సర్వే చయకుండా ఎలా అంచనాలు వేస్తారని ఎస్‌ఈని ప్రశ్నిస్తున్న కలెక్టర్
ఏం.. తమాషాగా ఉందా!
Published Tue, Dec 13 2016 9:52 PM | Last Updated on Mon, Oct 1 2018 2:44 PM
- ఎస్‌ఆర్‌బీసీ ప్యాకేజీ పనుల పురోగతి చాలా పూర్
- పనులు పూర్తి చేసేందుకు కచ్చితమైన సమయం చెప్పట్లేదు
- కర్ణాటకపై ఒత్తిడి చేసి నీరు తెచ్చినా మీతో పనులు చేయించలేకపోతున్నా
- నెలాఖరులోగా హంద్రీనీవా డిస్ట్రిబ్యూటరీలు పూర్తి కావాలి
- ఇంజినీర్లపై కలెక్టర్ ఆగ్రహం
కర్నూలు సిటీ: ‘ఏళ్లు గడుస్తున్నా ప్రాజెక్టుల పనులు పూర్తి చేయలేకపోతున్నారు.. నీళ్లు లేక రైతులు నష్టపోతున్నారు..ఏం.. తమాషాగా ఉందా, ఇంకెన్నాళ్లు పనులు చేస్తారు’ అంటూ జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ జల వనరుల శాఖ ఇంజినీర్లపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘తాత్కాలిక పనులు చేసి నీరు ఇస్తామంటే కుదరదు.. ఎప్పటి లోగా పనులు పూర్తి చేస్తారో కచ్చితమైన సమాధానం ఎందుకు చెప్పలేక పోతున్నారు’ అంటూ కలెక్టర్ మండి పడ్డారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో సాగు నీటి ప్రాజెక్టుల పనుల పురోగతిపై ఆయన జల వనరుల శాఖ ఇంజినీర్లతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే నెల 15 తేదీలోగా పెండింగ్ పనులు చేయాలన్నారు. ఎస్‌ఆర్‌బీసీ 25వ ప్యాకేజీలో ఇంకా 87 వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్, 6.39 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి తవ్వక పనులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. వచ్చే వారం 24, 25, 26, 27 ప్యాకేజీల కాంట్రాక్టర్లతో కలిసి వస్తే కచ్చితమైన సమాచారం వస్తుందన్నారు. గోరుకల్లు రిజర్వాయర్ పనులు వచ్చే వారంలోపు ఓ కొలిక్కి రావాలని ఈఈకి సూచించారు. సిద్ధాపురం లిఫ్ట్ పనులకు సంబంధించిన సమస్యలు పరిష్కారం చేసినా ఎందుకు పనులు చేయడం లేదని ప్రశ్నించారు.
ముచ్చుమర్రి పనుల్లో ఇంజినీర్లు ఫెయిల్
‘ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం కింద కేసీ నీరు ఇచ్చేందుకు రూ. కోట్లు ఖర్చు పెట్టి తాత్కాలిక విద్యుత్ సదుపాయం కల్పించినా పనులు పూర్తి కాలేదు. ఎఫర్ట్ పెట్టామంటూ అందరూ కథలు చెబుతున్నారా’ అంటూ హంద్రీనీవా ఇన్చార్్జ ఎస్‌ఈ నారాయణ స్వామిని ప్రశ్నించారు. మూడు వారాలుగా మోటారు సమస్యను చెబుతున్నారే ఎందుకు పరిష్కరించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతేడాది కూడా గురురాఘవేంద్ర కింద ఉన్న ఎత్తిపోతల పథకాలను ముందుగా కాకుండా సీజన్ చివరిలో మొదలు పెట్టేలోగా నీరు నిలిచిపోయిందన్నారు. కర్ణాటక ప్రభుత్వం ఒత్తిడి చేసి నీరు తీసుకు రాగలిగామని, మీతో పనులు చేయించలేక పోతున్నానని కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు.
హంద్రీనీవాకు మీ వల్లే నీరు అందడం లేదు:
హంద్రీనీవా కాలువ కింద ఉన్న డిస్ట్రిబ్యూటరీ పనులు సకాలంలో పనులు పూర్తి చేయకపోవంతో జిల్లాకు హంద్రీనీవా ద్వారా నీరు అందడం లేదన్నారు. ఈ నెల 31లోపు కచ్చితంగా పనులు పూర్తి చేయాలని లేకపోతే కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందన్నారు. ఈనెల 31లోపు పూర్తి చేసి, జనవరి 1వ తేదీన కచ్చితంగా నీరు ఇవ్వాలన్నారు. తాను అనుకుంటే కాంట్రాక్టర్లపై క్రిమినల్ కేసులు పెట్టగలనని కలెక్టర్ హెచ్చరించారు.
సర్వే రిపోర్ట్ లేకుండా ఎలా అంచనా వేశారు
జిల్లాలోని వాగులన్నింటిలో జంగిల్ క్లియరెన్స్ చేసేందుకు అంచనాలు వేయమంటే ఎలాంటి సర్వే చేయకుండానే ఎలా అంచనాలు వేశారని ఎస్‌ఈ చంద్రశేఖర్ రావును ప్రశ్నించారు. ఇలా చేస్తే ఏటా జంగిల్ క్లియరెన్స్‌లు చేసేందుకే సరిపోతుందని, పనులు చేశాక విజిలెన్స్ వాళ్లు తనిఖీ చేస్తే ఎవరిని బాధ్యులు చేస్తారని ప్రశ్నించారు. జిల్లాలో రెగ్యులర్ ఏఈఈలు ఉన్న మండలాల్లో మాత్రమే సర్వే చేసి, ఎన్ని వాగులు అయితే చేయగలరో మీరే నిర్ణయించుకోని ఫీల్డ్‌కి పోయి కొలతలు వేసి అంచనాలు వేయాలని సూచించారు. వచ్చే వారం పక్కా సమాచారంతో రావాలన్నారు. సమావేశంలో ఎస్‌ఈలు చంద్రశేఖర్ రావు, సూర్యకూమార్, నారాయణస్వామి, ఈఈలు విశ్వనాథం, రెడ్డిశేఖర్‌రెడ్డి, రెడ్డిశంకర్, శ్రీనివాసులు, బాలచంద్రారెడ్డి, ప్రసాద్‌రెడ్డి, పురుషోత్తం, సుబ్బరాయుడు, డీఈఈ, చిన్న నీటి పారుదల శాఖ ఏఈఈలు తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement