temples collapse
-
శైవక్షేత్ర పీఠాధీపతి శివస్వామి అరెస్ట్
-
పీఠాధిపతి అరెస్ట్.. శైవక్షేత్రం వద్ద ఉద్రిక్తత
సాక్షి, అమరావతి : టీడీపీ సర్కార్ ప్రజల వ్యక్తిగత స్వేచ్ఛను హరిస్తోందని, దేవాలయాలను సైతం కూల్చివేస్తూ అక్రమాలకు పాల్పుడుతున్నారని శైవక్షేత్ర పీఠాధీపతి శివస్వామి తీవ్ర ఆరోపణల చేశారు. నాలుగేళ్లుగా సీఎం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తనను మానసికంగా వేధిస్తోందని తెలిపారు. హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా సినీ విమర్శకుడు కత్తి మహేష్ చేసిన వ్యాఖ్యల పట్ల చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ క్రమంలో తహశీల్దార్‌కు వినతిపత్రం ఇవ్వడానికి యత్నించిన పీఠాధిపతి శివస్వామిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎమ్మార్వోకు వినతిపత్రం ఇవ్వడానికి వెళ్లినందుకు హౌస్ అరెస్ట్ చేశామని పోలీసులు చెబుతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు శివస్వామి హౌస్ అరెస్ట్ నేపథ్యంలో శైవక్షేత్రం చుట్టూ పోలీసు బలగాలు మోహరించినా ఉద్రిక్త వాతావరణం నెలకొన్నట్లు సమాచారం. హిందుత్వంపై జరుగుతున్న దాడులను క్షేత్రానికి చెందిన పలువురు ఖండించారు. శ్రీవారి ఆభరణాల మాయంపై ఏపీ ప్రభుత్వం కమిటీ వేయాలని డిమాండ్ చేశారు. కమిటీ వేసి విచారణ చేయకుంటే ఆరోపణల్లో నిజముందని భావించాల్సి ఉంటుందన్నారు. హిందుత్వంపై టీడీపీ సర్కార్ చేస్తున్న దాడులను నిరసిస్తూ చలో తిరుపతి కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ నెల 29న విజయవాడ నుంచి ప్రారంభం కానున్న పాదయాత్ర ఆగస్టు 12కు తిరుమల చేరుకుంటుందని వెల్లడించారు. 30 మంది స్వామిజీలు, 200 మంది శిష్యులు ఈ పాదయాత్రలో పాల్గొంటారని.. ఇందులో భాగంగా 500 గ్రామాల్లో సభలు నిర్వహిస్తామన్నారు. హిందుత్వంపై ప్రభుత్వం చేస్తున్న దాడులను ప్రజలకు వివరించి, ఏం జరిగినా సరే ఆగస్టు 13న తిరుపతి బంద్ నిర్వహిస్తామని శివస్వామి వివరించారు. -
రాష్ట్ర ప్రభుత్వమే హిందూ ధర్మంపై దాడులకు కారణం
-
ఏపీ ప్రభుత్వంపై శివస్వామి సంచలన వ్యాఖ్యలు
సాక్షి, విజయవాడ : హిందూ ధర్మంపై దాడులు జరుగుతున్నాయని శైవ క్షేత్రం పీఠాధిపతి శ్రీ శివస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వమే దీనికి కారణమని ధ్వజమెత్తారు. మతాలు, కులాల పరంగా ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. 13 జిల్లాల్లో ఉన్న హిందూ ధార్మిక సంస్థలని సమైక్యంగా జేఏసీ ఏర్పాటు చేశామని శివ స్వామి తెలిపారు. ‘2019లో హిందూ ధర్మాన్ని కాపాడతామని ఎవరైతే తమ మ్యానిఫెస్టోలో పెడతారో వారికి మా మద్దతు ఉంటుంది. దేవాలయాలను ప్రభుత్వం రాజకీయ పునరావాస కేంద్రాలుగా మార్చింది. ప్రభుత్వం హిందువుల స్వేచ్ఛను హరిస్తుంది. హిందూ దేవాలయాలను కూల్చివేస్తుంది. హిందూ ధర్మం గురించి మాట్లాడే వారిని టార్గెట్ చేసి వేధిస్తున్నారు. దేవాలయాల అదాయాన్ని ఆలయాల అభివృద్ధికి కాకుండా రాష్ట్ర ప్రభుత్వం జన్మభూమి కార్యక్రమాలకు వాడుకోవటం దారుణమని’ శివస్వామి విమర్శలు గుప్పించారు. దీక్షితులుపై కేసులు నమోదు చేయాలని ప్రభుత్వం ఆలోచించటం దారుణమని శివస్వామి మండిపడ్డారు. జనవరి నుంచి హిందూ ధర్మాన్ని కాపాడేందుకు యాత్రలు చేపట్టనున్నామని ఆయన తెలిపారు. టీటీడీ అధికారులకు మతిభ్రమించిందని శివస్వామి విమర్శించారు. నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరు కావటం నిబంధనలకు విరుద్ధమని, హిందూ ధర్మాన్ని ఎవరైతే పరిరక్షిస్తారో ఆ పార్టీకే హిందూ జేఏసీ సపోర్టు చేస్తుందని శివస్వామి తెలిపారు. -
