మమ్మల్ని ఎస్సీ జాబితాలో చేర్చండి
మమ్మల్ని ఎస్సీ జాబితాలో చేర్చండి
Published Wed, Oct 19 2016 12:32 AM | Last Updated on Tue, Oct 9 2018 4:20 PM
ధర్మవరం రూరల్ : ఇతర రాష్ట్రాల మాదిరిగా తమను ఎస్సీ జాబితాలో చేర్చి ఆదుకోవాలని తోలుబొమ్మల కళాకారులు కోరారు. కాపులను బీసీ జాబితాలో చేర్చే అంశంలో సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు జిల్లాకు వచ్చిన జస్టిస్ మంజునాథ్ కమిషన్ సభ్యులు మంగళవారం ధర్మవరం మండలంలోని నిమ్మలకుంట గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో జస్టిస్ కేఎల్ మంజునాథ్, సభ్యులు ఆచార్య వెంకటేశ్వర సుబ్రమణ్యం, ఆచార్య మల్లెల పూర్ణచంద్రరావు, సత్యనారాయణ, కార్యదర్శి ఎ.కృష్ణమోహన్‌లు తోలుబొమ్మల కళాకారులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తంగిశెట్టి అనే కళాకారుడు మాట్లాడుతూ బీసీ–బీలో ఉన్న తమకు ప్రభుత్వ పథకాలు సక్రమంగా చేరడం లేదన్నారు. ఇతర రాష్ట్రాలలో తోలుబొమ్మల కళాకారులు దళితులుగా ఉంటూ ప్రయోజనాలు పొందుతున్నారన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని తోలుబొమ్మ కళాకారులను కూడా ఎస్సీ జాబితాలోకి చేర్చాలని కోరారు. తోలుబొమ్మల కళాకారులకు ప్రభుత్వం పింఛన్ సదుపాయం కల్పించాలని రంగమ్మ అనే కళాకారిణి కోరారు. మీ విజ్ఞప్తులను ప్రభుత్వానికి నివేదిస్తామని సభ్యులు తెలిపారు. అనంతరం గ్రామంలో తిరిగి కళాకారులు ఇళ్లలో బొమ్మలు తయారు చేసే విధానాన్ని వారు పరిశీలించారు. జాతీయ అవార్డు గ్రహీత దళవాయి చలపతితో కమిషన్ చైర్మన్ ముచ్చటించారు. కార్యక్రమంలో ఆర్‌డీఓ బాలానాయక్, బీసీ సంక్షేమ శాఖ ఉప సంచాలకులు రమాభార్గవి, డీఎస్పీ వేణుగోపాల్, ఎంపీడీఓ సుధాకర్‌రెడ్డి, డిప్యూటీ తహసీల్దార్ నారాయణమూర్తి, బీసీ సంక్షేమ అధికారి పుల్లన్న, ఐకేపీ ఏరియా కోఆర్డినేటర్ ఈశ్వరయ్య, ఏపీఎం శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement