మళ్లీ ఆంధ్ర ఎంటర్‌ప్రెన్యూర్స్ హవా..
విజయవాడ: ఆంధ్ర ఎంటర్‌ప్రెన్యూర్స్ హవా మళ్లీ మొదలయ్యిందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు, కళాశాలలనుంచి బయటికొచ్చే ప్రతి విద్యార్థికి కచ్చితంగా ఉద్యోగం, లేదా ఉపాధి దక్కేలా విద్యావ్యవస్థను మార్చేందుకు సంస్కరణలు చేపట్టామని చెప్పారు. రాష్ట్రంలో నెలకొల్పే ప్రతి పారిశ్రామిక సంస్థ కనీసం రెండు కళాశాలలను దత్తత తీసుకుని మౌలిక సదుపాయాలు కల్పించి విద్యార్థులకు అవసరమైన శిక్షణ అందించేలా ప్రయత్నిస్తున్నామని తెలిపారు.
మంగళవారం సాయంత్రం విజయవాడ గేట్‌వే హోటల్‌లో ఏపీ ఉన్నత విద్యాశాఖ ఆధ్వర్యంలో జరిగిన సీఎస్‌ఆర్ భాగస్వామ్య సదస్సులో ముఖ్యమంత్రి పాల్గొని విద్యావేత్తలు, కళాశాలల ముఖ్య అధ్యాపకులతో ముచ్ఛటించారు. ఆంధ్రప్రదేశ్‌ను నాలేడ్జ్ స్టేట్‌గా, ఎడ్యుకేషనల్ హబ్‌గా తీర్చిదిద్దడానికి వినూత్న విధానాలను అనుసరిస్తున్నామని చెప్పారు. తొలివిడతగా 27 కంపెనీలు ముందుకొచ్చి రాష్ట్రంలోని 100 కళాశాలలను అభివృద్ధిచేయడానికి సంకల్పించడం శుభపరిణామమని అన్నారు.