హతుడు శ్రీమిత్ర(ఫైల్) ,నిందితుడు సందీప్‌రెడ్డి
చైతన్యపురి: డబ్బుల విషయంలో చోటుచేసుకున్న వివాదం యువకుడి హత్యకు దారితీసిన సంఘటన చైతన్యపురి పోలీస్‌స్టేన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... వరంగల్ జిల్లా పరిగెలపల్లి గ్రామానికి చెందిన శ్రీమిత్ర (21) బీ.టెక్ పూర్తి చేశాడు. ఏస్ ఇనిస్టిట్యూట్‌లో తన అక్క కూతుళ్లకు సీటు కోసం తన స్నేహితుడు పవన్ ద్వారా పరిచయమైన నల్లగొండ జిల్లాకు చెందిన సందీప్‌రెడ్డికి పదిరోజుల క్రితం రూ.50వేలు ఇచ్చాడు.
అలాగే అశోక్‌నగర్‌కు చెందిన రాకేష్ కూడా తన స్నేహితుడికి కోసం సందీప్‌రెడ్డికి రూ.50 వేలు ఇచ్చాడు. ఇందుకుగాను సందీప్‌రెడ్డి ఏస్ ఇనిస్టిట్యూట్ గుర్తింపుకార్డు, రశీదులను ఇచ్చాడు. ఇనిస్టిట్యూట్‌కు వెళ్లిన విద్యార్థులకు అవి నకిలీవని తేలడంతో సందీప్‌రెడ్డిని నిలదీయగా, తాను మధు అనే బ్రోకర్ ద్వారా డబ్బులు కట్టానని అతడు ఇచ్చిన గుర్తింపుకార్డులే ఇచ్చినట్లు తెలిపాడు. దీంతో శ్రీమిత్ర, అశోక్‌రెడ్డి డబ్బులు తిరిగి ఇవ్వాలని సందీప్‌రెడ్డిపై ఒత్తిడి చేశారు.
దీంతో రాకేష్ న్యూ నాగోల్‌లోని ఉమేష్, అశోక్ గదికి వస్తే సందీప్‌రెడ్డిని పిలిచి డబ్బు వసూలు చేసుకుందామని శ్రీమిత్రకు సమాచారం ఇవ్వగా రాకేష్‌తో కలిసి ఉమేష్ ఇంటికి వచ్చారు. ఈ సందర్భంగా సందీప్‌రెడ్డితో వారి మధ్య గొడవ జరిగిం. అనంతరం ఏటీఎంలో డబ్బులు డ్రా చేసుకుని వస్తానని పవన్ ను వెంట తీసుకెళ్లిన సందీప్‌రెడ్డి అరగంట తరువాత తిరిగి వచ్చాడు. శ్రీమిత్ర డబ్బుల విషయం అడగ్గా మరోసారి గొడవ జరిగింది. దీంతో ఆవేశానికిలోనైన సందీప్‌రెడ్డి తన వెంట తెచ్చుకున్న చాకుతో శ్రీమిత్ర మెడపై దాడి చేశాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో శ్రీమిత్ర సమీపంలోని మెడికల్ షాప్‌కు వెళ్లి డ్రెస్సింగ్ కాటన్ తీసుకుని గాయానికి అడ్డు పెట్టుకున్నాడు.
సందీప్‌రెడ్డి అక్కడి నుంచి పారిపోగా రాకేష్, పవన్ శ్రీమిత్రను సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా, వైద్యుల సూచన మేరకు మొదట ఓమ్నీ ఆస్పత్రి, తరువాత మలక్‌పేట యశోద, సికింద్రాబాద్ యశోదకు తీసుకెళ్లినా డాక్టర్లు ఫలితం లేదని చెప్పడంతో నిమ్స్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలోనే శ్రీమిత్ర ప్రాణాలు వదిలాడు. ఓమ్నీ ఆసుపత్రి సిబ్బంది సమాచారం మేరకు చైతన్యపురి పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి వివరాలు సేకరించారు. శ్రీమిత్ర మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించి కేసు నమోదు చేశారు. నిందితుడు సందీప్‌రెడ్డి కోసం గాలిస్తున్నారు. కాగా సందీప్‌రెడ్డి ట్వంటీ ఫస్ట్ సెంచరీ ఇన్స్టిట్యూట్‌లో గ్రూపు పరీక్షలకు శిక్షణ తీసుకుంటున్నట్లు తెలిసింది.