నచ్చిన చోటే కోచింగ్
వికలాంగ అభ్యర్థులకు సర్కారు తాయిలం
ప్రతిభ ఆధారంగా 500 మందికి అవకాశం
రేపోమాపో నోటిఫికేషన్ జారీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు హాజరుకానున్న వికలాంగ అభ్యర్థులకు ప్రోత్సాహాన్ని అందించాలని సర్కారు భావిస్తోంది. సాధారణ అభ్యర్థుల మాదిరిగానే వికలాంగ అభ్యర్థులకు కూడా పేరుగాంచిన శిక్షణా సంస్థల్లో కోచింగ్ ఇప్పించనుంది. వాస్తవానికి వికలాంగుల సంక్షేమ శాఖ పరిధిలో స్టడీ సర్కిల్ ఉన్నా, అందులో సరైన సదుపాయాలు, శిక్షణ ఇచ్చేందుకు నిపుణులు లేరు. దీంతో అభ్యర్థులు కోరుకున్న శిక్షణ సంస్థల్లోనే కోచింగ్ ఇప్పించేందుకు సర్కారు మొగ్గుచూపింది. ఒక్కో అభ్యర్థికి గరిష్టంగా రూ.20 వేల వరకు ఖర్చు కానుందని వికలాంగుల సంక్షేమ శాఖ అధికారులు అంచనా వేశారు. అన్ని రకాల పోటీ పరీక్షలకు శిక్షణ పొందేందు కు రాష్ట్రవ్యాప్తంగా 500 మంది ప్రతిభావంతులైన వికలాంగులను ఎంపిక చేస్తారు. ఇందుకు తెలంగాణ వికలాంగుల సహకార సంస్థ నుంచి రూ.కోటి వరకు నిధులు సమకూర్చాలని ఆ శాఖ నిర్ణయించింది. అభ్యర్థుల ఎంపికకు వీలైనంత త్వరగా నోటిఫికేషన్ విడుదల చేసేందు కు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
ప్రతిభ ఆధారంగానే ఎంపిక
పేరుగాంచిన కోచింగ్ కేంద్రాల్లో శిక్షణ ఇప్పిం చేందుకు ప్రతిభ ఆధారంగానే వికలాంగ అభ్యర్థులను ఎంపిక చేయాలని సర్కారు నిర్ణయిం చింది. ఈ మేరకు వికలాంగుల సంక్షేమ విభాగం డెరైక్టర్ అధ్యక్షతన ఎంపిక కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీలో స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఉప కార్యదర్శి, వికలాంగుల సహకార సంస్థ జాయింట్ మేనేజింగ్ డెరైక్టర్ సభ్యులుగా ఉంటారు. అభ్యర్థులు పదో తరగతి, ఇంటర్, డిగ్రీలో పొందిన మార్కులతో పాటు వారి వైకల్య శాతం, వార్షిక ఆదాయ పరిమితులను పరిగణలోకి తీసుకుంటారు. ఎంపికైన అభ్యర్థి నచ్చిన కోచింగ్ సెంటర్ ఎంచుకోవచ్చు. మూడు నెలల శిక్షణ నిమిత్తం గరిష్టంగా రూ.15 వేలు, స్టడీ మెటీరియల్, రవాణా సౌకర్యానికి మరో రూ.2 వేలు కోచింగ్ సెంటర్‌కు ప్రభుత్వం చెల్లిస్తుంది.