‘అభయ’మేది? | where is ABHAYAM | Sakshi
Sakshi News home page

‘అభయ’మేది?

Published Fri, Sep 30 2016 8:50 PM | Last Updated on Mon, Sep 4 2017 3:39 PM

‘అభయ’మేది?

‘అభయ’మేది?

  • 19,823 మంది లబ్ధిదారుల నిరీక్షణ
  • జిల్లాలో రూ.89.19 కోట్ల బకాయిలు
  • పథకం అమలుపై అనుమానాలు 
  • ముకరంపుర : సర్కారు ‘ఆసరా’ అందుకుందామని అభయహస్తాన్ని కాదనుకున్నవారు రెంటికీ చెడి మలిసంధ్యలో అవస్థలు పడుతున్నారు. తొమ్మిది నెలలుగా పింఛన్‌ అందక బారంగా బతుకు సాగిస్తున్నారు. వృద్ధాప్యంలో తీవ్ర మనోవేదన అనుభవిస్తున్న వారి సమస్యను ప్రభుత్వం పట్టించుకోకపోవడం ఆందోళన కలిగిస్తోంది. 
    గత ప్రభుత్వంలో జిల్లాలో 41,660 మంది అభయహస్తం పింఛన్‌ పొందేవారు. 2009లో ప్రారంభమైన ఈ పథకం కింద 60 ఏళ్లు నిండిన లబ్ధిదారులకు నెలనెలా రూ.500 పింఛన్‌ వచ్చేంది. గ్రామాల్లోని స్వయం సహాయక సంఘాల మహిళలు ఏడాదికి రూ.365 చెల్లిస్తే అంతే మొత్తంలో ప్రభుత్వం జమ చేసేది. 60 ఏళ్లు దాటిన తర్వాత వారికి జీవితాంతం నెలనెలా పింఛన్‌ వచ్చేది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్‌ సర్కారు ఆసరా పథకం ప్రవేశపెట్టింది. ఈ పథకంలో రూ.వెయ్యి పింఛన్‌ వస్తుండడంతో చాలామంది ఆశగా దానికోసం దరఖాస్తు చేసుకున్నారు. వారిలో వృద్ధులు, వితంతువులే ఎక్కువ మంది ఉన్నారు. అభయహస్తం పింఛన్‌ పొందే 41,660 మంది లబ్ధిదారుల్లో 20,672 మందిని అధికారులు ఆసరాకు మళ్లించారు. కొంతమంది చనిపోగా మిగిలిన 19,823 మంది అభయహస్తం పింఛన్‌దారులుగానే ఉన్నారు. ‘ఆసరా’కు మళ్లించిన వారి డాటా బేస్‌ కూడా పూర్తి చేశారు. ఆధార్‌ అనుసంధానం, పరిశీలనల పేరిట అధికారులు వారిలో 70 శాతానికిపైగా తిరస్కరించారు. దాదాపు 15 వేల మంది అటు అభయహస్తానికీ, ఇటు ఆసరా పింఛన్‌కు నోచుకోలేదు. తొమ్మిది నెలలుగా వారు దీన స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. జనవరి నుంచి జిల్లాలో రూ.89.19 కోట్ల బకాయిలున్నాయి.  
    అభయహస్తం ఉండేనా? 
    సంకటస్థితిలో పడిపోయిన లబ్ధిదారుల డాటా కూడా పూర్తిగా పోవడంతో అధికారులు గత ప్రభుత్వంలోని అభయస్తం లబ్ధిదారుల డాటా మరోసారి పరిశీలించారు. వారిలోనుంచి కేవలం 1,690 మందిని అభయహస్తం పింఛన్‌దారులుగా గుర్తించారు. వారికి కూడా మార్చి వరకు ఆరు నెలల పింఛన్‌ ఇచ్చేందుకు కలెక్టర్‌ ఆమోదించారు. అయితే ప్రభుత్వం విడుదల చేసిన నిధులు కూడా ఆగిపోయాయి. ఇప్పటి వరకు 19,823 మంది అభయహస్తం పింఛన్‌దారులే మిగిలారు. దాచుకున్న సొమ్మును కూడా పింఛన్‌గా పొందలేక అవస్థలు పడుతున్నారు. మరో వైపు అభయహస్తం పథకం మనుగడపైనా సందేహాలు తలెత్తుతున్నాయి. పథకం ఎత్తేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో అసెంబ్లీలో ప్రత్యేక చట్టం ద్వారా తీసుకొచ్చిన ఈ పథకంపై సర్కారు పూర్తిస్థాయిలో నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఏదేమైనా తమకు పింఛన్‌ అందించి ఆదుకోవాలని లబ్ధిదారులు కోరుతున్నారు. 
     
     

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement