స్థల సేకరణ, బ్యాంకు రుణాల్లో చేయూతనందించండి
అధికారులకు డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క ఆదేశం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం సౌర విద్యుత్ (సోలార్ పవర్ ప్లాంట్లు) కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించిందని, ఇందులో ఇందిరా మహిళాశక్తి సంఘాలకు ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం తీర్మానించిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. ఇందిరా మహిళాశక్తి సభ్యులు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆకాంక్షించారు. అందుకు పూర్తిస్థాయిలో ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. శుక్రవారం ప్రజాభవన్‌లో ఆయన ఇంధన శాఖ ముఖ్యకార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా, పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి లోకేశ్, సెర్ప్ సీఈవో దివ్య దేవరాజన్, ట్రాన్స్‌కో సీఎండీ కృష్ణభాస్కర్, రెడ్కో వైస్‌చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ వావిలాల అనీల తదితరులతో ఈ అంశంపై సమీక్షించారు.
రాష్ట్రంలో 4 వేల మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తికి త్వరితగతిన చర్యలు ప్రారంభించాలని ఆదేశించారు. స్వయం సహాయక సంఘాల సమాఖ్యలకు అవసరమైన స్థలాలను సేకరించి వారికి లీజుకు ఇవ్వాలని సూచించారు. సోలార్ విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన యంత్రాల కొనుగోళ్లకు అవసరమైన ఆర్థిక వనరుల కోసం బ్యాంకర్లతో సమావేశం ఏర్పాటు చేసి రుణాలు ఇప్పించేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. రుణాల తిరిగి చెల్లింపుల్లో స్వయం సహాయక సంఘాల సభ్యులు 99 శాతం ప్రగతిని కనబరుస్తున్నారని, వీరికి రుణాలు ఇచ్చేందుకు బ్యాంకర్లు ఆసక్తిగా ఉన్న విషయాన్ని అనుకూలంగా మలుచుకోవాలని డిప్యూటీ సీఎం చెప్పారు.
ఇటీవల బ్యాంకర్ల సమావేశంలోనూ స్వయం సహాయక సంఘాల సభ్యులు పారిశ్రామిక వేత్తలుగా ఎదిగేందుకు సోలార్ విద్యుత్ ఉత్పత్తి ప్లాట్ల ఏర్పాటు, ఆరీ్టసీకి బస్సులు సమకూర్చే మరిన్ని పథకాలను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకురానున్నట్టు స్పష్టం చేశామన్నారు. వారు కూడా విరివిగా రుణాలిచ్చి ఆర్థికంగా ప్రోత్సాహం అందిస్తామని స్పష్టం చేసిన విషయాన్ని డిప్యూటీ సీఎం అధికారులకు వివరించారు.
మహిళా సంఘాలకు ఆర్థిక చేయూత ఇవ్వడం ద్వారా, పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడం ద్వారా సామాజిక మార్పు సాధించేందుకు అవకాశం ఏర్పడుతుందని భట్టి విక్రమార్క తెలిపారు. స్వయం సహాయక సంఘాలు ఆర్థికంగా బలపడితే గ్రామీణ మహిళలు ఆర్థికంగా, సామాజికంగా బలోపేతం అయ్యేందుకు అవకాశం ఏర్పడుతుందన్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని వివిధ శాఖల అధికారులు సమన్వయంతో ముందుకు వెళ్లాలని చెప్పారు.
ఇంధనశాఖకు పీఆర్‌శాఖ ప్రతిపాదనలు
మహిళా స్వయం సహాయక సంఘాలకు వె య్యి మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్లు కేటాయించాలని ప్రభుత్వానికి పంచాయతీరాజ్ శాఖ ప్రతిపాదనలు పంపింది. ఒక్క మెగావాట్‌కు రూ. 3 కోట్ల వ్యయం అవుతుందని అధికారులు అంచనా వేశారు. ఈ వ్యయంలో 10 శాతం మహిళా సంఘాలు భరిస్తే 90 శాతం బ్యాంకు ద్వారా రుణాలు ఇవ్వనున్నాయి. ఇంధనశాఖ దీనికి గ్రీన్‌సిగ్నల్ ఇవ్వాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment