chaithanyapuri
-
కట్టడి లేని కల్తీ దందా
సాక్షి,సిటీబ్యూరో: చైతన్యపురిలోని హెచ్‌పీ పెట్రోల్ బంక్‌లో ఇటీవల వాహనాల్లో పెట్రోల్ నింపుకుంటే సదరు వాహనాలు కొద్దిదూరం వెళ్లి ఆగిపోయాయి. ఏం జరిగిందో పరీక్షించగా పెట్రోల్‌లో నీళ్లు కలిసినట్టు గుర్తించారు. దాంతో కొందరు వాహనదారులు వెనుదిరిగి వచ్చి ఆ బంకులో పెట్రోల్‌ను సీసాల్లో నింపి పరిశీలించగా బాటిల్ అడుగున నీరు కనిపించడంతో కల్తీని నిర్ధారించుకున్నారు. అంతకు ముందు పెట్రోలు పోయించుకున్న వాహనాలకు సైతం అదే సమస్య తలెత్తడంతో వారూ బంక్ వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు. ఇలాంటికల్తీ సంఘటనలు నగరంలో తరచూ బయటపడుతున్నా సంబంధిత అధికారులు మాత్రం శాంపిల్స్ సేకరించి ల్యాబ్‌కు పంపడం తప్ప.. కల్తీ జరిగిందా.. లేదా.. కల్తీ తేలితే ఏం చర్యలు తీసుకున్నారో తెలియడం లేదు. ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాల కల్తీ ఆయిల్ మాఫీయా మహానగరంలో పాగా వేస్తున్నట్టు వస్తున్న అనుమానాలకు ఈ ఇంధన కల్తీ బలం చేకూరుస్తోంది. పెట్రోల్, డీజిల్ ధరలు రోజురోజుకు ఎగబాగుతుండటంతో గుట్టుచప్పుడు కాకుండా పెట్రోల్ బంకుల్లో కల్తీ జరిగిపోతోంది. అధికారికంగా అయిల్ కంపెనీల నుంచి పది శాతం ఇథనాల్‌తో కూడిన ఇంధనం సరఫరా అవుతుండగా.. మరోవైపు అక్రమంగా ట్యాంకర్ల కొద్దీ టిన్నర్, నాఫ్తా, కిరోసిన్ కూడా పెట్రోల్ బంకులకు దిగుమవుతున్నట్లు ఆరోపణలు వినవస్తున్నాయి. దీంతో పెట్రోల్ బంక్‌ల్లో కల్తీ వ్యవహరానికి అడ్డూ అదుపు లేకుండా పోతోంది. పెట్రోల్ బంకుల్లో ఇంధనం నాణ్యతపై తనిఖీ చేయాల్సిన పౌరసరఫరా శాఖాధికారులు పట్టిపట్టనట్లు వ్యవహరించడంతో కల్తీ వ్యవహారం బంకుల ఇష్టారాజ్యమైంది. నగరంలో యథేచ్చగా కల్తీ శివార్లోని బంకులు అధికంగా కల్తీకి పాల్పడుతున్నట్లు ఆరోపణలు వినవస్తున్నాయి. ఇందుకు పలు సంఘటనలు బలం చేకూర్చుతున్నాయి. నిత్యం నగరానికి పెద్ద ఎత్తున వాహనాలు రాకపోకలు సాగిస్తున్నందున ఇక్కడి పెట్రోల్ బంకులకు ఇంధన డిమాండ్ బాగానే ఉంటుంది. దీంతో వాటి యాజమాన్యాలు చేతివాటం ప్రదర్శిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో కారుచౌకగా బయోడిజిల్, కిరోసిన్, నాఫ్తా ఆయిల్ తెప్పించి కల్తీ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఉత్తరాది రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున ట్యాంకర్లు సిటీకి దిగుమతి అవుతున్నట్లు సమాచారం. ఎలక్ట్రానిక్ పెట్రోల్ బంకులు æఆయిల్ కంపెనీల ప్రధాన యూనిట్లకు అనుసంధానమై ఉండడంతో ఇంధనంలో కల్తీ జరిగితే రీడింగ్, డెన్సిటీ ద్వారా బయటపడుతుంది. సాధారణంగా రోజుకు 25 వేల లీటర్ల పెట్రోల్, 40 వేల లీటర్ల డీజీల్ విక్రయించే బంకులు పూర్తి స్థాయి ఎలక్ట్రానిక్‌గా మారాలి. అయితే నగరంలోని బంకుల్లో సేల్స్ ఉన్నా.. కొన్ని పూర్తి స్థాయి ఎలక్ట్రానిక్ బంక్‌లుగా మారకపోవడం అనుమానాలకు తావిస్తోంది. దెబ్బ తీస్తున్న ఇథనాల్ మిళితం ఆయిల్ కంపెనీల నుంచి ఇథనాల్ కలిసిన పెట్రోల్ సరఫరా కూడా నిల్వలను దెబ్బతీస్తోంది. ఇథనాల్ మిళితమైన పెట్రోల్ నిల్వల్లో నీరు కలిస్తే క్రమంగా పెట్రోల్ నీరుగా మారుతుంది. చమురు సంస్థలు అధికారికంగానే ఇథనాల్ బ్లెండింగ్ ప్రోగ్రాం కింద పెట్రోల్‌లో 10 శాతం ఇథనాల్‌ను కలుపుతున్నట్లు కంపెనీలే చెబుతున్నాయి. ఇథనాల్‌ను ఇంధనంతో కలపడం వల్ల పెట్రోల్ ఆక్టేన్ సంఖ్య పెరుగుతుంది. ధర కూడా తగ్గించాల్సి ఉంటుంది. కానీ, చమురు సంస్థలు ఇవేమి పట్టించుకోకుండా పెట్రోల్‌లో సుమారు పదిశాతం ఇథనాల్ కలిపి సరఫరా చేయడం విస్మయానికి గురిచేస్తోంది. శాంపిల్స్ సేకరిస్తున్నారా..? పెట్రోల్ బంక్‌కు ట్యాంకర్ రాగానే ప్రత్యేకంగా శాంపిల్స్ తీసి ఇన్వాయిస్తో సహా భద్రపరచాలి. ఒకవేళ వినియోగదారుడు కల్తీ జరిగిందని అనుమానిస్తే బ్లాటింగ్ పేపర్, డెన్సిటీ పరీక్షలు చేయాలి. పరీక్షల్లో ఇన్వాయిస్ డెన్సిటీకి బంక్‌లోని పెట్రోల్ డెన్సిటీకి ఏమాత్రం వ్యత్యాసం వచ్చినా కల్తీ జరిగినట్టే. ఒకవేళ ట్యాంకర్ శాంపిల్స్ భద్రపర్చలేదంటే ఆ బంకుల్లో కల్తీ జరుగుతున్నట్లు అనుమానించవచ్చు. కంపెనీ ఆయిల్ సరఫరా చేసే సమయంలోనే పెట్రోల్, డీజిల్ సాంధ్రత ఎంతుండాలనేది ధృవీకరిస్తారు. ఇలా పెట్రోల్‌లో డెన్సిటీ నిర్థారించే హైడ్రోమీటర్లు థర్మామీటర్‌తో కూడిన కిట్లను బంక్ యజమానులు అందుబాటులో ఉంంచాలి. వాస్తవంగా పెట్రో, డీజిల్‌లో కల్తీ నిర్థారించే హైడ్రోమీటర్, థర్మామీటర్, జార్లతో కూడిన కిట్లు మెజార్టీ బంకుల్లో కనిపించవు. బంకుల్లో తనిఖీలు అంతంతే.. పెట్రోల్‌లో యథేచ్చగా కల్తీ జరుగుతోందని వినియోగదారులు గగ్గోలుపడుతున్నా పౌరసరఫరాల శాఖాధికారులు మాత్రం మొక్కుబడి తనిఖీలు, శాంపిల్స్ సేకరించి చేతులు దులుపుకుంటున్నారు. పౌరసరఫరాల శాఖ ఎప్పటికప్పుడు శాంపిళ్లను సేకరించి ల్యాబ్‌కు పంపి పరీక్షించాలి. అధికారులు వద్ద కూడా పరీక్షలు నిర్వహించేందుకు పరికరాలు ఉండాలి. అయితే, గ్రేటర్లో అధికారుల వద్ద అలాంటి పరికరాలు ఉండవు. పౌరసరఫరాల శాఖ తనిఖీలు చేసి రెడ్‌హిల్స్‌లోని ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్ పరీక్షకు పంపించిన శాంపిల్స్ సంఖ్య వేళ్లపై లెక్కపెట్టొచ్చు. సదరు సంస్థ కూడా కల్తీ నిర్థారణ జరిగినట్లు నివేదికలు పంపించిన దఖాలాలు కూడా ఉండడం లేదు. కల్తీపై కఠిన చర్యలు పెట్రోల్, డీజిల్ కల్తీ చేస్తే బంకులపై చర్యలు తప్పవు. కొన్ని బంకుల్లో ఇథనాల్ కారణంగా పెట్రోల్ నీరుగా మారుతుందని డీలర్లు చెబుతున్నారు. శాంపిల్స్ సైతం సేకరించి ల్యాబ్‌కు పంపిస్తున్నాం. కల్తీ బయటపడితే బంకులనే సీజ్ చేసి డీలర్లపై చర్యలు తీసుకుంటాం.– రాథోడ్, డీఎస్ఓ, రంగారెడ్డి జిల్లా -
మరిదితో వివాహేతర సంబంధం.. భర్త హత్య
చైతన్యపురి: వివాహేత సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను హత్య చేసిన కేసులో భార్యతో పాటు ఆమె ప్రియుడిని చైతన్యపురి పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. బుధవారం ఎల్బీనగర్ ఏసీసీ పృథ్వీదర్‌రావు, సీఐ సుదర్శన్ వివరాలు వెల్లడించారు. డిండి మండలం, దేవత్‌పల్లి తండాకు చెందిన బానోవత్ దులియా అలియాస్ శంకర్ (33) భార్య విజయ, ఇద్దరు పిల్లలతో కలిసి నగరానికి వలస వచ్చి చైతన్యపురి యదవనగర్లో ఉంటూ కూలీగా పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అయితే విజయ మరిది వరసయ్యే సపావత్ కిషన్‌తో గత కొన్నేళ్లుగా వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. దీనిని గుర్తించిన శంకర్ ఆమెను మందలించడంతో అతడి అడ్డు తొలగించుకునేందుకు ప్రియుడితో కలిసి పథకం పన్నింది. ఈ నేపథ్యంలో గత శనివారం రాత్రి మద్యం తాగిన శంకర్ నిద్రలో ఉండగా విజయ, కిషన్ అతని ముఖంపై దిండుతో అదిమి హత్య చేశారు. అనంతరం కరెంట్ షాక్‌తో చనిపోయినట్లు నమ్మించే ప్రయత్నం చేశారు. శంకర్ మరణంపై అనుమానం వ్యక్తం చేస్తూ అతని బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు పరారీలో ఉన్న నిందితులను బుధవారం అరెస్ట్ చేశారు. తామె హత్య చేసినట్లు అంగీకరించడంతోవారిని రిమాండ్‌కు తరలించినట్లు ఏసీపీ తెలిపారు. -
చైతన్యపురిలో దొంగల హల్చల్
చైతన్యపురి: చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగలు హల్చల్ చేశారు. అపార్టుమెంట్లో చోరీకి యత్నించగా, వారిని పట్టుకోబోయిన వాచ్‌మన్‌పై రాళ్లతో దాడిచేసి పరారయ్యారు. ఇన్స్పెక్టర్ సుదర్శన్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మోహన్‌నగర్‌లోని మల్లిక మెట్రో మనోహర్ అపార్ట్మెంటులో గురువారం రాత్రి నలుగురు అగంతకులు రెండో ఫ్లోర్‌లోని గన్‌శ్యాంకు చెందిన 203 ఫ్లాట్ తాళాలు పగుల గొట్టి లోపలికి జొరబడ్డారు. వారిలో ఒకరు వాచ్‌మన్ అనిల్‌కుమార్ ఇంటికి బయటి నుంచి గడియ పెట్టి అక్కడే కాపలాకాస్తున్నాడు. అలికిడి విన్న వాచ్‌మన్ బయటికి వచ్చేందుకు ప్రయత్నించగా బయట గడియపెట్టి ఉండటంతో కేకలు వేశాడు. దీంతో బయటికి వచ్చిన ఓ మహిళ అగంతకుడుని గుర్తించి కేకలు వేయటంతో పై అంతస్తునుంచి నలుగురు కిందకు దిగి వచ్చారు. వారిని పట్టుకునేందుకు ప్రయత్నించిన వాచ్‌మన్ అనిల్‌పై రాళ్లతో దాడి చేసి అక్కడి నుంచి పరారయ్యారు. వాచ్మెన్ పిర్యాదు మేరకు పోలీసులు సంఘటనా స్థలాన్ని సందర్శించారు. సీసీ కెమెరలు పరిశీలించగా ఐదుగురు వ్యక్తులు చోరీకి యత్నిచినట్లు గుర్తించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
అత్తింటి ఎదుట యువతి ఆందోళన
చైతన్యపురి: ప్రేమించి పెళ్లి చేసుకుని కొన్ని నెలలకే మొఖం చాటేసిన తన భర్తను తనకు అప్పగించాలని కోరుతూ ఓ యువతి అత్తింటి ఎదుట ఆందోళన చేపట్టిన సంఘటన చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు, బాధితురాలి కథనం మేరకు వివరాలిలా ఉన్నా యి. భరత్ అనే యువకుడు, బాధితురాలు రోజ సమీప బంధువులు. ప్రేమించుకున్న వారు 2016 లో కూకట్‌పల్లిలోని ఆర్యసమాజ్‌లో పెళ్లి చేసుకున్నారు. పెళ్లయిన కొన్నాళ్లకే భరత్ రోజాను వేధించటం మొదలు పెట్టాడు. మూడు నెలలుగా ఇం టికి రాకపోవడంతో బాధితురాలు గత నెల 19న సరూర్‌నగర్ మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అయితే భరత్ కొత్తపేట లక్ష్మీనగర్‌లో నివసించే భరత్ తల్లిదండ్రుల ఇంటికి వచ్చి వెళ్తున్నట్లు రోజాకు సమాచారం అందడంతో సోమవారం సాయంత్రం ఆమె తన కుటుంబ సభ్యులు, మహి ళా సంఘాల నాయకులతో కలిసి లక్ష్మీనగర్‌లోని అత్తింటి వద్ద ఆందోళనకు దిగింది. కోర్టులో కేసు ఉండగా న్యూసెన్స్ చేస్తున్నారని భరత్ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు రోజా ఆమె కుటుంబ సభ్యులను స్టేషన్‌కు తరలించారు. -
హెచ్చా... ఎఫ్ఫా?
చైతన్యపురి: చైతన్యపురి పోలీసుస్టేషన్ పరిధిలోని హరిపురికాలనీలో ఉన్న ఓ ఖరీదైన స్థలానికి సంబంధించి వివాదం రేగింది. సదరు స్థలం ఉన్న సర్వే నెంబర్ ‘హెచ్’ అంటూ ఒకరు... కాదు ‘ఎఫ్’ అంటూ మరొకరు వాదిస్తున్నారు. చివరకు కొందరు అక్కడ నిర్మాణాలు చేపడుతుండటంతో ఓ వ్యక్తి పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న చైతన్యపురి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే కేసు దర్యాప్తు సక్రమంగా సాగట్లేదంటూ ఫిర్యాదుదారుడు ఆరోపిస్తున్నాడు. నిర్మాణాలు ఆపమని జీహెచ్ఎంసీ అధికారులు ఆదేశించినా ఫలితం లేదని తెలిపాడు. పోలీసులు మాత్రం విషయాన్ని రెవెన్యూ విభాగానికి నివేదించామని, వారిచ్చే నివేదిక ఆధారంగా కేసులో తదుపరి చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు. గత నెల 21న నమోదైన ఈ కేసుకు సంబంధించిన వివరాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. పోలీసు రిజిస్టర్ చేసిన ప్రాథమిక సమాచార నివేదికలోని (ఎఫ్ఐఆర్) అంశాల ప్రకారం... వారాసిగూడ ప్రాంతానికి చెందిన వ్యాపారి వీపీ శ్రీనివాస్‌కు చైతన్యపురి పరిధిలోని హరిపురికాలనీలోని సర్వే నెం.9/1/హెచ్లో 15 ఎకరాల స్థలం ఉంది. దీనికి సంబంధించిన యూనిక్ బిల్డర్స్‌తో పాటు మరో రెండు కో–ఆపరేటివ్ సొసైటీలతో వీరికి వివాదం ఏర్పడింది. సదరు