నాలెడ్జ్ హబ్‌గా ఏపీ
సీఐఐ సదస్సులో సీఎం
సాక్షి, విజయవాడ బ్యూరో/హైదరాబాద్: ‘‘రాష్ట్రాన్ని రెండేళ్లలో నాలెడ్జ్ హబ్‌గా మార్చాలి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో అభివృద్ధికి దోహదపడే అంశాలను అందిపుచ్చుకోవాలి. యువ ఇంజనీర్లు, ఐటీ రంగంలోని అనుభవజ్ఞులు కొత్త అప్లికేషన్లతో ముందుకు రావాలి’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. విజయవాడలో గురువారం కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ(సీఐఐ) ప్రతినిధులు ఏర్పాటు చేసిన ఐటీ రంగ సదస్సులో ఆయన మాట్లాడారు.
హైదరాబాద్‌లో జరిగిన సీఐఐ సదస్సులో కూడా సీఎం విజయవాడ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. రాష్ట్రాభివృద్ధికి సాంకేతిక పరిజ్ఞానంతోపాటు సృజనాత్మక ఆలోచనలు కూడా ఎంతో అవసరమని చెప్పారు. విదేశాల్లో నివసించే సాఫ్ట్‌వేర్ నిపుణులు కొద్దిపాటి సమయాన్ని స్వరాష్ట్రం కోసం కేటాయిం చాలని సూచించారు. ‘కోడ్ ఫర్ ఏపీ’ గ్రూప్‌లో చేరాలని పిలుపునిచ్చారు. మొబైల్ రివల్యూషన్, క్లౌడ్ టెక్నాలజీలు అందుబాటులోకి వస్తున్న ప్రస్తుత తరుణంలో యువ ఇంజనీర్లు సరికొత్త ఆలోచనలతో రాష్ట్రాభివృద్ధికి కృషి చేయాలని పేర్కొన్నారు.
ఈవ్‌టీజింగ్‌లపై ఆందోళన
సరస్వతీ నిలయాలుగా భాసిల్లాల్సిన యూనివర్సిటీలు ఈవ్‌టీజింగ్, ర్యాగింగ్‌లకు నిలయాలుగా మారుతున్నాయని సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. ర్యాగింగ్ కారణంగా రిషితేశ్వరి అనే విద్యార్థిని చనిపోవడం ఎంతో బాధ కలిగించిందన్నారు. విశ్వవిద్యాలయాల్లో బయటి వ్యక్తులు తిష్టవేసి కుల సంఘాలను నడుపుతున్నట్లు తెలిసిందని, వారిని బయటకు పంపిస్తామని చెప్పారు.
వారం తర్వాతే..: పట్టిసీమపై సీఎం
* రాష్ట్ర విభజనపై విధానపత్రం విడుదల
సాక్షి, విజయవాడ బ్యూరో: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈ నెల 15న పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని ప్రజలకు అంకితం చేస్తామని, నీటి విడుదల మాత్రం వారం, పదిరోజుల తర్వాతే ఉంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. గురువారం రాత్రి తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మార్చి 29న ఈ పథకానికి శంకుస్థాపన చేసి ఆగస్టు 15 తుదిగడువు విధించామని, కానీ అధికారులు వారం, పదిరోజులు సమయం అడిగారని తెలిపారు. వర్షాలు పడడం, రక్షణ, నాణ్యతలను దృష్టిలో పెట్టుకుని అధికారులపై తాను ఒత్తిడి చేయలేదన్నారు.
ఈ ప్రాజెక్టును ప్రజలకు అంకితం చేయడం.. నదుల అనుసంధానం ద్వారా చరిత్ర సృష్టించనున్నట్లు తెలిపారు. తొలుత ‘రాష్ట్ర విభజన నేపథ్యంలో వివిధ రాజకీయ పార్టీల తీరు- టీడీపీ పాత్ర’పై ఒక విధాన పత్రాన్ని ఆయన విడుదల చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అనుసరించిన విధానం, ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు, తదితర పరిణామాలను అందులో పేర్కొన్నారు. ప్రత్యేక హోదా కావాలని గట్టిగానే అడుగుతామని, కానీ దానివల్లే అంతా అయిపోదని సీఎం స్పష్టం చేశారు. రాష్ట్ర విభజన జరిగిన నాటి నుంచి టీఆర్‌ఎస్ అనేక రకాల సమస్యలు, వివాదాలు సృష్టిస్తూనే ఉందన్నారు. శుక్రవారం మరోపత్రం విడుదల చేస్తానని చెప్పారు.