చేనేతకు పన్ను మినహాయింపు ఇవ్వాలి
మంత్రి అచ్చంనాయుడికి వినతి
కాకినాడ సిటీ : కుంటుపడుతున్న చేనేత రంగానికి పన్ను విధానంలో మినహయింపు ఇవ్వాలని జౌళి శాఖ మంత్రి కింజరపు అచ్చంనాయుడిని వీవర్స్ యునైటెడ్ ఫ్రంట్ రాష్ట్ర కన్వీనర్ తూతిక శ్రీనివాసవిశ్వనాథ్ కోరారు. బుధవారం జిల్లాకు వచ్చిన మంత్రిని ఫ్రంట్ ప్రతినిధులు బృందం సత్కరించి చేనేత సమస్యలపై వినతిపత్రం సమర్పించింది. చేనేత వస్త్రాలకు ‘రిబేటు’ఇవ్వకపోవడం వల్ల సంఘాలలో వస్త్రాలు నిల్వ ఉండి పాడైపోతున్నాయన్నారు. కేంద్ర, రాష్ట్ర జౌళి శాఖల మధ్య సమన్వయ లోపం వల్ల కేంద్ర పథకాల లబ్ధిని రాష్ట్రంలోని చేనేత కార్మికులు పొందలేకపోతున్నారని వివరించారు. దీంతో నైపుణ్యం ఉన్న నేత కార్మికులే వృత్తి వదిలివెళ్లిపోతున్నారని మంత్రి దృష్టికి తీసుకెళ్ళారు. మంత్రిని కలిసిన వారిలో ఫ్రంట్ కో-కన్వీనర్ శీరం లక్ష్మణప్రసాద్, యర్రా వీరభద్రారావు, చింత వీరభద్రరావు, మలిపెద్ది అప్పారావు, వీసా పరమేశ్వరరావు, శీరం అప్పారావు, గుడిమెట్ల వీర్రాజు, చేనేత సహకార సంఘ ప్రతినిధులు ఉన్నారు.