స్థలం సర్వే నెం.9/1/ఎఫ్‌కు సంబంధించినది అంటూ కొందరు ఆక్రమించుకోవాలని ప్రయత్నిస్తున్నరన్నది ఫిర్యాదుదారుడి ఆరోపణ. దీనికి సంబంధించి కోర్టులో వివాదం నడుస్తోంది. మరోపక్క ఈ వివాదం తేలకుండానే కొందరు తన (సర్వే నెం. ‘హెచ్’) స్థలంలోకి ప్రవేశించి అక్రమంగా బోర్ వేస్తున్నారంటూ గత నెల 21న చైతన్యపురి పోలీసులకు శ్రీనివాస్ ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు నిందితులపై ఐపీసీలోని 447, 427 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. తాముజీహెచ్ఎంసీకి సైతం ఫిర్యాదు చేశామని, ఈ నేపథ్యంలోనే సదరు నిర్మాణానికి ఇచ్చిన అనుమతిని వారు తాత్కాలిక రద్దు చేశారని ఫిర్యాదుదారుడు చెబుతున్నాడు. ఈ విషయం పోలీసులకు తెలిపినా వారి నుంచి సరైన స్పందన లేదని, కేసు దర్యాప్తు సైతం సక్రమంగా సాగట్లేదని ఆరోపిస్తున్నారు. దీనిపై చైతన్యపురి ఎస్సై సాయి ప్రకాష్‌ను వివరణ కోరగా... ‘ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టాం. ఈ స్థలం ఎవరికి చెందిందని అనే విషయం తేల్చాల్సిందిగా రెవెన్యూ అధికారులను కోరాం. వారిచ్చిన నివేదిక ప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటాం’ అన్నారు. -
బ్యూటీ పార్లర్ ముసుగులో మసాజ్ సెంటర్
హైదరాబాద్(చైతన్యపురి): బ్యూటీ పార్లర్ ముసుగులో క్రాస్ మసాజ్ నిర్వహిస్తున్న సెంటర్‌పై ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసులు దాడులు నిర్వహించి నిర్వాహకురాలు, ఇద్దరు యువతులను, ముగ్గురు కస్టమర్లను అరెస్టు చేశారు. వారి నుంచి రూ. 8 వేల నగదు, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకుని చైతన్యపురి పోలీసులకు అప్పగించారు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కర్మన్‌ఘట్‌కు చెందిన ప్రతిజ (28) మోహన్‌నగర్ చౌరస్తాలో స్పార్కిల్ బ్యూటీ సెలూన్‌ను నిర్వహిస్తుంది. కొంత కాలంగా అమ్మాయిలతో క్రాస్ మసాజ్ చేయిస్తున్నట్లు సమాచారం అందుకున్న ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా గోల్కొండకు చెందిన యువతి, సంతోష్‌నగర్‌కు చెందిన మహిళ, ఉప్పుగూడకు చెందిన మల్లేష్, కర్మన్‌ఘట్‌కు చెందిన దుర్గారావులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ. 8,720 నగదు, తొమ్మిది సెల్ఫోన్లను స్వాధీనం చేసుకుని చైతన్యపురి పోలీసు స్టేషన్లో అప్పజెప్పారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
మోసం చేసిన డబ్బులు ఇవ్వలేక హత్య
చైతన్యపురి: డబ్బుల విషయంలో చోటుచేసుకున్న వివాదం యువకుడి హత్యకు దారితీసిన సంఘటన చైతన్యపురి పోలీస్‌స్టేన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... వరంగల్ జిల్లా పరిగెలపల్లి గ్రామానికి చెందిన శ్రీమిత్ర (21) బీ.టెక్ పూర్తి చేశాడు. ఏస్ ఇనిస్టిట్యూట్‌లో తన అక్క కూతుళ్లకు సీటు కోసం తన స్నేహితుడు పవన్ ద్వారా పరిచయమైన నల్లగొండ జిల్లాకు చెందిన సందీప్‌రెడ్డికి పదిరోజుల క్రితం రూ.50వేలు ఇచ్చాడు. అలాగే అశోక్‌నగర్‌కు చెందిన రాకేష్ కూడా తన స్నేహితుడికి కోసం సందీప్‌రెడ్డికి రూ.50 వేలు ఇచ్చాడు. ఇందుకుగాను సందీప్‌రెడ్డి ఏస్ ఇనిస్టిట్యూట్ గుర్తింపుకార్డు, రశీదులను ఇచ్చాడు. ఇనిస్టిట్యూట్‌కు వెళ్లిన విద్యార్థులకు అవి నకిలీవని తేలడంతో సందీప్‌రెడ్డిని నిలదీయగా, తాను మధు అనే బ్రోకర్ ద్వారా డబ్బులు కట్టానని అతడు ఇచ్చిన గుర్తింపుకార్డులే ఇచ్చినట్లు తెలిపాడు. దీంతో శ్రీమిత్ర, అశోక్‌రెడ్డి డబ్బులు తిరిగి ఇవ్వాలని సందీప్‌రెడ్డిపై ఒత్తిడి చేశారు. దీంతో రాకేష్ న్యూ నాగోల్‌లోని ఉమేష్, అశోక్ గదికి వస్తే సందీప్‌రెడ్డిని పిలిచి డబ్బు వసూలు చేసుకుందామని శ్రీమిత్రకు సమాచారం ఇవ్వగా రాకేష్‌తో కలిసి ఉమేష్ ఇంటికి వచ్చారు. ఈ సందర్భంగా సందీప్‌రెడ్డితో వారి మధ్య గొడవ జరిగిం. అనంతరం ఏటీఎంలో డబ్బులు డ్రా చేసుకుని వస్తానని పవన్ ను వెంట తీసుకెళ్లిన సందీప్‌రెడ్డి అరగంట తరువాత తిరిగి వచ్చాడు. శ్రీమిత్ర డబ్బుల విషయం అడగ్గా మరోసారి గొడవ జరిగింది. దీంతో ఆవేశానికిలోనైన సందీప్‌రెడ్డి తన వెంట తెచ్చుకున్న చాకుతో శ్రీమిత్ర మెడపై దాడి చేశాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో శ్రీమిత్ర సమీపంలోని మెడికల్ షాప్‌కు వెళ్లి డ్రెస్సింగ్ కాటన్ తీసుకుని గాయానికి అడ్డు పెట్టుకున్నాడు. సందీప్‌రెడ్డి అక్కడి నుంచి పారిపోగా రాకేష్, పవన్ శ్రీమిత్రను సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా, వైద్యుల సూచన మేరకు మొదట ఓమ్నీ ఆస్పత్రి, తరువాత మలక్‌పేట యశోద, సికింద్రాబాద్ యశోదకు తీసుకెళ్లినా డాక్టర్లు ఫలితం లేదని చెప్పడంతో నిమ్స్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలోనే శ్రీమిత్ర ప్రాణాలు వదిలాడు. ఓమ్నీ ఆసుపత్రి సిబ్బంది సమాచారం మేరకు చైతన్యపురి పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి వివరాలు సేకరించారు. శ్రీమిత్ర మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించి కేసు నమోదు చేశారు. నిందితుడు సందీప్‌రెడ్డి కోసం గాలిస్తున్నారు. కాగా సందీప్‌రెడ్డి ట్వంటీ ఫస్ట్ సెంచరీ ఇన్స్టిట్యూట్లో గ్రూపు పరీక్షలకు శిక్షణ తీసుకుంటున్నట్లు తెలిసింది. -
జడ వేయలేదని విద్యార్థిని ఆత్మహత్య
చైతన్యపురి: తల్లి జడ వేయలేదని మనస్తాపంతో ఓ ఇంటర్ విద్యార్థిని ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన సరూర్‌నగర్ పోలీస్‌స్టేన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ వెంకటకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.... కర్మన్ ఘాట్ క్రాంతినగర్‌కు చెందిన రాములు స్థానికంగా హోటల్ నిర్వహిస్తున్నాడు. అతని కూతురు భాగ్యలక్ష్మీ (17) శ్రీసాయి కళాశాలలో ఇంటర్ చదువుతోంది. మంగళవారం ఆమె తన తల్లి విజయలక్ష్మిని జడవేయమని కోరగా వేరే పని ఉన్నందున వేయలేదు. దీంతో అలిగిన భాగ్యలక్ష్మి కాలేజీకి వెళ్లకుండా భాగ్యలక్ష్మి ఇంట్లోనే ఉంది. తండ్రి హోటల్‌కు వెళ్లగా తల్లి, సోదరుడు జిల్లెలగూడలోని బంధువుల ఇంటికి వెళ్లడంతో తలుపు గడియ వేసుకుని కిటికీ గ్రిల్స్‌కు చున్నీతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఇంటికి తిరిగి వచ్చి తల్లి తలుపుకొట్టినా తీయకపోవడంతో స్థానికుల సహాయంతో గడియ విరగొట్టి లోపలికి వెళ్లి చూడగా భాగ్యలక్ష్మి ఉరి వేసుకుని చనిపోయి కనిపించింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
యజమానులు ఇంట్లో ఉండగానే చోరీ
చైతన్యపురి: ఇంట్లో వారు నిద్రలో ఉండగా వెనుక తలుపు నుంచి చొరబడ్డ దొంగలు బీరువాలోని నగదు, నగలు ఎత్తుకెళ్లారు. చైతన్యపురి సీఐ గురురాఘవేంద్ర ప్రకారం... మారుతీనగర్ రోడ్ నెం–5లో నివాసముండే అరుణ్‌కుమార్ మెడికల్ షాపు నిర్వహిస్తున్నాడు. శనివారం రాత్రి అరుణ్‌కుమార్ కుటుంబసభ్యులంతా ఇంట్లో నిద్రిస్తుండగా వెనుక కిటికీ ద్వారా డోర్ తెరిచిన దొంగలు బీరువాలోని రూ.1.8 లక్షల నగదు, 9 తులాల బంగారు ఆభరణాలు చోరీ చేసుకెళ్లారు. ఉదయం నిద్ర లేచిన అరుణ్‌కుమార్ చోరీ జరిగినట్టు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. క్లూస్‌టీంతో ఆధారాలు సేకరించి కేసు దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ తెలిపారు. మరో రెండు ఘటనలు... బంజారాహిల్స్: నిద్రిస్తున్న సమయంలో ఇంట్లో దొంగలు పడి సెల్ఫోన్లతో పాటు నగదు ఎత్తుకెళ్లిన రెండు ఘటనలు బంజారాహిల్స్ ఠాణా పరిధిలో జరిగాయి. పోలీసుల కథనం ప్రకారం.. బంజారాహిల్స్ రోడ్ నెం.2 ఇందిరానగర్‌లోని నల్లపోచమ్మ గుడి సమీపంలో యుగేంధర్ తన స్నేహితులతో కలిసి నివాసం ఉంటున్నాడు. శనివారం రాత్రి నిద్రించిన యుగేంధర్ ఆదివారం ఉదయం నిద్రలేచి చూసేసరికి అతని ఐఫోన్, స్నేహితుడి సామ్సంగ్ గాలక్సీ ఫోన్ అదృశ్యమయ్యాయి. ఇదే విధంగా రోడ్ నెం.14లో మరో ఘటన జరిగింది. శ్రీకాంత్‌రెడ్డి అనే సిస్టం ఇంజినీర్ రాత్రి నిద్రపోయి ఉదయం లేచి చూసేసరికి అతని గదిలో ఉండాల్సిన మోటో జీ, సెల్కాన్, సామ్సంగ్ ఫోన్లతో పాటు డ్రైవింగ్ లైసెన్స్, ఎస్బీఐ ఏటీఎం కార్డులతో కూడిన పర్సు పోయింది. బాధితుల ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ క్రైం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.