
సాక్షి, విజయవాడ: ఇంద్రకీలాద్రిపై కొండ చరియలు విరిగిపడ్డ ప్రాంతాన్ని నిపుణుల కమిటీ పరిశీలించింది. ఈ సందర్భంగా జియో ఎక్స్‌పర్ట్ కమిటీ సభ్యులు త్రిమూర్తిరాజు మాట్లాడుతూ.. ఓంకారం మలుపు, మౌనముని గుడి వద్ద కొండచరియలు విరిగిపడే అవకాశం ఉందని తెలిపారు. ‘‘ఇంద్రకీలాద్రిపై కొండలు మట్టి, రాళ్లు కలిసి ఉన్నాయి. వర్షాలు ప్రభావంతో జారి పడుతున్నాయి. ప్రమాదాలను అరికట్టే విధంగా అలారం ఏర్పాటు, ఐరెన్ మెష్ మరింత పటిష్టం చేయాలి. వదులుగా ఉన్న కొండచరియలను తొలగించాలి’’ అని పేర్కొన్నారు. ఈ ఘటనపై వారం రోజుల్లో నివేదిక అందజేస్తామని వెల్లడించారు. కాగా విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కనకదుర్గ ఆలయ ఆవరణలో బుధవారం కొండ చరియలు విరిగిపడిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో ఇద్దరు ఆలయ ఉద్యోగులు, ఒక కానిస్టేబుల్ గాయపడ్డారు.(చదవండి: ఇంద్రకీలాద్రిపై విరిగిపడ్డ కొండ చరియలు)
సీఎం జగన్ స్పందన అభినందనీయం
శైవక్షేత్ర పీఠాధిపతి శివస్వామి నేడు ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొండచరియలు విరిగిపడిన వెంటనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మెహన్‌రెడ్డి స్పందించడం అభినందనీయమన్నారు. దుర్గగుడి మాస్టర్ ప్లాన్‌కు అవసరమైన నిధులను తక్షణమే విడుదల చేయాలని సీఎం ఆదేశించడం మంచి నిర్ణయమని, ఇంద్రకీలాద్రి అభివృద్ధికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని హర్షం వ్యక్తం చేశారు.