పోలవరం ఎప్పటికి..
పోలవరం ఎప్పటికి..
Published Sun, Oct 9 2016 11:40 PM | Last Updated on Mon, Sep 4 2017 4:48 PM
రెండేళ్లలో సాధ్యమేనా!
పూర్తిగా నిలిచిన పనులు
తరచూ ఇదే దుస్థితి
‘రెండేళ్లలో పోలవరం ప్రాజెక్టు పూర్తిచేస్తాం’ అంటూ జిల్లాకు వచ్చిన ప్రతిసారీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, నీటిపారుదలశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రకటిస్తూనే ఉన్నారు. ఆ మాటలు వట్టిదేనని పనుల పురోగతిని చూస్తే స్పష్టమవుతోంది. పనులు నత్తనడకన సాగడం, తరచూ నిలిచిపోవడం వల్ల ప్రాజెక్టు పూర్తిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
పోలవరం :
‘అక్టోబర్ నెలకల్లా స్పిల్‌వే ప్రాంతంలో కాంక్రీట్ పనులను ప్రారంభించేందుకు వీలుగా ఎర్త్‌వర్క్ పనులు పూర్తిచేయాలి. సోమవారాన్ని పోలవరంగా మారుస్తున్నా.. ప్రతివారం సమీక్షిస్తా అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటీవల జిల్లాకు వచ్చిన సందర్భంగా చెప్పారు. అయితే ఆయన చెప్పినంత వేగంగా పనులు సాగడం లేదు. తరచూ నిలిచిపోతున్నాయి. శనివారం నుంచి పూర్తిగా నిలిచిపోయాయి. అయినా ఇప్పటివరకూ ముఖ్యమంత్రి స్పందించలేదు. సోమవారంమైనా స్పందిస్తారో లేదో చూడాలి.
బకాయిలు, జీతాలు చెల్లించకపోవడం వల్లే
పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టు దక్కించుకున్న ట్రాన్స్‌ట్రాయ్ కంపెనీ ఇప్పటివరకూ స్పిల్ చానల్ పనులను చేస్తూ.. స్పిల్‌వే ఎర్త్‌వర్క్ పనులను త్రివేణి సంస్థకు సబ్‌కాంట్రాక్టుగా అప్పగించింది. ఆ సంస్థకు ట్రాన్స్‌ట్రాయ్ సుమారు రూ.70 కోట్ల మేర చెల్లించాల్సి ఉండడంతో త్రివేణి సంస్థ పనులు నిలిపివేసినట్టు తెలుస్తోంది. రెండు రోజుల కిందటే ట్రాన్స్‌ట్రాయ్ కంపెనీలో పనిచేస్తున్న సమారు 200మంది కార్మికులు జీతాలు చెల్లించటం లేదంటూ విధులు బహిష్కరించారు. కార్మికులకు మూడు నెలల జీతాలు చెల్లించాల్సి ఉన్నట్టు సమాచారం. దీంతో ట్రాన్స్‌ట్రాయ్ చేస్తున్న పనులూ నిలిచాయి. ఇప్పటివరకూ రోజుకు దాదాపు 50 వేల క్యూబిక్‌మీటర్ల ఎర్త్‌వర్క్ పనులను త్రివేణి సంస్థ చేసేది. ట్రాన్స్‌ట్రాయ్ సంస్థ కేవలం 15వేల నుండి 20 వేల క్యూబిక్‌మీటర్ల పనులు మాత్రమే చేసేది. ఇప్పుడు ఈ పనులను కూడా త్రివేణి సంస్థకు అప్పగించి, కేవలం మట్టి తవ్వకానికి సంబంధించిన అప్రోచ్ చానల్ పనులకే ట్రాన్స్‌ట్రాయ్ పరిమితమైంది. పనుల నిలిపివేతపై త్రివేణి సంస్థ ప్రతినిధిని అడగ్గా.. డీజిల్ కొరత వల్ల పనులు ఆగిపోయాయని చెప్పారు.
నిర్మానుష్యంగా నిర్మాణ ప్రాంతం
పనుల నిలిపివేతతో రెండురోజులుగా పోలవరం నిర్మాణ ప్రాంతం నిర్మానుష్యంగా మారింది. ఎప్పుడూ హడావుడిగా, యంత్రాల శబ్దాలు, వందలాది మంది కార్మికులతో కళకళలాడే ఈ ప్రాంతం ఒక్కసారిగా నిర్మానుష్యంగా మారింది. ఇటీవల కాలంలో మొత్తం పనులు నిలిచిపోవటం ఇదే తొలిసారి. ఒక చోట పనులు నిలిచిపోయినా మరోచోట జరిగేవి. ప్రతిసోమవారం ప్రాజెక్టు నిర్మాణపై సమీక్షిస్తానని చెప్పిన ముఖ్యమంత్రి పనుల నిలిపివేతపై స్పందిస్తారో లేదో వేచిచూడాలి.
Advertisement
Advertisement