'ఆలయాలను కూల్చివేయడం దారుణం'
తిరుపతి: విజయవాడలో ఆలయాలను కూల్చివేయడం దారుణమని వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి విమర్శించారు. హిందువుల మనోభావాలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం దెబ్బతీసిందని మండిపడ్డారు. సోమవారం ఆయన తిరుపతిలో విలేకరులతో మాట్లాడారు. రోడ్ల విస్తరణ పేరుతో రాత్రికి రాత్రే ఆలయాలు కూల్చివేయడం మహాపాపమని అన్నారు. ప్రత్యామ్నయంగా ఆలయాలను ఏర్పాటు చేశాక చర్యలు తీసుకోవాల్సిందని పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి అభిప్రాయపడ్డారు. -
'వీధి రౌడీల్లా వ్యవహరించడం దారుణం'
విజయవాడ: వీధి రౌడీల్లాగా ప్రజాప్రతినిధులు వ్యవహరించడం దారుణమని ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి సురేష్ రెడ్డి ధ్వజమెత్తారు. బాధ్యత గల పదవిలో ఉన్న టీడీపీ నేత బుద్ధా వెంకన్న అసాంఘీక వ్యక్తులను ముందు పెట్టి దౌర్జన్యం చేస్తున్నారని మండిపడ్డారు. ఆదివారం విజయవాడలో సురేష్‌రెడ్డి విలేకరులతో మాట్లాడారు. అభివృద్ధి పేరుతో ఆలయాల తొలగింపు సరికాదన్నారు. హిందువుల మనోభావాలను దెబ్బతీయొద్దని సూచించారు. హృదయ విచారంగా దేవుళ్ల విగ్రహాలను తొలగిస్తున్నారని వాపోయారు. స్వామీజీలు, మఠాధిపతులు కూడా విగ్రహాల తొలగింపును ఖండిస్తున్నారని చెప్పారు. గుజరాత్లో 300 గుళ్లు తొలగించారని టీడీపీ ఎంపీ కేశినేని నాని వ్యాఖ్యానించడం సరికాదని అన్నారు. బీజేపీని విమర్శించే వాళ్లపై సీఎం చంద్రబాబు నాయుడు చర్యలు తీసుకోవాలని సురేష్‌రెడ్డి డిమాండ్ చేశారు. -
'మనోభావాలను ప్రభుత్వం దెబ్బతీసింది'
విజయవాడ: హిందువుల మనోభావాలను టీడీపీ ప్రభుత్వం దెబ్బతీసిందని శైవక్షేత్రం పీఠాధిపతి శివస్వామి వ్యాఖ్యానించారు. 1903 నుంచి ఉన్న ఆంజనేయ స్వామి విగ్రహాలను కూల్చేశారని మండిపడ్డారు. ఆదివారం ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడారు. రాహు, కేతువుల ఆలయాన్ని తొలగించడం ప్రభుత్వానికే గండమని అన్నారు. కృష్ణా మందిరాన్ని ఉంచుతామని చెప్పి కూల్చేశారని ధ్వజమెత్తారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా రేపు ర్యాలీ చేస్తామని శివస్వామి వెల్లడించారు. -
'అలా పిలిస్తే.. మంత్రి అయినా శిక్షించాల్సిందే'
విజయవాడ: పోలీసులను రేయ్ అని పిలవడం మంచిదికాదనీ, అలా పిలిస్తే మంత్రి అయినా సరే శిక్షించాల్సిందేనని బీజేపీ ఎంపీ గోకరాజు గంగరాజు వ్యాఖ్యానించారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. నోటీసులు ఇవ్వకుండా ఆలయాలు తొలగించడం సరికాదన్నారు. గతంలో ముస్లిం రాజులు ఏ విధంగా ఆలయాలు తొలగించారో.. ఇప్పుడు అదేవిధంగా ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. దీని వల్ల భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయని చెప్పారు. దీనిని వ్యతిరేకించినవారిని బెదిరిస్తున్నారని అన్నారు. ప్రజాప్రతినిధులు బెదిరింపులకు పాల్పడడం సరికాదని గోకరాజు గంగ రాజు తెలిపారు. ఇదిలా ఉండగా, గోదావరి పుష్కర పనుల్లో ప్రొక్లెయినర్ పెట్టి దేవుడి విగ్రహాలు తొలగించారని శివస్వామి ఆరోపించారు. అదే ప్రదేశంలో భక్తులు కూడా మృతిచెందినట్టు చెప్పారు. విజయవాడలో ఒక్క ఆలయం నుంచి ఒక ఇటుక తొలగించినా ఊరుకోమని అన్నారు. ఇప్పటివరకూ తొలగించిన ఆలయాలను అక్కడే నిర్మించాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఆలయాల కోసం తాను ప్రాణ త్యాగానికైనా సిద్ధమని శివస్వామి స్పష్టం చేశారు.