
సాక్షి,తగరపువలస (విశాఖపట్నం): విద్యార్థులకు నాలెడ్జ్ క్యాపిటల్‌గా ఆంధ్రప్రదేశ్, ప్రపంచానికి వస్తు ఉత్పత్తి కేంద్రంగా భారతదేశం చిరునామాగా మారాయని ఉన్నత విద్యామండలి చైర్మన్ కె.హేమచంద్రారెడ్డి అన్నారు. శుక్రవారం భీమిలి మండలం దాకమర్రి రఘు ఇంజనీరింగ్ కళాశాలలో ఐఈఈఈ విశాఖ బే సెక్షన్ సాంకేతిక సౌజన్యంతో ప్రారంభమైన ‘ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ కంప్యూటింగ్, కమ్యూనికేషన్ అండ్ పవర్ టెక్నాలజీ’–(ఐసి3పి2022) వర్క్‌షాపును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా అధ్యాపకులు, విద్యార్ధులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. సాంకేతికంగా పురోగతి సాధించిన ప్రస్తుత కాలంలో ప్రపంచం అరచేతిలో ఇమిడిపోయిందన్నారు.
దీనిని విద్యార్థులు తమ భవిష్యత్తును అందంగా తీర్చిదిద్దుకునేందుకు ఉపయోగించుకోవాలని సూచించారు. అందుబాటులో ఉన్న సాంకేతికతో నూతన ఆవిష్కరణలకు నాంది పలకాలన్నారు. మారుతున్న సాంకేతికతను అర్ధం చేసుకుంటూ ప్రాథమిక అంశాలపై లోతైన అవగాహన కలిగి ఉండాలన్నారు. స్టార్టప్, ఇంక్యుబేషన్, ఎంటర్‌ప్యూనర్‌షిప్‌లు ప్రస్తుత తరానికి సుపరిచితులన్నారు. ఆ దిశగా విద్యార్థులు అడుగులు వేసి దేశ ఆర్థికాభివృద్ధిలో భాగస్వాములు కావాలన్నారు. ఐఈఈఈ వైజాగ్ బే అధ్యక్షుడు ఎస్.లక్ష్మీనారాయణ మాట్లాడుతూ తమ సంస్థ ద్వారా వివిధ విద్యాసంస్థల్లో నిర్వహిస్తున్న తొలి సదస్సు రఘు ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహిస్తున్నామన్నారు. సంస్థ కార్యక్రమాలు, సభ్యులు, విధి విధానాలు తదితర అంశాల గురించి వివరించారు.
రఘు విద్యాసంస్థల చైర్మన్ కలిదిండి రఘు మాట్లాడుతూ ఉన్నత విద్య అవసరాలను గుర్తించి దానికి అనుగుణంగా అవసరమైన ప్రోత్సాహం, సహకారం ఉన్నత విద్యామండలి అందిస్తుందన్నారు. ఇలాంటివి విద్యారంగానికి శుభపరిణామన్నారు. బోధన వృత్తి ఎంతో ఉన్నతమైనదన్నారు. విద్యార్థులకు ఆసక్తి పెంచేవిధంగా బోధన జరపాలన్నారు. కళాశాల వైస్ ప్రిన్సిపాల్ పి.సతీష్ రామచౌదరి మాట్లాడుతూ సదస్సుకు మన దేశంతో పాటు వివిధ దేశాల నుంచి 206 పరిశోధనా పత్రాలు వచ్చాయన్నారు. దీనిని హైబ్రిడ్ మోడల్‌లో నిర్వహిస్తున్నట్టు తెలిపారు. రెండు రోజుల పాటు కీలక ఉపన్యాసాలు, టెక్నికల్ సెషన్లు నిర్వహిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా సదస్సు సావనీర్‌ను హేమచంద్రారెడ్డి ఆవిష్కరించారు. అనంతరం అతిథులను జ్ఞాపికలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాళ్లు సీహెచ్ శ్రీనివాస్, ఎస్. సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment