కరెంటు లేనిదే కాసేపైనా ఉండలేం.. మరి కరెంటు ఉత్పత్తి చేయాలంటే.. ఎన్నో తిప్పలు. నానాటికీ బొగ్గు కరువై థర్మల్ విద్యుత్ ఆగిపోయే పరిస్థితి. నదుల్లో నీళ్లు పారినంత సేపే జల విద్యుత్ వస్తే.. సౌర విద్యుత్ పగటి పూట మాత్రమే ఉంటుంది. కానీ భవిష్యత్తులో 24 గంటలూ సౌర విద్యుత్ పొందగలిగేందుకు బాటలు పడుతున్నాయి. పర్యావరణానికి నష్టం లేకుండా, ఇటు 24 గంటలూ కరెంటు అందించేందుకు.. అందమైన ఐస్‌ల్యాండ్ దేశం రెడీ అవుతోంది. అదెలాగో తెలుసుకుందామా..
ఆకాశంలోనే అడ్డా వేసి..
భూమ్మీద అయితే పగటి పూట మాత్రమే సౌర విద్యుత్ ఉత్పత్తి సాధ్యం. అందులోనూ ఉదయం, సాయంత్రం సమయాల్లో సూర్య కిరణాల ధాటి తక్కువగా ఉండటం వల్ల తక్కువ విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ఆకాశం మేఘావృతమై ఉన్నా, సోలార్ ప్యానెల్స్ దుమ్ముపట్టినా ఇదే పరిస్థితి. దీనికి ప్రత్యామ్నాయంగా.. నేరుగా ఆకాశంలోనే ఉపగ్రహాల్లా సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసి కరెంటు ఉత్పత్తి చేయాలనే ప్రతిపాదన ఎప్పటి నుంచో ఉంది. దానివల్ల 24 గంటలూ సూర్య కిరణాలు పూర్తి స్థాయిలో ప్రసరిస్తాయి. దుమ్ము పట్టడం వంటి సమస్యేదీ ఉండదు. వచ్చిన చిక్కు ఏమిటంటే.. అక్కడ ఉత్పత్తి అయిన కరెంటును భూమ్మీదికి తేవడం ఎలాగనేదే!
1. స్పేస్‌లోని సోలార్ ప్యానళ్లపై సూర్య కిరణాలు పడతాయి.
2. వాటితో ఉత్పత్తయ్యే విద్యుత్‌ను రేడియో వేవ్స్‌గా మార్చి భూమి మీదకు పంపుతారు.
3. భూమిపై గ్రౌండ్ స్టేషన్ రేడియో వేవ్స్‌ను తిరిగి విద్యుత్‌గా మార్చి ఇళ్లకు సరఫరా చేస్తుంది.
రేడియో తరంగాల రూపంలో పంపుతూ..
ఆకాశంలో ఏర్పాటు చేసే ప్యానల్స్ వద్ద ఉత్పత్తి అయిన కరెంటును భూమ్మీదకు తెచ్చే టెక్నాలజీని కూడా శాస్త్రవేత్తలు ఇప్పటికే రూపొందించారు. ఆ కరెంటును నిర్ణీత ఫ్రీక్వెన్సీలో రేడియో తరంగాలుగా మార్చి.. భూమ్మీద ఎంపిక చేసిన ప్రదేశంలో కేంద్రీకృతమయ్యేలా ప్రసారం చేస్తారు. ఇక్కడ ఏర్పాటు చేసే ప్రత్యేక యాంటెన్నాలు, పరికరాలు వాటిని గ్రహించి.. తిరిగి కరెంటుగా మారుస్తాయి. ఈ కరెంటును ఇళ్లకు, ఇతర అవసరాలకు ప్రసారం చేస్తారు. ఇటీవలే ‘కాల్‌టెక్’ అనే సంస్థ అంతరిక్షం నుంచి రేడియో తరంగాల రూపంలో పంపిన విద్యుత్‌ను భూమ్మీద ఒడిసిపట్టి.. తిరిగి విద్యుత్‌గా మార్చగలిగింది కూడా. అది ప్రయోగాత్మక పరిశీలన కాబట్టి కొన్ని మిల్లీవాట్ల విద్యుత్ మాత్రమే ఉత్పత్తి చేశారు. ఇప్పుడు ఐస్‌ల్యాండ్‌లో పూర్తిస్థాయిలో మెగావాట్ల మేర విద్యుత్‌ను అంతరిక్షం నుంచి ఉత్పత్తి చేసేలా ప్రాజెక్టు సిద్ధం చేస్తున్నారు.
‘స్పేస్ సోలార్ విద్యుత్’ లాభాలెన్నో..
24 గంటలూ సౌర విద్యుత్ సరఫరాకు చాన్స్.. మిగతా పునరుత్పాదక వనరులతో పోలిస్తే తక్కువ ధర
ఈ స్పేస్ సోలార్ విద్యుత్ వల్ల పెద్దగా కాలుష్యం ఉండదు. ఇళ్లకు మాత్రమేగాకుండా వాహనాలు,
పరిశ్రమల్లోనూ ఈ విద్యుత్ వినియోగిస్తే.. శిలాజ ఇంధనాలతో వెలువడే కాలుష్యం ముప్పు తగ్గుతుంది.
ఒకసారి వ్యవస్థలను ఏర్పాటు చేస్తే సుదీర్ఘకాలం పాటు వినియోగించుకోవచ్చు.
ప్రకృతి విపత్తులు వంటివి సంభవించినప్పుడు త్వరగానే విద్యుత్ సరఫరాను పునరుద్ధరించుకోవచ్చు.
మూడు కంపెనీలు కలసి..
యూకేకు చెందిన స్పేస్ సోలార్ సంస్థ, ఐస్‌ల్యాండ్‌కు చెందిన రేక్జావిక్ ఎనర్జీ కంపెనీ, ఐస్‌ల్యాండిక్ సస్టెయినబిలిటీ ఇనిíÙయేటివ్ ట్రాన్సిషన్ ల్యాబ్స్ సంస్థలతో కలసి.. అంతరిక్ష సోలార్ పవర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. తొలుత 2030 సంవత్సరం నాటికి.. 30 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. సుమారు 3వేల ఇళ్లకు ఆ విద్యుత్‌ను సరఫరా చేయాలని భావిస్తున్నారు.
భవిష్యత్తులో గిగావాట్ల స్థాయిలో..
స్పేస్ సోలార్ సంస్థ భవిష్యత్తులో భారీ స్థాయిలో ‘స్పేస్ విద్యుత్’ను ఉత్పత్తి చేసేందుకు ప్లాన్ చేస్తోంది. ఇందుకోసం ‘కాస్సియోపియా’ పేరిట ప్రాజెక్టును చేపట్టనుంది. భారీ సోలార్ ప్యానళ్లతో కూడి ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపి.. ఒక నెట్‌వర్క్‌గా రూపొందించాలని.. దాని నుంచి 2036 నాటికి గిగావాట్ల కొద్దీ విద్యుత్‌ను ఉత్పత్తి చేసేందుకు వీలుగా ప్రణాళికలు సిద్ధం చేసింది. ‘‘స్పేస్ సోలార్ ప్రాజెక్టు వల్ల తక్కువ ధరకే 24 గంటల పాటు విద్యుత్‌ను సరఫరా చేసేందుకు వీలుంటుంది. దీనిపై రేక్జావిక్ ఎనర్జీ సంస్థతో కలసి ముందుకు వెళ్తున్నాం. సుస్థిర భవిష్యత్తుకు ఇది బాటలు వేస్తుంది..’’ అని స్పేస్ సోలార్ సంస్థ కో–సీఈవో మార్టిన్ సోల్టూ పేర్కొన్నారు.
- సాక్షి సెంట్రల్‌డెస్క్
ఏర్పాటు, వాడకంలో ఇబ్బందులూ ఉన్నాయి?
⇒ అంతరిక్షంలో ఉపగ్రహాలు, సోలార్ ప్యానళ్ల ఏర్పాటు చాలా వ్యయంతో కూడుకున్నది.
⇒ అంతరిక్షం నుంచి పంపే రేడియో వేవ్‌ల వల్ల మనుషులు, ఇతర జీవజాలంపై,
⇒ వాతావరణంపై పడే ప్రభావం ఏమిటన్నది పూర్తిగా తేలాల్సి ఉంది.
⇒ ప్రస్తుతమున్న టెక్నాలజీలతో ట్రాన్స్‌మిట్ అయ్యే కరెంటు తక్కువ. ఇది గణనీయంగా పెరగాల్సి ఉంది.
⇒ ఆకాశం మేఘావృతమై ఉన్నప్పుడు రేడియో వేవ్‌ల ప్రసారం ఎలా ఉంటుందన్న దానిపై స్పష్టత రావాల్సి ఉంది.
⇒రేడియో తరంగాలు గ్రౌండ్ స్టేషన్‌పైనే కాకుండా.. ఇతర ప్రాంతాలపైకి ఫోకస్ అయితే ప్రమాదాలు జరగవచ్చనే ఆందోళన ఉంది.
Comments
Please login to add a commentAdd a comment