సాక్షి, ఏలూరు : పవిత్రమైన స్వామీజీలను బహిష్కరించడం, అరెస్టు చేయడం దుర్మార్గమని కోటిలింగాల శైవక్షేత్ర పీఠాధిపతి శివస్వామి అన్నారు. బుధవారం ఏలూరులో మీడియాతో మాట్లాడిన ఆయన హిందూసంస్థలపై జరుగుతున్న దాడులపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఈ నెల 19న (గురువారం) తెలుగు రాష్ట్రాల్లో జాతీయ రహదారుల దిగ్బంధానికి పిలుపునిచ్చారు. ఈ ఆందోళనల్లో అన్నీ ధార్మక సంస్థలు పాల్గొంటాయని తెలిపారు.
టీటీడీలో అవకతవకలు బయటపెట్టేందుకు ఈ నెల 29నుండి హిందూ సమాజం రోడ్డెక్కుతుందని అన్నారు. ఈ సందర్భంగా విజయవాడ కనక దుర్గమ్మకు సారె సమర్పించిన అనంతరం 30 మంది పీఠాధిపతులతో చలో తిరుపతి పాదయాత్రకు శ్రీకారం చుట్టనున్నట్లు తెలిపారు. 300 మంది శిష్యులతో రోజూ 30 కిలోమీటర్లు మేర 15 రోజుల పాటు పాదయాత్ర కొనసాగుతుందన్నారు. 500 గ్రామాల్లో హిందూత్వంపై చైతన్యం తీసుకొచ్చి, ఆగస్టు 12న సాయంత్రం తిరుపతిలోని ఇందిరా మైదానంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని చెప్పారు.
ఈ సభకు తెలుగు రాష్ట్రాలనుండి 100 మంది పీఠాధిపతులు పాల్గొననున్నట్లు వెల్లడించారు. తిరుమల గురించి బ్రహ్మంగారు ముందే చెప్పారని, కొండపైకి దారులన్నీ మూసుకుపోయి, ఆరుగురు దొంగలు స్వామి వారి ఆభరణాలు దోచుకుంటారని కాలజ్ఞానంలో చెప్పారని అన్నారు. తొమ్మిది రోజులు శ్రీవారి ఆలయాన్ని మూసివేస్తామనడంపై ఇప్పుడు అవే అనుమానాలు కలుగుతున్నాయని అన్నారు. ప్రభుత్వానికి నిజాయితీ చిత్తశుద్ధి ఉంటే కమిటీ వేయాలని, హిందూ సమాజానికి భరోసా ఇవ్వాలని డిమాండ్ శివస్వామి డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment