సాక్షి, గుంటూరు : వైఎస్సార్ జిల్లా టీడీపీ మైదుకూరు నియోజకవర్గం ఇన్‌ఛార్జ్ పుట్టా సుధాకర్ యాదవ్‌ను తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్‌గా నియమించడం పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. టీటీడీ బోర్డు చైర్మన్‌గా ఆయన నియామకాన్ని గుంటూరు జిల్లా తాళ్లాయపాలెం శైవక్షేత్రం పీఠాధిపతి శివస్వామి వ్యతిరేకిస్తున్నారు. ‘హిందు దేవాలయ పరిరక్షణను దెబ్బ తీయడం కోసమే పుట్టా సుధాకర్ యాదవ్‌ను టీటీడీ బోర్డు చైర్మన్‌గా నియామకం చేసినట్లు అనిపిస్తోంది.
'ఆయన నియామకాన్ని వ్యతిరేకిస్తున్నందుకు రేపు (ఆదివారం) యాదవ సోదరులు శైవక్షేత్రం ముట్టడి చేయబోతున్నట్లు మాకు సమాచారం అందింది. దీనిపై స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తున్నాం. శైవ క్షేత్రంపై జరగబోయే దాడి యావత్తు హిందూ ధర్మం, హిందువుల మీద దాడిగా పరిగణిస్తున్నాం. పుట్టా సుధాకర్ యాదవ్ కాకుండా హిందూ ధర్మానికి కట్టుబడి ఉన్న ఏ యాదవ సోదరుడిని నియమించినా మాకు ఎలాంటి అభ్యంతరం లేదని' పీఠాధిపతి శివస్వామి తెలిపారు.
తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్, ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష‌్ణుడికి పుట్టా సుధాకర్ యాదవ్ వియ్యంకుడన్న విషయం తెలిసిందే. వచ్చే ఎన్నికల నాటికి మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డిని టీడీపీలోకి తీసుకొచ్చి మైదుకూరు టిక్కెట్ ఇవ్వాలని పార్టీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. మైదుకూరు సీటు ఆశిస్తున్న పుట్టా సుధాకర్‌ను రేసు నుంచి తప్పించేందుకే టీటీడీ చైర్మన్ పదవిని కట్టబెట్టారని సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment