గ్రామ పంచాయతీ కార్యాలయం
- పదినెలలుగా అందని వేతనాలు
- నిధుల విడుదలలో సర్కారు జాప్యం
పెగడపల్లి : ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరాలన్నా.. గ్రామాలు అభివృద్ధి చెందాలన్నా సర్పంచులదే కీలకపాత్ర. గ్రామప్రజలకు సేవ చేస్తున్నందుకుగాను గతంలో సర్పంచులకు నెలనెలా రూ.1500లను ‘గౌరవవేతనం’ కింద అందేవి. టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకొచ్చాక.. ఆ మెుత్తాన్ని రూ.ఐదు వేలకు పెంచింది. కానీ.. ఆ వేతనాలను మాత్రం నెలనెలా విడుదల చేయడంలో నిర్లక్ష్యం చూపుతోంది. ఫలితంగా సర్పంచులు నిరాశకు గురవుతున్నారు. పెంచిన గౌరవ వేతనాన్ని సర్కారు 2015 సెప్టెంబర్ వరకు మాత్రమే అందించింది. అప్పటి నుంచి జూలై 2016 వరకు (10 నెలల) వేతనాలు అందాల్సి ఉంది. పంచాయతీల ప్రథమపౌరులమైన తమపట్ల సర్కారు చిన్నచూపు చూస్తోందని సర్పంచులు ఆవేదన చెందుతున్నారు. గౌరవవేతనాలు సకాలంలో చెల్లించకుండా అగౌరవ పరుస్తోందని పేర్కొంటున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాలను ప్రజల్లోకి తీసికెళ్లి గ్రామాలను అభివృద్ధి పథంలో నడిపించేందుకు కృషి చేస్తున్నా వేతనాలు ఇవ్వకుండా నిరాశ పరుస్తోందంటున్నారు.