నగర ఐటీ నిపుణుల అనారోగ్యకర జీవనశైలి
ఇటీవలి ఎన్‌ఐఎన్ సహా పలు అధ్యయనాల్లో వెల్లడి
హైబ్రిడ్, వర్క్ ఫ్రమ్ హోమ్ సైతం కారణాలే
కార్యాలయాల్లో ఆరోగ్య సాధన ఏర్పాట్ల పెంపు
ఎండ కన్నెరుగని శరీరాలు ఎండ్‌లెస్ సమస్యల చిరునామాలుగా మారుతున్నాయి. ఆరు అంకెల జీతాలు అందుకునే జీవితాలు అనారోగ్యాలకు గురవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఐటీ ఉద్యోగుల ఆరోగ్య పరిస్థితులపై ఆందోళన పెరుగుతోంది. దీనికి పని ఒత్తిడి కారణం ఒకటైతే.. హైబ్రిడ్, వర్క్ ఫ్రమ్ హోం సైతం మరో కారణంగా పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఈ ఆదోళన నేపథ్యంలో పలు కంపెనీలు.. కార్యాలయ ఆవరణల్లో మార్పులకు కారణమవుతున్నాయి.
నగరంలో దాదాపు తొమ్మిది లక్షల మంది పైగా ఐటీ ఉద్యోగులు ఉన్నారు. వీరు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను నడిపించే చోదకశక్తిగా మారినప్పటికీ ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోలేకపోతున్నారు. తద్వారా రానున్న సంవత్సరాల్లో 30 ఏళ్లు 40 ఏళ్ల వయస్సు ఉద్యోగుల్లో నాన్–కమ్యూనికబుల్ డిసీజెస్ (ఎన్‌సిడి)లో భారీ పెరుగుదల కనిపించనుంది. నగరానికి చెందిన నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (ఎన్‌ఐఎన్) పరిశోధకులు మాదాపూర్‌లోని హైటెక్ సిటీలోని ఐటీ సెక్టార్‌లో ఇటీవల వర్క్‌ప్లేస్ వెల్‌నెస్ స్టడీ వెల్లడించిన విషయం ఇది. ఈ అధ్యయనం న్యూట్రియెంట్స్ జర్నల్‌లో ప్రచురితమైంది.
అంతర్గత అధ్యయనాల్లోనూ..
ఇదే విధంగా పలు సంస్థలు నిర్వహిస్తున్న అంతర్గత అధ్యయనాల్లోనూ ఇలాంటి ఫలితాలే వస్తున్నాయి. ఎస్‌ఓఐ హెల్త్‌కేర్ అనే ఒక వెల్‌నెస్ సంస్థ జరిపిన అధ్యయనంలో అత్యధికంగా టెక్ ఉద్యోగులు మెడనొప్పి, హైపర్ టెన్షన్, లోయర్ బ్యాక్ పెయిన్, సరై్వకల్ స్పాండిలైటిస్‌తో బాధపడుతున్నారని తేల్చింది. అలాగే కార్పల్ టన్నెల్ సిండ్రోమ్.. అనే చేతులకు సంబంధించిన సమస్యతో, లోయర్ బ్యాక్‌కి కాళ్లకు కలిపి నొప్పులు అందించే సాక్రోలియక్ జాయింట్ డిస్‌ఫంక్షన్‌తో పలువురు ఇబ్బంది పడుతున్నారని స్పష్టం చేసింది. టెక్నోపార్క్ అంతర్గతంగా చేయించుకున్న అధ్యయనం ఇది.
ఫలితం అంతంతే..
గత ఐదు సంవత్సరాల్లో, చురుకైన జీవితం ద్వారా ఆరోగ్యవంతమైన జీవనాన్ని ప్రోత్సహించడంలో అనేక స్వచ్ఛంద సంస్థలు, కంపెనీల హెచ్‌ఆర్ విభాగాలతో కలిసి పాలుపంచుకుంటున్నాయి. అయినప్పటికీ కరోనా కారణంగా చాలా మంది ఉద్యోగులు మరింత నిశ్చల జీవనశైలికి అలవాటు పడ్డారని ఐటీ రంగ నిపుణులు అంటున్నారు. ‘చురుకైన జీవనశైలిని అలవర్చుకునే విషయంలో కొన్ని సంవత్సరాలుగా సానుకూల మార్పులు కనిపిస్తున్నాయి. జిమ్‌లో వర్కవుట్ చేయడం, రన్నింగ్, యోగా సెషన్‌లు, నడకలను ప్రోత్సహిస్తూ, ఆరోగ్యకరమైన జీవనంపై అవగాహనా సదస్సులు నిర్వహిస్తున్నాం. అయితే, ఇంకా చాలా పనులు చేయాల్సి ఉంది’ అని హైదరాబాద్ రన్నర్స్ వ్యవస్థాపక అధ్యక్షుడు రాజేష్ వెచ్చా చెబుతున్నారు.
ఒత్తిడి ఫుల్.. శ్రమ నిల్..
నగర ఐటీ రంగంలో నిమగ్నమైన ఉద్యోగుల్లో ఎక్కువ మంది నిశ్చల జీవనశైలి కావడంతో శారీరక శ్రమ తక్కువ. మరోవైపు తీవ్ర పని ఒత్తిడి. ఈ కారణంగా సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు గుండె జబ్బులు, రక్తపోటు, మధుమేహం, పక్షవాతం, దీర్ఘకాలిక కిడ్నీ, గుండె సంబంధిత సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితులు కొనసాగితే 26 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల మధ్య వయసు్కల్లో మెటబాలిక్ సిండ్రోమ్ (ఎంఇటీఎస్)కు అంతిమంగా నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్‌కు దారితీసే అవకాశం ఉందని అధ్యయనం హెచ్చరించింది. మగవారిలో 90 సెం.మీ లేదా అంతకంటే ఎక్కువ, మహిళల్లో 80 సెం.మీ లేదా అంతకంటే ఎక్కువ నడుము చుట్టుకొలత, ట్రైగ్లిజరైడ్స్ (టీజీ) స్థాయిలు 150 మి.గ్రా/డీఎల్ లేదా అంతకంటే ఎక్కువ, హై డెన్సిటీ లైపోప్రొటీన్ స్థాయి వంటివి ప్రమాద సంకేతాలుగా హెచ్చరించింది.
ఆ అలవాట్లతో చేటు..
రోజుకు సగటున ఎనిమిది గంటలపైనే కూర్చుని ఉంటున్నారు. ఇదే కాకుండా తరచూ బయట, రెస్టారెంట్స్‌లో తినడం, వేళలు పాటించకపోవడం, తాజా పండ్లు, కూరగాయల వినియోగం స్వల్పంగా ఉండడం, పని ఒత్తిడితో తరచూ భోజనాన్ని మానేయడం, ఎయిర్ కండిషన్డ్ గదుల్లో ఉండడం.. వంటివి హానికరంగా మారుతున్నాయి. మొత్తం ఐటి ఉద్యోగుల్లో 20శాతం మంది మాత్రమే వారానికి 150 నిమిషాల పాటు శారీరక శ్రమ చేస్తున్నారు. మరోవైపు వర్చువల్ వర్క్ వారి పాలిట హానికరంగానే పరిణమిస్తోంది. వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ మానసిక, శారీరక ఆరోగ్యానికి సమస్య తెచ్చిపెడుతోంది. ఈ నేపథ్యంలో కంపెనీలు దిద్దుబాటు చర్యలు ముమ్మరం చేసినట్టు తెలుస్తోంది.
వాటిలో కొన్ని..
👉వర్క్ ఫ్రమ్ హోమ్ ద్వారా సమస్యలు వస్తున్నప్పటికీ చాలా మంది దాన్నే ఎంచుకున్నారని ఈ పరిస్థితుల్లో పలు సంస్థలు ఉద్యోగిని బట్టి ఉద్యోగాన్ని, వర్క్‌ప్లేస్‌ని డిజైన్ చేసే ఎర్గోనామిక్స్‌ను పరిచయం చేస్తున్నాయి.
👉 ప్రతి 10 నిమిషాలకూ ఒకసారి కళ్లు బ్లింక్ చేయాలి లేదా సిస్టమ్ నుంచి బ్రేక్ తీసుకోవాలని టీసీఎస్ నోటిఫికేషన్స్ ఇస్తోంది.
👉 టెక్నోపార్క్ కంపెనీ.. తమ ప్రాంగణంలో వాక్ వే, యోగా సెంటర్స్.. వంటివి ఏర్పాటు చేసింది. అలాగే ఓపెన్ జిమ్, జాగింగ్ ట్రాక్, ఫుట్ బాల్ టర్ఫ్ వంటివి ప్లాన్ చేస్తోంది.
👉 కాలుష్యరహిత స్మార్ట్ బైక్స్‌ను ఇన్ఫోపార్క్ అందిస్తోంది. అలాగే వాటర్ ఫ్రంట్ వాక్ వే, జాగింగ్ ట్రాక్, స్విమ్మింగ్ పూల్ సైతం ప్లాన్ చేస్తోంది.
👉 జుంబా క్లాసెస్ నిర్వహిస్తున్న సైబర్ పార్క్.. త్వరలో ఫుట్ బాల్ టర్ఫ్ ఏర్పాటు చేయనుంది.
Comments
Please login to add a commentAdd a comment