వచ్చేనెల 11-17 తేదీల్లో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలు
సాక్షి, హైదరాబాద్: ప్రజాసమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని సీపీఐ నిర్ణయించింది. సెప్టెంబర్ 11 నుంచి 17 వరకు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలను నిర్వహించనుంది. డిసెంబర్ 26న పార్టీ 90వ వ్యవస్థాపక దినోత్సవాన్ని నిర్వహించాలని తీర్మానించింది. రెండు రోజుల రాష్ట్ర కౌన్సిల్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సోమవారం మఖ్దూంభవన్‌లో జరిగిన ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. వచ్చే నెల 2న జరగనున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో అన్ని కార్మిక సంఘాలతో కలసి పాల్గొనాలని నిర్ణయించింది.
ఎస్సీలతోపాటు గిరిజనులకు 3ఎకరాల భూపంపిణీ చేయాలని, పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయాలని డిమాండ్ చేసింది. సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మాట్లాడుతూ.. పదవిని కాపాడుకోవడానికే ఏపీ సీఎం చంద్రబాబు పాకులాడుతున్నారని ధ్వజమెత్తారు. నిధులు లేవంటూనే రూ.5 కోట్లు పెట్టి తన కోసం బస్సు కొనుగోలు చేశారని, అడుక్కునేవాడు పంచభక్ష పరమాన్నాలు తిన్నట్లుగా బాబు తీరుందని ఎద్దేవా చేశారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల సమస్యలను పరిష్కరించకుండా ముఖ్యమంత్రులు చంద్రబాబు, కేసీఆర్‌లను కేంద్ర ప్రభుత్వం తన చెప్పుచేతల్లో పెట్టుకునేందుకు ప్రయత్నిస్తోందన్నారు. ఉద్యోగుల విభజన, నీళ్లు, విద్య వంటి ముఖ్యమైన సమస్యలను పరిష్కరించకుండా తాత్సారం చే స్తోందని విమర్శించారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ అహంకారపూరిత వైఖరి పరాకాష్టకు చేరిందని నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. చరిత్రలో ప్రజలు అహంకారాన్ని సహించలేదన్నారు. మాజీ సీఎం ఎన్టీరామారావు విషయంలో ఇది నిరూపితమైందన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ రాబోయే రోజుల్లో ప్రజాసమస్యల పరిష్కారానికి ఉద్యమాలను ముమ్మరం చేస్తామన్నారు. కార్మికులు జీతాలు పెంచాలని, పేదలు ఇళ్లు కూల్చొద్దని, మహిళలు చీప్‌లిక్కర్ వద్దని, రైతులు, కూలీలు సమస్యలు పరిష్కరించాలని ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవ హరిస్తోందని విమర్శించారు.
సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంపై ఒత్తిడి: సీపీఐ
Published Tue, Aug 18 2015 1:06 AM | Last Updated on Sun, Sep 3 2017 7:37 AM
Advertisement