కాళ్లు పట్టుకునే సంస్కృతి టీడీపీదే | What wrong in jagan, pm meet? | Sakshi
Sakshi News home page

కాళ్లు పట్టుకునే సంస్కృతి టీడీపీదే

Published Tue, May 16 2017 12:02 AM | Last Updated on Fri, Jul 12 2019 5:45 PM

What wrong in jagan, pm meet?

  • వైఎస్‌ జగన్‌ ప్రధానిని కలిస్తే తప్పేంటి?
  • వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు శంకరనారాయణ
  • గోరంట్ల (సోమందేపల్లి) :

       ‘ఓటుకు కోట్లు’ కేసు నుంచి గట్టెక్కేందుకు తెలంగాణ సీఎం కేసీఆర్‌ మొదలు ఢిల్లీ పెద్దల వరకూ అందరి కాళ్లు పట్టుకున్న నైజం చంద్రబాబుదని వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు ఎం.శంకరనారాయణ విమర్శించారు. పదేళ్ల పాటు ఉమ్మడి హక్కు ఉన్న హైదరాబాద్‌ను వదిలి రావడంతో పాటు ప్రత్యేక హోదాను చంద్రబాబు తాకట్టు పెట్టారని అన్నారు.

    రాష్ట్ర ప్రయోజనాలు ఆకాంక్షిస్తూ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రధాని మోదీని కలిస్తే తప్పేమిటని ఆయన ప్రశ్నించారు. రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ, పంటల బీమా అందించాలని గోరంట్ల తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట సోమవారం రైతు ధర్నా చేపట్టారు. ఈసందర్భంగా శంకరనారాయణ మాట్లాడుతూ బ్యాంకులకు టోకరా వేసిన కేంద్ర మంత్రి సుజనాచౌదరి, రాష్ట్ర మంత్రి గంటా ఆ కేసుల నుంచి తప్పించుకోవడానికి ఎవరి కాళ్లు పట్టుకున్నారో? ఆ పార్టీ నేతలే చెప్పాలన్నారు. రెయిన్‌ గన్స్‌తో రక్షక తడుల పేరుతో దాదాపు రూ. 300 కోట్లు ఖర్చు చేసి జిల్లాలో కరువును తరిమేశానని గొప్పలు చెప్పిన బాబు... ఒక్క ఎకరా పంటను కూడా కాపాడలేకపోయారన్నారు.

    గత ఏడాది పంట సాగు ద్వారా రైతులు రూ. 4 వేల కోట్లు నష్టపోతే, వారికి కనీసం రూ.వెయ్యి కోట్ల మేర ఇన్‌పుట్‌ సబ్సిడీ ప్రకటించలేదన్నారు. వైఎస్సార్‌ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జిల్లా నుంచి కరువును శాశ్వతంగా పారదోలేందుకు హంద్రీ-నీవా ప్రాజెక్ట్‌ ద్వారా కృష్ణా జలాలను అందించారని గుర్తు చేశారు. ఈ మూడేళ్లలో హంద్రీ-నీవా పథకాన్ని పూర్తిగా నిర్వీర్యం చేయడమే కాక, పట్టిసీమ ప్రాజెక్ట్‌ల్లో రూ.వందల కోట్లను కమీషన్ల రూపంలో దండుకున్న ఘనత చంద్రబాబుదేనని విమర్శించారు. గొల్లపల్లి రిజర్వాయర్‌ నుంచి పెనుకొండ పట్టణానికి పైపులైన్‌ ద్వారా తాగునీటిని అందిస్తామంటూ ఎమ్మెల్యే బీకే పార్థసారథి ఇస్తున్న హామీల్లో ఎంత మాత్రం వాస్తవం లేదన్నారు.  పర్సెంటేజీల కోసం పాకులాడుతూ జిల్లాలో పారిశ్రామికాభివృద్ధికి ఎంపీ నిమ్మల కిష్టప్ప, ఎమ్మెల్యే బీకే పార్థసారథి గండికొడుతున్నారని విమర్శించారు. ఇసుకను అక్రమంగా కర్ణాటకకు తరలించి రూ. కోట్లు ఆర్జిస్తున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్లు ఫకృద్దీన్, మేదర శంకర, సింగిల్‌విండో అధ్యక్షుడు గంపల రమణారెడ్డి, శంకర్‌రెడ్డి, రఘురామిరెడ్డి, రాజేంద్రప్రసాద్, సీనియర్‌ నాయకులు బూదిలి వేణుగోపాల్‌రెడ్డి, నాగలూరు బాబు, శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు. 

     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement