21 ప్రభుత్వ విభాగాల్లో ఏఐ వినియోగానికి ఉన్న అవకాశాలపై మదింపు
ఐటీ శాఖ పరిధిలోని ‘ఎమర్జింగ్ టెక్నాలజీ వింగ్’కు బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర సర్కారు
అంతర్జాతీయంగా పాలన రంగంలో ఏఐ వినియోగం తీరుపై అధ్యయనం
ప్రభుత్వ విభాగాల అవసరాలకు సరిపోయే రీతిలో ఏఐ ఆధారిత అప్లికేషన్ల రూపకల్పన
పాలనలో ఏఐ వినియోగంపై ఉద్యోగులకు అవగాహన, నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రభుత్వ పాలన, ప్రజాసేవల్లో కృత్రిమ మేధస్సు (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్– ఏఐ)ను మేళవించి ప్రజలకు త్వరితగతిన, సమర్థవంగా సేవలు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. సమాచార సాంకేతిక (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) రంగంలో వేగంగా వస్తున్న మార్పులను అందిపుచ్చుకోవడంలో ప్రభుత్వ శాఖలు వెనుకంజలో ఉన్నాయనే విమర్శల నుంచి బయటపడేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది.
వివిధ ప్రభుత్వ శాఖల్లో కృత్రిమ మేధ వినియోగానికి ఉన్న అవకాశాలపై కసరత్తు చేస్తోంది. ప్రయోగాత్మకంగా కొన్ని ప్రభుత్వ శాఖల్లో ఏఐ వినియోగంతో కూడిన అప్లికేషన్లు (యాప్‌లు) ప్రవేశపెట్టాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. ఈ బాధ్యతను ఐటీ శాఖకు అనుబంధంగా ఉన్న ‘ఎమర్జింగ్ టెక్నాలజీ వింగ్’కు అప్పగించింది.
21 ప్రభుత్వ శాఖలతో వర్క్‌షాప్
సాంకేతికత వినియోగం ద్వారా పేదరిక నిర్మూలనకు అవసరమైన విధానాల రూపకల్పనలో పేరొందిన ‘జేపీఏఎల్’(జమీల్ పావర్టీ యాక్షన్ లాబ్) రాష్ట్ర పాలనలో ఏఐ వినియోగం విషయంలో ప్రభుత్వంతో జట్టుకట్టింది. ఇటీవల 21 ప్రభుత్వ శాఖలకు చెందిన ‘ఏఐ నోడల్ ఆఫీసర్ల’తో వర్క్‌షాప్ నిర్వహించింది.
ఆయా ప్రభుత్వ విభాగాల పరిధిలోని సంక్లిష్ట అంశాలకు ఏఐ ద్వారా ఏ తరహాలో పరిష్కారాలు సాధ్యమనే కోణంలో లోతుగా మదింపు చేశారు. అంతర్జాతీయంగా పాలన, ప్రజాసేవలో ఏఐ ప్రభావం, వినియోగం, వివిధ దేశాలు, రాష్ట్రాలు ఏఐని వినియోగిస్తున్న తీరుపై ఈ వర్క్‌షాప్‌లో నోడల్ ఆఫీసర్లకు అవగాహన కల్పించారు.
ప్రభుత్వ అవసరాలకు అనుగుణంగా..
వివిధ ప్రభుత్వ శాఖల అవసరాలకు తగిన ఏఐ ఆధారిత యాప్‌లు, ఏ ప్రభుత్వ విభాగానికి ఏ తరహా యాప్‌లు అవసరమనే కోణంలో ఎమర్జింగ్ టెక్నాలజీ వింగ్ కసరత్తు చేస్తోంది.
ఆయా ప్రభుత్వ విభాగాల్లోని ఉద్యోగులకు కూడా ఏఐ పాలనలో ఏఐ వినియోగంపై అవగాహన కల్పించి, నైపుణ్య శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ శాఖల్లో దశలవారీగా ఏఐ సాంకేతికత వినియోగాన్ని పెంచేలా ఒక రోడ్‌మ్యాప్ రూపొందించే అంశంపై జేపీఏఎల్, ఎమర్జింగ్ టెక్నాలజీ వింగ్ కలసి పనిచేస్తున్నాయి.
ఇప్పటికే పలు యాప్‌లు అందుబాటులోకి..
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఇటీవల ప్రజాపాలన విజయోత్సవాలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఆ విజయోత్సవాల్లో భాగంగా రైతులు, యువత, మహిళలు లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం 3 ఐటీ, ఏఐ ఆధారిత అప్లికేషన్లను విడుదల చేసింది. మరో అప్లికేషన్‌ను ప్రభుత్వమే వినియోగిస్తోంది.
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, అగ్రికల్చర్ డేటా ఎక్సే్ఛంజీ సంయుక్తంగా ఒక అప్లికేషన్ రూపొందించాయి. వేగంగా డేటా మారి్పడి, వ్యవసాయ ఆవిష్కరణలను ఈ యాప్ వేగవంతం చేస్తుంది. రైతులు రూ.లక్షలోపు రుణాలను గతంలో మాదిరిగా వారాల తరబడి కాకుండా రెండు రోజుల వ్యవధిలోనే పొందడం సాధ్యమవుతుంది.
తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ‘ది మిత్ర’పేరిట ఏఐ ఆధారిత యాప్‌ను రూపొందించింది. పిల్లల్లో మాదక ద్రవ్యాల వినియోగాన్ని ప్రాథమిక స్థాయిలోనే ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పసిగట్టేందుకు ఈ యాప్ ఉపయోగపడుతుంది. మాదక ద్రవ్య రహిత వాతావరణంలో పిల్లలు పెరిగేలా ఈ యాప్ తోడ్పడుతుంది.
గ్రామీణ మహిళల్లో డిజిటల్ అక్షరాస్యత పెంపు కోసం ‘సన్మతి’యాప్ రూపొందించారు. ఏఐ వినియోగంపై సాధారణ పౌరుల్లో అవగాహన పెంచడంలోనూ ఈ యాప్ సాయపడుతుంది.
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక, పథకం అమలు కోసం రూపొందించిన ‘ఇందిరమ్మ యాప్’తో ప్రస్తుతం లబి్ధదారుల పరిశీలన జరుగుతోంది. భవిష్యత్తులో ఈ యాప్ ఇందిరమ్మ ఇళ్ల పథకం అమల్లో కీలకంగా నిలుస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.
సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నాం
జేపీఏఎల్ సహకారంతో ప్రభుత్వ శాఖల్లో ఏఐ వినియోగంపై నిర్వహించిన వర్క్‌షాప్‌లో అనేక ప్రతిపాదనలు అందాయి. ఏయే విభాగాల్లో ఏయే అంశాల్లో ఏఐ వినియోగం సాధ్యమవుతుందో పరిశీలిస్తున్నాం.
21 ప్రభుత్వ శాఖల నుంచి ప్రతిపాదనలు అందినా తొలిదశలో ఐదు శాఖలను ఎంపిక చేసి ఏఐ ఆధారిత అప్లికేషన్లు తయారు చేయాలని భావిస్తున్నాం. త్వరలో సంబంధిత శాఖల ముఖ్య కార్యదర్శులతో ఈ అంశంపై ప్రత్యేక సమావేశం జరుగుతుంది. – రమాదేవి లంకా, డైరెక్టర్, ఎమర్జింగ్ టెక్నాలజీ వింగ్
Comments
Please login to add a commentAdd a comment