'వీధి రౌడీల్లా వ్యవహరించడం దారుణం'
విజయవాడ: వీధి రౌడీల్లాగా ప్రజాప్రతినిధులు వ్యవహరించడం దారుణమని ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి సురేష్ రెడ్డి ధ్వజమెత్తారు. బాధ్యత గల పదవిలో ఉన్న టీడీపీ నేత బుద్ధా వెంకన్న అసాంఘీక వ్యక్తులను ముందు పెట్టి దౌర్జన్యం చేస్తున్నారని మండిపడ్డారు. ఆదివారం విజయవాడలో సురేష్‌రెడ్డి విలేకరులతో మాట్లాడారు. అభివృద్ధి పేరుతో ఆలయాల తొలగింపు సరికాదన్నారు. హిందువుల మనోభావాలను దెబ్బతీయొద్దని సూచించారు.
హృదయ విచారంగా దేవుళ్ల విగ్రహాలను తొలగిస్తున్నారని వాపోయారు. స్వామీజీలు, మఠాధిపతులు కూడా విగ్రహాల తొలగింపును ఖండిస్తున్నారని చెప్పారు. గుజరాత్‌లో 300 గుళ్లు తొలగించారని టీడీపీ ఎంపీ కేశినేని నాని వ్యాఖ్యానించడం సరికాదని అన్నారు. బీజేపీని విమర్శించే వాళ్లపై సీఎం చంద్రబాబు నాయుడు చర్యలు తీసుకోవాలని సురేష్‌రెడ్డి డిమాండ్ చేశారు.