
'కాపులను ఎగతాళి చేస్తే ఊరుకోం'
కిర్లంపూడి(తూర్పుగోదావరి): కాపు కులస్తులను ఎగతాళి చేస్తే చూస్తూ ఊరుకోబోమని, తమ ఆగ్రహానికి గురైతే ముఖ్యమంత్రులు కుర్చీ దిగిపోవాల్సి వస్తుందని మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం హెచ్చరించారు. బుధవారం తూర్పు గోదావరి జిల్లా నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో కాపు యువత, విద్యార్థి నాయకులు ర్యాలీగా కిర్లంపూడి వచ్చి ముద్రగడను కలుసుకున్నారు. వారినుద్దేశించి ఆయన మాట్లాడుతూ భావితరాల కోసం, చంద్రబాబు ఇచ్చిన ఎన్నికల హామీలను సాధించుకోవడం కోసం కాపు యువత నడుం బిగించాలన్నారు.
అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు నిర్వహించిన పాదయాత్రలో, బహిరంగ సభల్లో మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోగా కాపులను బీసీల జాబితాలో కలపడమే కాక కాపుల అభివృద్ధికి ఏటా రూ. వెయ్యి కోట్లు కేటాయించి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తానని మాయమాటలు చెప్పారన్నారు.
అధికారంలోకి వచ్చిన చంద్రబాబు రెండేళ్లు కావస్తున్నా ఇంత వరకూ వారి అభివృద్ధికి చర్యలు తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాల్లో ఉన్న కాపులను సమీకరించి ఎన్నికల మేనిఫెస్టోలో కాపులకు ఇచ్చిన హామీలను అమలు పరిచే వరకు దశలవారీగా నిరంతర పోరాటం చేస్తామన్నారు. డిసెంబర్ చివరిలో లేదా సంక్రాంతి వెళ్లాక ప్రతి జిల్లాలో పర్యటించి, కాపులను సమీకరించి చైతన్య పరిచేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.