Vijayawada: Indrakeeladri Dussehra Celebrations Start From Today - Sakshi
Sakshi News home page

నేటినుంచి ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు

Published Thu, Oct 7 2021 4:47 AM | Last Updated on Thu, Oct 7 2021 8:43 AM

Dussehra celebrations on Vijayawada Indrakeeladri from today - Sakshi

అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించేందుకు వస్తున్న విజయవాడ నగర పోలీస్‌ కమిషనర్‌ బత్తిన శ్రీనివాసులు దంపతులు

సాక్షి, విజయవాడ: దసరా శరన్నవరాత్రి మహోత్సవాలకు విజయవాడ ఇంద్రకీలాద్రి ముస్తాబైంది. నేటి (గురువారం) నుంచి ఈ నెల 15వ తేదీ వరకు ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. మూలానక్షత్రమైన ఈ నెల 12న కనకదుర్గ అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పట్టువ్రస్తాలు సమర్పిస్తారని ఆలయ అధికారులు తెలిపారు. దసరా ఉత్సవాల ప్రారంభానికి ముందురోజున వన్‌టౌన్‌ పోలీసులు అమ్మవారికి పట్టువ్రస్తాలు సమర్పించడం ఆనవాయితీ. తర్వాత రోజుల్లో నగర పోలీసు కమిషనర్‌ సమర్పించేవారు. ఈ నేపథ్యంలో నగర పోలీసు కమిషనర్‌ (సీపీ) బత్తిన శ్రీనివాసులు కుటుంబసమేతంగా బుధవారం రాత్రి ఇంద్రకీలాద్రికి వచ్చి అమ్మవారికి పట్టువ్రస్తాలు సమర్పించారు. 

నేడు ఉదయం 9 గంటల నుంచి అమ్మవారి దర్శనం 
నవరాత్రి ఉత్సవాల్లో తొలిరోజు గురువారం తెల్లవారుజామున మూడు గంటలకు వేద పండితులు, అర్చకులు సుప్రభాతసేవతో అమ్మవారిని మేల్కొలిపి, శాస్త్రోక్తంగా స్నపనాభిషేకం, బాలభోగ నివేదన, నిత్యార్చనలు చేస్తారు. అనంతరం ఉదయం 9 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. ఆ తర్వాత రోజు నుంచి తెల్లవారుజామున 4 గంటల నుంచి దర్శనాలకు అనుమతి ఇస్తారు. అమ్మవారి దర్శనానికి రోజుకు 10 వేలమందిని మాత్రమే అనుమతిస్తారు. 4 వేలమందికి ఉచితంగా, 3 వేలమంది వంతున రూ.100, రూ.300 టికెట్లతో దర్శనం కల్పించనున్నారు. ఆన్‌లైన్‌ టికెట్‌ లేకుండా వచ్చిన భక్తులకు అప్పటికప్పుడు దర్శనం టికెట్లు విక్రయించేందుకు వీఎంసీ కార్యాలయం ఎదుట, పున్నమిఘాట్‌ వద్ద దుర్గగుడి టోల్‌గేట్, ఓం టర్నింగ్‌ల వద్ద కరెంటు బుకింగ్‌ కౌంటర్లు ఏర్పాటు చేశారు. కరోనా కారణంగా అంతరాలయ దర్శనాలను రద్దుచేసి లఘు దర్శనం ఏర్పాటు చేశారు. 

అన్నదానం బదులుగా ప్రసాదాలు 
కరోనా నిబంధనలు పాటిస్తూ అన్నదానాన్ని నిలుపుదల చేశారు. దానికి బదులుగా ఉదయం 5 గంటల నుంచి 11 గంటల వరకు బెల్లం పొంగలి, 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు సాంబార్‌ రైస్, పెరుగు అన్నం ప్యాకెట్లు, సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు బెల్లం పొంగలి భక్తులకు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేశారు.  

నేడు అమ్మవారిని దర్శించుకోనున్న గవర్నర్‌ 
రాష్ట్ర గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ గురువారం ఇంద్రకీలాద్రిపై శ్రీస్వర్ణకవచాలంకృత దుర్గాదేవి అలంకారంలో కనకదుర్గమ్మను దర్శించుకోనున్నారు. గవర్నర్‌ రానున్నందున ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.  

నేటి అలంకారం 
శ్రీస్వర్ణ కవచాలంకృత దుర్గాదేవి
దేవీశరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా తొలిరోజైన ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి గురువారం విజయవాడ కనకదుర్గ అమ్మవారిని శ్రీస్వర్ణకవచాలంకృత దుర్గాదేవిగా అలంకరిస్తారు. అమ్మవారిని స్వర్ణకవచాలంకృత దుర్గాదేవిగా దర్శించుకోవడంతో సకల దారిద్యాలు తొలిగిపోయి సుఖసంతోషాలతో ఉంటామని భక్తుల నమ్మకం.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement