చైతన్యపురి: ఇంట్లో వారు నిద్రలో ఉండగా వెనుక తలుపు నుంచి చొరబడ్డ దొంగలు బీరువాలోని నగదు, నగలు ఎత్తుకెళ్లారు. చైతన్యపురి సీఐ గురురాఘవేంద్ర ప్రకారం... మారుతీనగర్ రోడ్ నెం–5లో నివాసముండే అరుణ్‌కుమార్ మెడికల్ షాపు నిర్వహిస్తున్నాడు. శనివారం రాత్రి అరుణ్‌కుమార్ కుటుంబసభ్యులంతా ఇంట్లో నిద్రిస్తుండగా వెనుక కిటికీ ద్వారా డోర్ తెరిచిన దొంగలు బీరువాలోని రూ.1.8 లక్షల నగదు, 9 తులాల బంగారు ఆభరణాలు చోరీ చేసుకెళ్లారు. ఉదయం నిద్ర లేచిన అరుణ్‌కుమార్ చోరీ జరిగినట్టు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. క్లూస్‌టీంతో ఆధారాలు సేకరించి కేసు దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ తెలిపారు.
మరో రెండు ఘటనలు...
బంజారాహిల్స్: నిద్రిస్తున్న సమయంలో ఇంట్లో దొంగలు పడి సెల్‌ఫోన్లతో పాటు నగదు ఎత్తుకెళ్లిన రెండు ఘటనలు బంజారాహిల్స్ ఠాణా పరిధిలో జరిగాయి. పోలీసుల కథనం ప్రకారం.. బంజారాహిల్స్ రోడ్ నెం.2 ఇందిరానగర్‌లోని నల్లపోచమ్మ గుడి సమీపంలో యుగేంధర్ తన స్నేహితులతో కలిసి నివాసం ఉంటున్నాడు. శనివారం రాత్రి నిద్రించిన యుగేంధర్ ఆదివారం ఉదయం నిద్రలేచి చూసేసరికి అతని ఐఫోన్, స్నేహితుడి సామ్‌సంగ్ గాలక్సీ ఫోన్ అదృశ్యమయ్యాయి.
ఇదే విధంగా రోడ్ నెం.14లో మరో ఘటన జరిగింది. శ్రీకాంత్‌రెడ్డి అనే సిస్టం ఇంజినీర్ రాత్రి నిద్రపోయి ఉదయం లేచి చూసేసరికి అతని గదిలో ఉండాల్సిన మోటో జీ, సెల్‌కాన్, సామ్‌సంగ్ ఫోన్లతో పాటు డ్రైవింగ్ లైసెన్స్, ఎస్‌బీఐ ఏటీఎం కార్డులతో కూడిన పర్సు పోయింది. బాధితుల ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ క్రైం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.