై ప్రభుత్వం చేస్తున్న దాడులను ప్రజలకు వివరించి, ఏం జరిగినా సరే ఆగస్టు 13న తిరుపతి బంద్ నిర్వహిస్తామని శివస్వామి వివరించారు. -
రాష్ట్ర ప్రభుత్వమే హిందూ ధర్మంపై దాడులకు కారణం
-
ఏపీ ప్రభుత్వంపై శివస్వామి సంచలన వ్యాఖ్యలు
సాక్షి, విజయవాడ : హిందూ ధర్మంపై దాడులు జరుగుతున్నాయని శైవ క్షేత్రం పీఠాధిపతి శ్రీ శివస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వమే దీనికి కారణమని ధ్వజమెత్తారు. మతాలు, కులాల పరంగా ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. 13 జిల్లాల్లో ఉన్న హిందూ ధార్మిక సంస్థలని సమైక్యంగా జేఏసీ ఏర్పాటు చేశామని శివ స్వామి తెలిపారు. ‘2019లో హిందూ ధర్మాన్ని కాపాడతామని ఎవరైతే తమ మ్యానిఫెస్టోలో పెడతారో వారికి మా మద్దతు ఉంటుంది. దేవాలయాలను ప్రభుత్వం రాజకీయ పునరావాస కేంద్రాలుగా మార్చింది. ప్రభుత్వం హిందువుల స్వేచ్ఛను హరిస్తుంది. హిందూ దేవాలయాలను కూల్చివేస్తుంది. హిందూ ధర్మం గురించి మాట్లాడే వారిని టార్గెట్ చేసి వేధిస్తున్నారు. దేవాలయాల అదాయాన్ని ఆలయాల అభివృద్ధికి కాకుండా రాష్ట్ర ప్రభుత్వం జన్మభూమి కార్యక్రమాలకు వాడుకోవటం దారుణమని’ శివస్వామి విమర్శలు గుప్పించారు. దీక్షితులుపై కేసులు నమోదు చేయాలని ప్రభుత్వం ఆలోచించటం దారుణమని శివస్వామి మండిపడ్డారు. జనవరి నుంచి హిందూ ధర్మాన్ని కాపాడేందుకు యాత్రలు చేపట్టనున్నామని ఆయన తెలిపారు. టీటీడీ అధికారులకు మతిభ్రమించిందని శివస్వామి విమర్శించారు. నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరు కావటం నిబంధనలకు విరుద్ధమని, హిందూ ధర్మాన్ని ఎవరైతే పరిరక్షిస్తారో ఆ పార్టీకే హిందూ జేఏసీ సపోర్టు చేస్తుందని శివస్వామి తెలిపారు. -
తాళ్లాయపాలెం శైవక్షేత్రం వద్ద ఉద్రిక్తత
సాక్షి, గుంటూరు : గుంటూరు జిల్లా తాళ్లాయపాలెం శైవక్షేత్రం వద్ద ఉద్రిక్త చోటుచేసుకుంది. వైఎస్సార్ జిల్లా టీడీపీ మైదుకూరు నియోజకవర్గం ఇన్ఛార్జ్ పుట్టా సుధాకర్ యాదవ్‌ను తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్‌గా నియమించడాన్ని శైవక్షేత్రం పీఠాధిపతి శివస్వామి వ్యతిరేకించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శైవక్షేత్ర ముట్టడికి యాదవ సంఘాలు పిలుపునిచ్చాయి. ఆదివారం ఉదయం నుంచి ఇక్కడికి చేరుకున్న యాదవులు శైవక్షేత్రాన్ని ముట్టడించే యత్నం చేశారు. ముందు జాగ్రత్తగా శైవక్షేత్రం వద్ద భారీగా మోహరించిన పోలీసులు యాదవ సంఘాలను అడ్డుకున్నారు. అయినా శైవక్షేత్రంలోకి ప్రవేశించేందుకు యత్నించిన కొందరు యాదవులకు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. యాదవ సంఘ నాయకులను పోలీసులు తుళ్లూరు పోలీస్ స్టేషన్‌కు తరలిస్తున్నారు. శైవ క్షేత్రంపై జరగబోయే దాడి యావత్తు హిందూ ధర్మం, హిందువుల మీద దాడిగా పరిగణిస్తున్నామని, పుట్టా సుధాకర్ యాదవ్ కాకుండా హిందూ ధర్మానికి కట్టుబడి ఉన్న ఏ యాదవ సోదరుడిని నియమించినా మాకు ఎలాంటి అభ్యంతరం లేదని పీఠాధిపతి శివస్వామి ఇదివరకే స్పష్టం చేసిన విషయం తెలిసిందే. (టీటీడీ చైర్మన్‌గా ఆయన తప్ప, ఎవరైనా సరే!) -
టీటీడీ చైర్మన్‌గా ఆయన తప్ప, ఎవరైనా సరే!
సాక్షి, గుంటూరు : వైఎస్సార్ జిల్లా టీడీపీ మైదుకూరు నియోజకవర్గం ఇన్ఛార్జ్ పుట్టా సుధాకర్ యాదవ్‌ను తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్‌గా నియమించడం పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. టీటీడీ బోర్డు చైర్మన్‌గా ఆయన నియామకాన్ని గుంటూరు జిల్లా తాళ్లాయపాలెం శైవక్షేత్రం పీఠాధిపతి శివస్వామి వ్యతిరేకిస్తున్నారు. ‘హిందు దేవాలయ పరిరక్షణను దెబ్బ తీయడం కోసమే పుట్టా సుధాకర్ యాదవ్‌ను టీటీడీ బోర్డు చైర్మన్‌గా నియామకం చేసినట్లు అనిపిస్తోంది. 'ఆయన నియామకాన్ని వ్యతిరేకిస్తున్నందుకు రేపు (ఆదివారం) యాదవ సోదరులు శైవక్షేత్రం ముట్టడి చేయబోతున్నట్లు మాకు సమాచారం అందింది. దీనిపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తున్నాం. శైవ క్షేత్రంపై జరగబోయే దాడి యావత్తు హిందూ ధర్మం, హిందువుల మీద దాడిగా పరిగణిస్తున్నాం. పుట్టా సుధాకర్ యాదవ్ కాకుండా హిందూ ధర్మానికి కట్టుబడి ఉన్న ఏ యాదవ సోదరుడిని నియమించినా మాకు ఎలాంటి అభ్యంతరం లేదని' పీఠాధిపతి శివస్వామి తెలిపారు. తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్, ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడికి పుట్టా సుధాకర్ యాదవ్ వియ్యంకుడన్న విషయం తెలిసిందే. వచ్చే ఎన్నికల నాటికి మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డిని టీడీపీలోకి తీసుకొచ్చి మైదుకూరు టిక్కెట్ ఇవ్వాలని పార్టీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. మైదుకూరు సీటు ఆశిస్తున్న పుట్టా సుధాకర్‌ను రేసు నుంచి తప్పించేందుకే టీటీడీ చైర్మన్ పదవిని కట్టబెట్టారని సమాచారం. -
బ్లాక్ టికెట్లు అమ్ముకుని.. ఎంపీ అయ్యారు!
విజయవాడ నుంచి హైదరాబాద్‌కు నడిచే బస్సుల టికెట్లను బ్లాక్‌లో అమ్ముకుని కేశినేని నాని సంపద కూడగట్టుకున్నారని, దాంతోనే ఆయన ఎంపీ అయ్యారని విజయవాడకు చెందిన శివస్వామి మండిపడ్డారు. జీవితంలో ఇక ఎన్నడూ నాని గెలిచే ప్రసక్తి లేదని ఆయన స్పష్టం చేశారు. ఆలయాల కూల్చివేతలకు నిరసనగా విజయవాడలో హిందూ ధార్మిక పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించిన మహా సభలో ఆయన ఆవేశంగా మాట్లాడారు. తనకు నిన్నటి నుంచి అనేక బెదిరింపు కాల్స్ వస్తున్నాయని, విజయవాడ వీధుల్లో ఎలా తిరుగుతావో చూస్తామని అంటున్నారని.. తాను ప్రాణత్యాగానికి సైతం ఎప్పుడో సిద్ధమని చెప్పారు. తనను దొంగ స్వామి అంటూ నాని పిచ్చి తుగ్లక్‌లా మాట్లాడుతున్నారని, ఆలయ నిర్మాణాలలో తాను వెనకేసుకుంటున్నట్లు ఆయన ఆరోపించారని, అవన్నీ నిరాధారమని చెప్పారు. తన పూర్వీకులు స్వాతంత్ర్య సమర యోధులైనా, విజయవాడలో ఎక్కడా ఒక్క గజం స్థలం కూడా తీసుకోలేదని.. అలాగే తన బ్యాంకు ఖాతాలో కూడా ఎప్పుడూ 3వేల రూపాయలకు మించి ఉండవని.. అలాంటిది తనపై లేనిపోని అభాండాలు వేస్తున్నారని ఆయన అన్నారు. విజయవాడ ద్వారపాలకుడిని తీసేశారని, ఇది అత్యంత దారుణమని చెప్పారు. కోట్లాదిమంది హిందువుల మనోభావాలు గాయపరిచారని, తమ గుండెలు బద్దలయ్యాయని అన్నారు. మసీదు తొలగించడానికి 4 నెలల సమయం ఇచ్చారు.. హిందూ దేవాలయానికి 4 రోజులు కూడా ఇవ్వలేదని.. కేవలం ఒక్కరోజు సమయమే ఇచ్చారని చెప్పారు. మన సీఎం, మన పాలకులు అని చెప్పుకొంటున్నాం.. గానీ కడుపు చించుకుంటే కాళ్లమీద పడినట్లు అవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాణప్రతిష్ఠ చేసిన ఆలయాలను దారుణంగా కూల్చేశారని అన్నారు. రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాలలో కూడా ఆలయాలను కూల్చేశారని టీడీపీ నేతలు చెబుతున్నారని... కానీ అక్కడ దానికి ముందుగానే స్థానిక పీఠాధిపతుల నుంచి మఠాధిపతులు, ఇతరులు అందరినీ పిలిపించి, వాళ్లతో చర్చించారని.. శాస్త్రోక్తంగా తొలగింపు పనులు చేపట్టడంతో పాటు వేరేచోట ఆలయనిర్మాణానికి భూమి, నిధులు అన్నీ ఇచ్చారని చెప్పారు. అక్కడ కూడా, ముందుగా ఆలయ వర్గాలనే గోడ కూల్చివేత మొదలుపెట్టమని చెప్పి.. ఆ తర్వాత వాళ్ల ఆధ్వర్యంలోనే ఆలయ తొలగింపు పనులు చేపట్టారని, ఇక్కడ మాత్రం మంచీ చెడూ చూడకుండా రాత్రికి రాత్రే ఇష్టారాజ్యంగా ఆలయాలు కూల్చేసి విగ్రహాలను మునిసిపల్ ఆఫీసులలో పారేశారని మండిపడ్డారు. ఆలయాలతో ఆలయాలతో వ్యాపారాలు చేశామా.. ఆలయాల పేరుతో వ్యాపారం చేస్తున్నామని కొందరు మంత్రులు వ్యాఖ్యానిస్తున్నారని.. ఎన్నికల సమయంలో నామినేషన్లు వేయడానికి ముందుగా మీరు ఆలయానికి వెళ్లి ఆ పత్రాలతో పూజలు చేయించడం లేదా.. అది వ్యాపార ప్రయోజనం అనిపించలేదా అని శివస్వామి ఘాటుగా ప్రశ్నించారు. ఆ మంత్రి తక్షణమే సాధుపరిషత్కు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. -
ఆలయాల పరిరక్షణకు ప్రాణాలైనా ఇస్తాం
-శివక్షేత్రం పీఠాధిపతి శివస్వామి విజయవాడ (మధురానగర్): అభివృద్ధి పేరిట ఆలయాల్లో ఒక్క ఇటుకరాయిని తొలగించినా సహించబోమని గుంటూరు జిల్లా తాళ్లాయపాలెం శివక్షేత్రం పీఠాధిపతి శివస్వామి హెచ్చరించారు. వాటి పరిరక్షణకు ప్రాణత్యాగం చేయడానికి కూడా సిద్ధమని చెప్పారు. విజయవాడలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆలయాల రక్షణ కోసం అవసరమైతే రాష్ట్రంలోని పీఠాధిపతులతో కలసి నిరాహారదీక్ష చేస్తామని పేర్కొన్నారు. పుష్కరాల పేరుతో ఆలయాలను తొలగించడం విచారకరమన్నారు. ఇక్కడ ఆలయాలను పడగొడుతుంటే.. ముఖ్యమంత్రి చంద్రబాబు చైనాలో పర్యటిస్తున్నారని ఎద్దేవా చేశారు. గోదావరి పుష్కరాల్లో 108 నాగప్రతిమలు, రెండు శివలింగాలను తొలగించి ఘాట్‌ను ఏర్పాటు చేయడం వల్లే అపశ్రుతి జరిగి భక్తులు ప్రాణాలు కోల్పోయారన్నారు. ఇక్కడా ఆలయాలు తొలగించి పనులు చేస్తున్నారన్నారు. దీనివల్ల అపశ్రుతులు జరగకుండా శుక్రవారం ఆలయాల్లో అఖండ నామసంకీర్తన, మూడోతేదీన హోమాలు, నాలుగున 352 పీఠాలకు చెందిన పీఠాధిపతులు, మఠాధిపతులు, సాధుసంత్‌ల ఆధ్వర్యంలో విజయవాడలో ప్రదర్శన నిర్వహిస్తామని చెప్పారు. బీజేపీకి చెందిన నరసాపురం ఎంపీ గోకరాజు గంగరాజు మాట్లాడుతూ టీడీపీ నాయకులు గూండాలు, రౌడీల మాదిరిగా వ్యవహరిస్తూ హిందువుల మనోభావాలను కించపరుస్తున్నారన్నారు. సమావేశంలో హిందూ ధర్మపరిరక్షణ సమితి అధ్యక్షుడు కె.విద్యాధరరావు, విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు హరినాథ్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరాజు, నగర అధ్యక్షుడు ఉమామహేశ్వరరాజు పాల్గొన్నారు. -
'అలా పిలిస్తే.. మంత్రి అయినా శిక్షించాల్సిందే'
విజయవాడ: పోలీసులను రేయ్ అని పిలవడం మంచిదికాదనీ, అలా పిలిస్తే మంత్రి అయినా సరే శిక్షించాల్సిందేనని బీజేపీ ఎంపీ గోకరాజు గంగరాజు వ్యాఖ్యానించారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. నోటీసులు ఇవ్వకుండా ఆలయాలు తొలగించడం సరికాదన్నారు. గతంలో ముస్లిం రాజులు ఏ విధంగా ఆలయాలు తొలగించారో.. ఇప్పుడు అదేవిధంగా ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. దీని వల్ల భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయని చెప్పారు. దీనిని వ్యతిరేకించినవారిని బెదిరిస్తున్నారని అన్నారు. ప్రజాప్రతినిధులు బెదిరింపులకు పాల్పడడం సరికాదని గోకరాజు గంగ రాజు తెలిపారు. ఇదిలా ఉండగా, గోదావరి పుష్కర పనుల్లో ప్రొక్లెయినర్ పెట్టి దేవుడి విగ్రహాలు తొలగించారని శివస్వామి ఆరోపించారు. అదే ప్రదేశంలో భక్తులు కూడా మృతిచెందినట్టు చెప్పారు. విజయవాడలో ఒక్క ఆలయం నుంచి ఒక ఇటుక తొలగించినా ఊరుకోమని అన్నారు. ఇప్పటివరకూ తొలగించిన ఆలయాలను అక్కడే నిర్మించాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఆలయాల కోసం తాను ప్రాణ త్యాగానికైనా సిద్ధమని శివస్వామి స్పష్టం చేశారు.