Knowledge Hub
-
నాలెడ్జ్ క్యాపిటల్‌గా ఏపీ
సాక్షి,తగరపువలస (విశాఖపట్నం): విద్యార్థులకు నాలెడ్జ్ క్యాపిటల్‌గా ఆంధ్రప్రదేశ్, ప్రపంచానికి వస్తు ఉత్పత్తి కేంద్రంగా భారతదేశం చిరునామాగా మారాయని ఉన్నత విద్యామండలి చైర్మన్ కె.హేమచంద్రారెడ్డి అన్నారు. శుక్రవారం భీమిలి మండలం దాకమర్రి రఘు ఇంజనీరింగ్ కళాశాలలో ఐఈఈఈ విశాఖ బే సెక్షన్ సాంకేతిక సౌజన్యంతో ప్రారంభమైన ‘ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ కంప్యూటింగ్, కమ్యూనికేషన్ అండ్ పవర్ టెక్నాలజీ’–(ఐసి3పి2022) వర్క్‌షాపును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా అధ్యాపకులు, విద్యార్ధులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. సాంకేతికంగా పురోగతి సాధించిన ప్రస్తుత కాలంలో ప్రపంచం అరచేతిలో ఇమిడిపోయిందన్నారు. దీనిని విద్యార్థులు తమ భవిష్యత్తును అందంగా తీర్చిదిద్దుకునేందుకు ఉపయోగించుకోవాలని సూచించారు. అందుబాటులో ఉన్న సాంకేతికతో నూతన ఆవిష్కరణలకు నాంది పలకాలన్నారు. మారుతున్న సాంకేతికతను అర్ధం చేసుకుంటూ ప్రాథమిక అంశాలపై లోతైన అవగాహన కలిగి ఉండాలన్నారు. స్టార్టప్, ఇంక్యుబేషన్, ఎంటర్ప్యూనర్షిప్లు ప్రస్తుత తరానికి సుపరిచితులన్నారు. ఆ దిశగా విద్యార్థులు అడుగులు వేసి దేశ ఆర్థికాభివృద్ధిలో భాగస్వాములు కావాలన్నారు. ఐఈఈఈ వైజాగ్ బే అధ్యక్షుడు ఎస్.లక్ష్మీనారాయణ మాట్లాడుతూ తమ సంస్థ ద్వారా వివిధ విద్యాసంస్థల్లో నిర్వహిస్తున్న తొలి సదస్సు రఘు ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహిస్తున్నామన్నారు. సంస్థ కార్యక్రమాలు, సభ్యులు, విధి విధానాలు తదితర అంశాల గురించి వివరించారు. రఘు విద్యాసంస్థల చైర్మన్ కలిదిండి రఘు మాట్లాడుతూ ఉన్నత విద్య అవసరాలను గుర్తించి దానికి అనుగుణంగా అవసరమైన ప్రోత్సాహం, సహకారం ఉన్నత విద్యామండలి అందిస్తుందన్నారు. ఇలాంటివి విద్యారంగానికి శుభపరిణామన్నారు. బోధన వృత్తి ఎంతో ఉన్నతమైనదన్నారు. విద్యార్థులకు ఆసక్తి పెంచేవిధంగా బోధన జరపాలన్నారు. కళాశాల వైస్ ప్రిన్సిపాల్ పి.సతీష్ రామచౌదరి మాట్లాడుతూ సదస్సుకు మన దేశంతో పాటు వివిధ దేశాల నుంచి 206 పరిశోధనా పత్రాలు వచ్చాయన్నారు. దీనిని హైబ్రిడ్ మోడల్లో నిర్వహిస్తున్నట్టు తెలిపారు. రెండు రోజుల పాటు కీలక ఉపన్యాసాలు, టెక్నికల్ సెషన్లు నిర్వహిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా సదస్సు సావనీర్‌ను హేమచంద్రారెడ్డి ఆవిష్కరించారు. అనంతరం అతిథులను జ్ఞాపికలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాళ్లు సీహెచ్ శ్రీనివాస్, ఎస్. సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
నాలెడ్జ్ హబ్‌లుగా రైతు భరోసా కేంద్రాలు
సాక్షి, అమరావతి: వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలను సాగు విజ్ఞాన కేంద్రాలు (నాలెడ్జ్ హబ్‌లు)గా ప్రభుత్వం తీర్చిదిద్దుతోంది. వ్యవసాయ, ఉద్యాన, పట్టు, ఆక్వా, పాడి రంగాల్లో వస్తున్న ఆధునిక సాంకేతిక పోకడలను ఎప్పటికప్పుడు రైతులకు చేరువ చేసేలా వీటిని తీర్చిదిద్దుతున్నారు. ఇందులో భాగంగా ఏర్పాటు చేసిన ‘ఆర్బీకే చానల్’ విశేష ఆదరణ పొందుతోంది. పైలట్ ప్రాజెక్టుగా యూట్యూబ్‌తో పాటు ఆర్బీకేల్లో డిజిటల్ మీడియా ద్వారా ప్రసారం చేస్తున్న ఈ చానల్ కార్యక్రమాలు రైతుల్లో సాగు నైపుణ్యాలను పెంపొందించేందుకు దోహదం చేస్తున్నాయి. ఈ చానల్ ద్వారా ప్రసారమయ్యే కార్యక్రమాలను ఆర్బీకేల్లో ఏర్పాటు చేసిన డిజిటల్ స్టూడియో (టీవీ)లతో ‘యూ ట్యూబ్’ ద్వారా లైవ్ టెలికాస్ట్ అయ్యేలా ఏర్పాటు చేశారు. ఈ ప్రసారాలన్నీ నేరుగా మొబైల్లోనే చూసుకునే వెసులుబాటు కల్పించారు. ఏ రోజు ఏ శాఖకు సంబంధించి ఏ కార్యక్రమాలు ప్రసారమవుతాయో ఆర్బీకేలలో పనిచేసే సిబ్బందికి ముందుగానే తెలియజేయడంతోపాటు ఆ చానల్‌ను సబ్‌స్రై్కబ్ చేసుకున్న రైతులకు కూడా ఎస్ఎంఎస్ల ద్వారా తెలియజేస్తున్నారు. చానల్ ద్వారా ప్రసారమయ్యే కార్యక్రమాలను యూట్యూబ్‌లో అప్లోడ్ చేస్తుండటంతో ఎప్పుడు కావాలంటే అప్పుడు మొబైల్ ద్వారా రైతులు వీక్షించే అవకాశం కలిగింది. గన్నవరంలో ప్రత్యేకంగా స్టూడియో చానల్ కోసం గన్నవరంలో ప్రత్యేకంగా స్టూడియో ఏర్పాటు చేశారు. ఇక్కడ నుంచి ఆయా శాఖల ఉన్నతాధికారులు తమ సిబ్బందితో ప్రతిరోజు మాట్లాడుతున్నారు. ప్రభుత్వపరంగా తీసుకుంటున్న విధానపరమైన నిర్ణయాలను ఈ చానల్ ద్వారా క్షేత్రస్థాయి సిబ్బంది వరకు చేరేలా ఏర్పాటు చేశారు. ప్రయోగాత్మకంగా వివిధ శాఖల కార్యకలాపాలు, శాస్త్రవేత్తల సూచనలు, సలహాలకు సంబంధించి ప్రసారమవుతున్న వీడియోలకు రైతుల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. ఇప్పటికే 3.50 లక్షల వీక్షకులు గల ఈ చానల్‌ను 88,500 మంది సబ్‌స్క్రైబ్ చేసుకున్నారు. ‘రైతు భరోసా పత్రిక’కూ విశేష ఆదరణ ఆర్బీకేల్లో ఏర్పాటు చేసిన లైబ్రరీలలో వ్యవసాయ అనుబంధ రంగాలకు చెందిన వివిధ మేగజైన్స్, పుస్తకాలను అందుబాటులో ఉంచుతున్నారు. ‘వైఎస్సార్ రైతు భరోసా’ పేరిట వ్యవసాయ శాఖ 8 నెలలుగా మాసపత్రికను సైతం తీసుకొస్తోంది. ఈ మాసపత్రిక సైతం విశేష ఆదరణ పొందుతోంది. ఇప్పటికే దీనికి 60 వేల మంది రైతులు చందాదారులుగా చేరారు. వ్యవసాయ, ఉద్యాన, పట్టు, ఆక్వా సాగులో వస్తున్న మార్పులు, పాడి సంరక్షణ కార్యక్రమాలను సామాన్య రైతులకు సైతం అర్థమయ్యే రీతిలో ఈ పత్రికలో విశదీకరిస్తున్నారు సీఎం చేతుల మీదుగా త్వరలో ప్రారంభం పైలట్ ప్రాజెక్టుగా తీసుకొచ్చిన ‘ఆర్బీకే చానల్’కు రైతుల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. రైతులు స్వచ్ఛందంగా సబ్‌స్రై్కబ్ చేసుకుంటున్నారు. ఈ చానల్ ప్రసారాలను స్వయంగా వీక్షించేందుకు రాష్ట్రంలో ఎంపిక చేసిన ఓ రైతు భరోసా కేంద్రాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి త్వరలో సందర్శించనున్నారు. ఆయన చేతుల మీదుగా ఈ చానల్‌ను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. అలాగే వ్యవసాయ శాఖ తీసుకొస్తున్న ‘వైఎస్సార్ రైతు భరోసా’ మాసపత్రికకు సైతం విశేష ఆదరణ లభిస్తోంది. – హెచ్ అరుణ్‌కుమార్, కమిషనర్, వ్యవసాయ శాఖ చాలా బాగుంది యూట్యూబ్‌ను కాలక్షేపం కోసం చూసేవాళ్లం. నెల క్రితం ఆర్బీకే సిబ్బంది చెప్పడంతో ‘ఆర్బీకే చానల్’ సబ్‌స్రై్కబ్ చేసుకున్నా. చాలా బాగుంది. మాకు అవసరమైన వీడియోలను ప్రసారం చేస్తుండటం వల్ల ఎంతో మేలు కలుగుతోంది. వైఎస్సార్ ఉచిత బీమా, రైతు భరోసా ఇతర సంక్షేమ పథకాల కోసం ఈ చానల్ ద్వారా వ్యవసాయ కమిషనర్ చెబుతున్న తీరు ఎంతో బాగుంది. –గుంటూరు నాగఫణికుమార్, కౌతరం, కృష్ణా జిల్లా -
ఎయిర్పోర్ట్ సిటీలో ఎడ్యుపోర్ట్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ ఎయిర్‌పోర్టు సిటీలో అద్భుతమైన విద్యాసంస్థ అందుబాటులోకి రానుంది. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ‘ఎడ్యుపోర్టు’రూపుదిద్దుకోనుంది. వివిధ రంగాల్లో ప్రతిభావంతులైన విద్యార్థులను తీర్చిదిద్దేందుకు సుమారు 100 ఎకరాల విస్తీర్ణంలో స్కూళ్లను అభివృద్ధి చేసేందుకు జీఎమ్మార్ హైదరాబాద్ ఎయిరొట్రోపొలిస్ లిమిటెడ్ (జీహెచ్‌ఏఎల్) ప్రణాళికలను సిద్ధం చేసింది. ఈ మేరకు కొద్దిరోజుల క్రితమే సెయింట్‌మేరీస్ ఎడ్యుకేషనల్ సొసైటీతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు జీఎమ్మార్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. రానున్న మూడేళ్లలో వినియోగంలోకి తేవాలని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. నగరానికి దూరంగా ప్రశాంత వాతావరణంలో పర్యావరణ పరిరక్షణకు అనుకూలంగా విద్య, పరిశోధనా సంస్థలను అభివృద్ధి చేసే లక్ష్యంతో జీహెచ్‌ఏఎల్ ఈ అంతర్జాతీయ స్థాయి ఎడ్యుకేషనల్ క్లస్టర్‌ను ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ఈ ‘ఎడ్యుపోర్ట్’పలు జాతీయ, అంతర్జాతీయ సంస్థలతో అనుసంధానమై ఉంటుంది. అన్ని వయసులు, నేపథ్యాలు కలిగిన విద్యార్థులకు అవసరమైన అధ్యయన కోర్సులను ఇందులో అందుబాటులోకి తెస్తారు. ఓ నాలెడ్జ్ హబ్‌గా.. ఇక ఈ ఎడ్యుపోర్ట్ను ఓ నాలెడ్జ్ హబ్‌గా అభివృద్ధి చేయనున్నారు. లెర్నింగ్, ట్రైనింగ్, రీసెర్చ్, ఇన్నొవేషన్ సెంటర్‌గా ఈ ఎడ్యుపోర్ట్లో బిజినెస్ స్కూల్, ఇంటర్నేషనల్ స్కూల్, ఏవియేషన్ అకాడమీ, ఎయిరోస్పేస్ ఇంజ నీరింగ్, ఫ్లైట్ ట్రైనింగ్, సిమ్యులేటర్ ట్రైనింగ్, ఇంజిన్ మెయింటెనెన్స్ వంటి వాటిలో బోధన, శిక్షణ ఉంటాయి. ఇక ఈ ఎడ్యుకేషన్ క్లస్టర్లో చిన్మయ విద్యాలయ, షూలిచ్ స్కూల్ ఆఫ్ బిజినెస్, జీఎమ్మార్ ఏవియేషన్ అకాడమీ, ఫ్లైట్ సిమ్యులేషన్ టెక్నిక్ సెంటర్, సీఎఫ్ఎం సౌత్ ఏసియా ట్రైనింగ్ సెంటర్, ప్రాట్ అండ్ విట్నీ ఇండియా ట్రైనింగ్ సెంటర్ వంటి సంస్థలు భాగం పంచుకోనున్నాయి. మరోవైపు రెసిడెన్షియల్ అకడమిక్ సదుపాయం కలిగిన సాంక్టా మారియా ఇంటర్నేషనల్ స్కూల్ నిర్మాణం కోసం సెయింట్ మేరీస్ ఎడ్యుకేషన్ సొసైటీతో ఒప్పందాలు జరిగినట్లు అధికారులు తెలిపారు. ఇది ఆహ్వానించదగిన పరిణామమని జీఎమ్మార్ ఎయిర్‌పోర్టు బిజినెస్ మేనేజర్ జీబీఎస్ రాజు అన్నారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుందని చెప్పారు. ఎయిర్‌పోర్టు ల్యాండ్ డెవలప్మెంట్ సీఈవో అమన్‌కపూర్ మాట్లాడుతూ.. ‘హైదరాబాద్ ఎయిర్‌పోర్టు సిటీలో ఏర్పాటవుతున్న మొదటి విద్యాసంస్థ ఇది. ప్రపంచస్థాయి విద్య, పరిశోధనా సంస్థలను నెలకొల్పి, ఉన్నత విద్యను అందించే వ్యవస్థను నెలకొల్పాలన్న మా లక్ష్యానికి ఇది అనుగుణంగా ఉంది’అని వ్యాఖ్యానించారు. -
మళ్లీ ఆంధ్ర ఎంటర్‌ప్రెన్యూర్స్ హవా..
విజయవాడ: ఆంధ్ర ఎంటర్‌ప్రెన్యూర్స్ హవా మళ్లీ మొదలయ్యిందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు, కళాశాలలనుంచి బయటికొచ్చే ప్రతి విద్యార్థికి కచ్చితంగా ఉద్యోగం, లేదా ఉపాధి దక్కేలా విద్యావ్యవస్థను మార్చేందుకు సంస్కరణలు చేపట్టామని చెప్పారు. రాష్ట్రంలో నెలకొల్పే ప్రతి పారిశ్రామిక సంస్థ కనీసం రెండు కళాశాలలను దత్తత తీసుకుని మౌలిక సదుపాయాలు కల్పించి విద్యార్థులకు అవసరమైన శిక్షణ అందించేలా ప్రయత్నిస్తున్నామని తెలిపారు. మంగళవారం సాయంత్రం విజయవాడ గేట్‌వే హోటల్లో ఏపీ ఉన్నత విద్యాశాఖ ఆధ్వర్యంలో జరిగిన సీఎస్ఆర్ భాగస్వామ్య సదస్సులో ముఖ్యమంత్రి పాల్గొని విద్యావేత్తలు, కళాశాలల ముఖ్య అధ్యాపకులతో ముచ్ఛటించారు. ఆంధ్రప్రదేశ్‌ను నాలేడ్జ్ స్టేట్‌గా, ఎడ్యుకేషనల్ హబ్‌గా తీర్చిదిద్దడానికి వినూత్న విధానాలను అనుసరిస్తున్నామని చెప్పారు. తొలివిడతగా 27 కంపెనీలు ముందుకొచ్చి రాష్ట్రంలోని 100 కళాశాలలను అభివృద్ధిచేయడానికి సంకల్పించడం శుభపరిణామమని అన్నారు. -
నాలెడ్జ్ హబ్‌గా ఏపీ
సీఐఐ సదస్సులో సీఎం సాక్షి, విజయవాడ బ్యూరో/హైదరాబాద్: ‘‘రాష్ట్రాన్ని రెండేళ్లలో నాలెడ్జ్ హబ్‌గా మార్చాలి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో అభివృద్ధికి దోహదపడే అంశాలను అందిపుచ్చుకోవాలి. యువ ఇంజనీర్లు, ఐటీ రంగంలోని అనుభవజ్ఞులు కొత్త అప్లికేషన్లతో ముందుకు రావాలి’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. విజయవాడలో గురువారం కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ(సీఐఐ) ప్రతినిధులు ఏర్పాటు చేసిన ఐటీ రంగ సదస్సులో ఆయన మాట్లాడారు. హైదరాబాద్‌లో జరిగిన సీఐఐ సదస్సులో కూడా సీఎం విజయవాడ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. రాష్ట్రాభివృద్ధికి సాంకేతిక పరిజ్ఞానంతోపాటు సృజనాత్మక ఆలోచనలు కూడా ఎంతో అవసరమని చెప్పారు. విదేశాల్లో నివసించే సాఫ్ట్వేర్ నిపుణులు కొద్దిపాటి సమయాన్ని స్వరాష్ట్రం కోసం కేటాయిం చాలని సూచించారు. ‘కోడ్ ఫర్ ఏపీ’ గ్రూప్‌లో చేరాలని పిలుపునిచ్చారు. మొబైల్ రివల్యూషన్, క్లౌడ్ టెక్నాలజీలు అందుబాటులోకి వస్తున్న ప్రస్తుత తరుణంలో యువ ఇంజనీర్లు సరికొత్త ఆలోచనలతో రాష్ట్రాభివృద్ధికి కృషి చేయాలని పేర్కొన్నారు. ఈవ్‌టీజింగ్‌లపై ఆందోళన సరస్వతీ నిలయాలుగా భాసిల్లాల్సిన యూనివర్సిటీలు ఈవ్‌టీజింగ్, ర్యాగింగ్‌లకు నిలయాలుగా మారుతున్నాయని సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. ర్యాగింగ్ కారణంగా రిషితేశ్వరి అనే విద్యార్థిని చనిపోవడం ఎంతో బాధ కలిగించిందన్నారు. విశ్వవిద్యాలయాల్లో బయటి వ్యక్తులు తిష్టవేసి కుల సంఘాలను నడుపుతున్నట్లు తెలిసిందని, వారిని బయటకు పంపిస్తామని చెప్పారు. వారం తర్వాతే..: పట్టిసీమపై సీఎం * రాష్ట్ర విభజనపై విధానపత్రం విడుదల సాక్షి, విజయవాడ బ్యూరో: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈ నెల 15న పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని ప్రజలకు అంకితం చేస్తామని, నీటి విడుదల మాత్రం వారం, పదిరోజుల తర్వాతే ఉంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. గురువారం రాత్రి తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మార్చి 29న ఈ పథకానికి శంకుస్థాపన చేసి ఆగస్టు 15 తుదిగడువు విధించామని, కానీ అధికారులు వారం, పదిరోజులు సమయం అడిగారని తెలిపారు. వర్షాలు పడడం, రక్షణ, నాణ్యతలను దృష్టిలో పెట్టుకుని అధికారులపై తాను ఒత్తిడి చేయలేదన్నారు. ఈ ప్రాజెక్టును ప్రజలకు అంకితం చేయడం.. నదుల అనుసంధానం ద్వారా చరిత్ర సృష్టించనున్నట్లు తెలిపారు. తొలుత ‘రాష్ట్ర విభజన నేపథ్యంలో వివిధ రాజకీయ పార్టీల తీరు- టీడీపీ పాత్ర’పై ఒక విధాన పత్రాన్ని ఆయన విడుదల చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అనుసరించిన విధానం, ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు, తదితర పరిణామాలను అందులో పేర్కొన్నారు. ప్రత్యేక హోదా కావాలని గట్టిగానే అడుగుతామని, కానీ దానివల్లే అంతా అయిపోదని సీఎం స్పష్టం చేశారు. రాష్ట్ర విభజన జరిగిన నాటి నుంచి టీఆర్ఎస్ అనేక రకాల సమస్యలు, వివాదాలు సృష్టిస్తూనే ఉందన్నారు. శుక్రవారం మరోపత్రం విడుదల చేస్తానని చెప్పారు. -
నాలెడ్జ్ హబ్‌గా ఏపీ : గంటా
రాంబిల్లి: ఆంధ్రప్రదేశ్‌ను నాలెడ్జి హబ్‌గా తీర్చిదిద్దుతామని రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖా మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. శుక్రవారం రాంబిల్లిలో కస్తూర్బా పాఠశాల భవనాన్ని ప్రారంభించారు. ఈ సం దర్భంగా మాట్లాడుతూ విద్యావ్యవస్థలో సం స్కరణలు తీసుకువస్తామని చెప్పారు. కస్తూ ర్బా పాఠశాల ప్రహరీ నిర్మాణానికి 17 లక్షలు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. ఎంపీ ము త్తంశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ విద్యతోనే అభివృద్ధి సాధ్యమని చెప్పారు. పోటీతత్వంతో విద్యార్థులు చదవాలని సూచించారు. కాగా, కస్తూర్బా భవన నిర్మాణంలో నాణ్యతకు తిలోదకాలిస్తున్నట్లు కన్నబాబు సభలో మంత్రి గంటా, ఎమ్మెల్యే పంచకర్ల దృష్టికి తీసుకువచ్చారు. దీంతో ఇంజనీరింగ్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పనులు సరిచేయాలని సూచించారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ లాలం భవాని, ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు, మాజీ ఎంపీ పప్పల చలపతిరావు, మాజీ ఎమ్మెల్యే కన్నబాబు, ఎంపీపీ వసంతవాడ వెంకటేశ్వరరావు, సర్పం చ్ పిన్నంరాజు రాధాసుందర సుబ్బరాజు (కిషోర్), డీఈఓ కృష్ణారెడ్డి, సర్వశిక్ష అభియాన్ పీఓ బి.నగేష్, మండల ప్రత్యేకాధికారి పి.కోటేశ్వరరావు, తహశీల్దార్ మల్లేశ్వరరావు, ఎంపీడీఓ స్వరూపరాణి, ఎంఈఓ ఎం.సత్యనారాయణ పాల్గొన్నారు. నియోజకవర్గానికి ఓ జూనియర్ కళాశాల అచ్యుతాపురం: నియోజకవర్గానికి ఓ జూని యర్ కళాశాల ఏర్పాటు చేస్తామని మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. శుక్రవారం రామన్నపాలెంలో సుజలస్రవంతి పథకాన్ని ప్రారంభించారు. అచ్యుతాపురం కూడలిలో రోడ్లు ఊడ్చారు. మోసయ్యపేట గ్రామంలో పారిశుద్ధ్య పరిస్థితులు పరిశీలించారు. అనంతరం దిబ్బపాలెం ఎస్ఈజెడ్ కాలనీ జన్మభూమి సభలో మాట్లాడారు. ఎస్ఈజెడ్ సమస్యలపై అధ్యయనం చేశామని, నిర్వాసితులకు నైపుణ్యం లేనికారణంగా ఉపాధికి దూరమవుతున్నారని చెప్పారు. నిర్వాసితుల న్యా యమైన కోర్కెలు పరిష్కరిస్తామని చెప్పారు. అచ్యుతాపురంలో ప్రభుత్వ ఐటీఐ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. సమావేశంలో ఎంపీ ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు మాట్లాడారు. కార్యక్రమంలో లాలం భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు.