బాలికపై అత్యాచారంకేసులో న్యాయం కోరుతూ రాస్తారోకో
సత్తెనపల్లి: మైనర్ బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన నిందితులను శిక్షించాలని కోరుతూ సత్తెనపల్లి పట్టణంలోని గుంటూరు–మాచర్ల ప్రధాన రహదారిపై ఆదివారం వడ్డెర సంఘ నాయకులు, బాధిత కుటుంబ సభ్యులు, బంధువులు పెద్ద ఎత్తున రాస్తారోకో నిర్వహించారు. ఈసందర్భంగా వడ్డెర సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చంద్రగిరి ఏడుకొండలు మాట్లాడుతూ క్రోసూరు మండలం ఉయ్యందన గ్రామానికి చెందిన మైనర్ బాలిక ఈనెల 15న మిరపకాయల కూలి పనులకు వెళ్లగా గ్రామానికి చెందిన నలుగురు వ్యక్తులు ఆమెను బలవంతంగా అమరావతి మండలం దిడుగు గ్రామానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారని, నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
పోలీసులు కేసు తప్పుదోవ పట్టించారు..
బాధితురాలి తల్లిదండ్రులు మాట్లాడుతూ గ్రామానికి చెందిన ఏపూరి రామకృష్ణ, ఆది నరేంద్ర, పొత్తూరి వెంకటేశ్వర్లు, మలిశెట్టి రాములు తమ కుమార్తెను బలవంతంగా తీసుకెళ్లి కాళ్లు, చేతులు కట్టి సామూహిక అత్యాచారం చేశారని తెలిపారు. సెల్‌ఫోన్ల్‌లో వీడియోలు తీసి ఇంటి వద్ద చెబితే వాట్సాప్ ద్వారా దేశం మొత్తానికి చూపుతామని బెదిరింపులకు గురి చేశారన్నారు. ఈనెల 16వ తేదీ రాత్రి ఏడు గంటల వరకు దిడుగులోని రేకుల షెడ్‌లోనే తమ కుమార్తెను బంధించారని, ఈ విషయాన్ని ఏవరికైనా చెబితే ఆమెతోపాటు కుటుంబ సభ్యులను కూడా చంపుతామని బెదిరించారన్నారు. చివరికి 88 తాళ్ళూరు గ్రామానికి చెందిన ఇరువురి ద్విచక్ర వాహనంపై తమ బిడ్డను పంపించారని, తమ బంధువు దేవండ్ల హనుమయ్య, వెంకట్రాజు ఎదురై బండి ఆపి తమ కుమార్తెను రక్షించి వారి ఇరువురిని క్రోసూరు పోలీస్‌స్టేషన్‌కు అప్పగించారన్నారు. పోలీసులు తమ బిడ్డ భయంతో నీరసంగా ఉండటాన్ని గమనించి మరుసటి రోజు రమ్మని పంపారన్నారు. ఈ నెల 17న క్రోసూరు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి జరిగిన విషయం వివరించి చెప్పి నిందితులను చట్టపరంగా శిక్షించాలని కోరామన్నారు. ఆదేరోజు రాత్రి 8 గంటలకు ఎఫ్‌ఐఆర్ కాపీ ఇచ్చారని, అందులో తమ బిడ్డ చెప్పిన మాటలేమీ లేవని పోలీసులు సొంతంగా కట్టుకథ రాసి కేసులు నమోదు చేశారన్నారు. నిందితులపై నిర్భయ చట్టం ప్రయోగించాలని, ఇలాంటి సంఘటన మరొకటి జరగకుండా శిక్షించాలని వారు కోరారు.
రాస్తారోకోతో నిలిచిన వాహనాలు..
బాధితులు ఆందోళన చేయడంతో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచి పోయాయి. సంఘటన స్థలానికి అర్బన్ సి.ఐ. ఎస్. సాంబశివరావు చేరుకుని ఆందోళన కారులను డీఎస్‌పీ కార్యాలయానికి రావాల్సిందిగా కోరారు. తాలుకా సెంటర్ నుంచి బాధిత బంధువులు, వడ్డెర సంఘ నాయకులు బయలుదేరి మహిళలపై అత్యాచారాలు జరగకుండా నియంత్రించాలంటూ పెద్ద ఎత్తున నినదిస్తూ డీఎస్‌పీ కార్యాలయానికి చేరుకున్నారు. డీఎస్‌పీ ఎం. మధుసూధనరావు ఆందోళన కారులతో మాట్లాడి నిష్ఫక్షపాతంగా దర్యాప్తు జరుపుతామని, మైనర్ బాలిక అభిప్రాయం మేరకు కేసు నమోదు చేస్తామన్నారు. ఆందోళన కార్యక్రమంలో వడ్డెర సంక్షేమ సంఘ రాష్ట్ర కార్యదర్శి కుంచాల వెంకట్రావు, జిల్లా అధ్యక్షుడు తన్నీరు ఆంజినేయులు, సంఘ నాయకులు, ఉయ్యందన గ్రామ ప్రజలు పాల్గొన్నారు.