శైవ క్షేత్రం పీఠాధిపతి శ్రీ శివస్వామి
సాక్షి, విజయవాడ : హిందూ ధర్మంపై దాడులు జరుగుతున్నాయని శైవ క్షేత్రం పీఠాధిపతి శ్రీ శివస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వమే దీనికి కారణమని ధ్వజమెత్తారు. మతాలు, కులాల పరంగా ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. 13 జిల్లాల్లో ఉన్న హిందూ ధార్మిక సంస్థలని సమైక్యంగా జేఏసీ ఏర్పాటు చేశామని శివ స్వామి తెలిపారు.
‘2019లో హిందూ ధర్మాన్ని కాపాడతామని ఎవరైతే తమ మ్యానిఫెస్టోలో పెడతారో వారికి మా మద్దతు ఉంటుంది. దేవాలయాలను ప్రభుత్వం రాజకీయ పునరావాస కేంద్రాలుగా మార్చింది. ప్రభుత్వం హిందువుల స్వేచ్ఛను హరిస్తుంది. హిందూ దేవాలయాలను కూల్చివేస్తుంది. హిందూ ధర్మం గురించి మాట్లాడే వారిని టార్గెట్ చేసి వేధిస్తున్నారు. దేవాలయాల అదాయాన్ని ఆలయాల అభివృద్ధికి కాకుండా రాష్ట్ర ప్రభుత్వం జన్మభూమి కార్యక్రమాలకు వాడుకోవటం దారుణమని’ శివస్వామి విమర్శలు గుప్పించారు.
దీక్షితులుపై కేసులు నమోదు చేయాలని ప్రభుత్వం ఆలోచించటం దారుణమని శివస్వామి మండిపడ్డారు. జనవరి నుంచి హిందూ ధర్మాన్ని కాపాడేందుకు యాత్రలు చేపట్టనున్నామని ఆయన తెలిపారు. టీటీడీ అధికారులకు మతిభ్రమించిందని శివస్వామి విమర్శించారు. నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరు కావటం నిబంధనలకు విరుద్ధమని, హిందూ ధర్మాన్ని ఎవరైతే పరిరక్షిస్తారో ఆ పార్టీకే హిందూ జేఏసీ సపోర్టు చేస్తుందని శివస్వామి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment