Disabled Welfare department
-
నచ్చిన చోటే కోచింగ్
వికలాంగ అభ్యర్థులకు సర్కారు తాయిలం ప్రతిభ ఆధారంగా 500 మందికి అవకాశం రేపోమాపో నోటిఫికేషన్ జారీ సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు హాజరుకానున్న వికలాంగ అభ్యర్థులకు ప్రోత్సాహాన్ని అందించాలని సర్కారు భావిస్తోంది. సాధారణ అభ్యర్థుల మాదిరిగానే వికలాంగ అభ్యర్థులకు కూడా పేరుగాంచిన శిక్షణా సంస్థల్లో కోచింగ్ ఇప్పించనుంది. వాస్తవానికి వికలాంగుల సంక్షేమ శాఖ పరిధిలో స్టడీ సర్కిల్ ఉన్నా, అందులో సరైన సదుపాయాలు, శిక్షణ ఇచ్చేందుకు నిపుణులు లేరు. దీంతో అభ్యర్థులు కోరుకున్న శిక్షణ సంస్థల్లోనే కోచింగ్ ఇప్పించేందుకు సర్కారు మొగ్గుచూపింది. ఒక్కో అభ్యర్థికి గరిష్టంగా రూ.20 వేల వరకు ఖర్చు కానుందని వికలాంగుల సంక్షేమ శాఖ అధికారులు అంచనా వేశారు. అన్ని రకాల పోటీ పరీక్షలకు శిక్షణ పొందేందు కు రాష్ట్రవ్యాప్తంగా 500 మంది ప్రతిభావంతులైన వికలాంగులను ఎంపిక చేస్తారు. ఇందుకు తెలంగాణ వికలాంగుల సహకార సంస్థ నుంచి రూ.కోటి వరకు నిధులు సమకూర్చాలని ఆ శాఖ నిర్ణయించింది. అభ్యర్థుల ఎంపికకు వీలైనంత త్వరగా నోటిఫికేషన్ విడుదల చేసేందు కు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ప్రతిభ ఆధారంగానే ఎంపిక పేరుగాంచిన కోచింగ్ కేంద్రాల్లో శిక్షణ ఇప్పిం చేందుకు ప్రతిభ ఆధారంగానే వికలాంగ అభ్యర్థులను ఎంపిక చేయాలని సర్కారు నిర్ణయిం చింది. ఈ మేరకు వికలాంగుల సంక్షేమ విభాగం డెరైక్టర్ అధ్యక్షతన ఎంపిక కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీలో స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఉప కార్యదర్శి, వికలాంగుల సహకార సంస్థ జాయింట్ మేనేజింగ్ డెరైక్టర్ సభ్యులుగా ఉంటారు. అభ్యర్థులు పదో తరగతి, ఇంటర్, డిగ్రీలో పొందిన మార్కులతో పాటు వారి వైకల్య శాతం, వార్షిక ఆదాయ పరిమితులను పరిగణలోకి తీసుకుంటారు. ఎంపికైన అభ్యర్థి నచ్చిన కోచింగ్ సెంటర్ ఎంచుకోవచ్చు. మూడు నెలల శిక్షణ నిమిత్తం గరిష్టంగా రూ.15 వేలు, స్టడీ మెటీరియల్, రవాణా సౌకర్యానికి మరో రూ.2 వేలు కోచింగ్ సెంటర్‌కు ప్రభుత్వం చెల్లిస్తుంది. -
అన్ని కాలేజీలకు ఆర్టీఎఫ్ను వెంటనే చె ల్లించాలి
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, వికలాంగుల సంక్షేమ శాఖలకు సర్కార్ ఆదేశం హైదరాబాద్: ఫీజు రీయింబర్స్మెంట్ పథకంలో భాగంగా అన్ని కాలేజీలకు రీయింబర్స్మెంట్ ఆఫ్ ట్యూషన్‌ఫీజు (ఆర్టీఎఫ్)ను వెంటనే చెల్లించాలని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, వికలాంగుల సంక్షేమ శాఖలను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో స్థానికత సమస్య ఎక్కువగా వస్తున్నందున.. రాష్ట్ర విభజనచట్టం ప్రకారం తెలంగాణలో పదేళ్లపాటు రాష్ట్రపతి ఉత్తర్వులు అమల్లో ఉంటాయని, దీని ప్రకారం స్థానికతకు సంబంధించిన ఉత్తర్వుల ప్రకారం విద్యార్థుల స్థానికతను గుర్తించాలని ఎస్సీ అభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి జె.రేమండ్‌పీటర్ సూచించారు. స్కాలర్‌షిప్‌ల కింద బడ్జెట్ విడుదల చేసినందున, వెంటనే అన్నిశాఖలు అన్ని కాలేజీల ఆర్టీఎఫ్ బకాయిలను చెల్లించాలని ఆదేశించారు. ఇంతకు ముందు విద్యార్థులకు మెయింటినెన్స్ ఫీజు (ఎంటీఎఫ్) చెల్లించాలి.. ఆర్టీఎఫ్ బకాయిలు చెల్లించాల్సిందిగా సూచించామని, ఇప్పుడు ఎంటీఎఫ్తో సంబంధం లేకుండా అన్ని కాలేజీలకు ఆర్టీఎఫ్ బకాయిలను చెల్లించాలన్నారు. మంగళవారం రంగారెడ్డి కలెక్టరేట్ నుంచి జిల్లాల్లోని వివిధ సంక్షేమశాఖ జాయింట్ డెరైక్టర్లు, డీడీలు, సహాయ సంక్షేమ, అసిస్టెంట్ అకౌంట్స్, సీజీజీ అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లింపులు, అంబేడ్కర్ ఓవర్సీస్ పథకం, స్కాలర్షిప్స్, హాస్టళ్ల తీరుపై సమీక్షించారు. ఆర్టీఎఫ్, ఎంటీఎఫ్ బకాయిలను చెల్లించిన తర్వాతే తదుపరి కేటాయింపులు ఆర్థికశాఖ నుంచి వస్తాయని చెప్పారు. ప్రభుత్వ ఇంటర్, డిగ్రీ కాలేజీలు, యూనివర్సిటీ డిగ్రీ కాలేజీలకు బయోమెట్రిక్ అథెంటికేషన్ అవసరం లేదని, ప్రైవేట్ కాలేజీలు ఆధార్‌తో పరిశీలించాలని సూచించారు. ఫీజు రీయింబర్స్మెంట్ పొందే అర్హత ఉందా లేదా అన్న విషయాన్ని జిల్లా అధికారులు ముందుగానే విద్యార్థులకు తెలియజేయాలని సూచించారు. జిల్లాల్లోని సంక్షేమశాఖల అధికారులంతా ఒక యూనిట్‌గా ఏర్పడి విద్యార్థుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. పోస్ట్‌మెట్రిక్ స్కాలర్షిప్లో డిపార్ట్మెంట్ అటాచ్డ్ హాస్టళ్లలో ఈ-పాస్‌లో విద్యార్థులు రిజిష్టర్ చేసుకోవాలని సూచించారు. ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులతో తండాల అభివృద్ధికి ప్రభుత్వం నిర్ణయించిందని, తండాల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలన్నారు. రుణాల మంజూరులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు గత ఏడాది ఎంపిక చేసిన యూనిట్ల గ్రౌండింగ్ చేయాలని, ఈ రుణాలను ఈ నెలాఖరు వరకు మంజూరు చేయాలని చెప్పారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీస్ కేసుల్లో పరిహారాలు, హక్కులకు సంబంధించి ఫ్లెక్సీలు, బోర్డుల ద్వారా వివరాలను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలన్నారు. ఎస్సీ, ఎస్టీల దాడులు, అత్యాచారాలు జరిగిన వారం రోజుల్లోగా పరిహారం ఇవ్వాలని సూచించారు. ఈ సమావేశంలో బీసీశాఖ ముఖ్యకార్యదర్శి టి.రాధ, ఎస్టీ సంక్షేమశాఖ కమిషనర్ బి.మహేశ్‌దత్ ఎక్కా, మైనారిటీ సంక్షేమ శాఖ కమిషనర్ తదితరులు పాల్గొన్నారు. -
కమీషన్ల కక్కుర్తి
తెనాలికి చెందిన వికలాంగ విద్యార్థి కార్తీక్ ఎంటెక్ చదువుతున్నాడు. ఫీజు రీయింబర్స్‌మెంటు, ఉపకారవేతనాలకు దరఖాస్తు చేసుకున్నాడు. కానీ, ఇంతవరకు ఆన్లైన్లో అప్డేట్ కాలేదు. వికలాంగ సంక్షేమ శాఖకు వెళితే తమకు సంబంధం లేదన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంటుకు నోడల్ ఏజెన్సీ ఎస్సీ సంక్షేమ శాఖ అని తిప్పి పంపారు. రోజూ ఎస్సీ సంక్షేమ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా అధికారులు కనికరించడం లేదని కార్తీక్ ఆవేదన వ్యక్తంచేస్తున్నాడు. కార్తీక్ లాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్న విద్యార్థులు ఇంకా జిల్లాలో ఎందరో ఉన్నారు. సాక్షి, గుంటూరు: విద్యార్థుల చదువుల కోసం ప్రభుత్వం మంజూరు చేస్తున్న ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంటు నిధులు సంక్షేమ శాఖల అధికారులకు, కళాశాలల యాజమాన్యాలకు కల్పతరువుగా మారాయి. జిల్లా వ్యాప్తంగా 639 కళాశాలల్లో ఫీజు రీయింబర్స్‌మెంటు పథకం కింద 76,498 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ విద్యార్థులు ఈ ఏడాది లబ్ధి పొందాల్సి ఉంది. వీరిలో 52,013 మంది రెన్యువల్, 24,485 మంది కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారున్నారు. ఎస్సీ విద్యార్థుల్లో రెన్యువల్ సంఖ్య 18,054 కాగా, ఇప్పటివరకు రిజిష్టర్ అయిన వారి సంఖ్య 16 వేల వరకు ఉంది. బార్ కోడ్, ఆధార్ అంటూ నిబంధనలతో విద్యార్థులను నానా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. విద్యా సంవత్సరం ముగిసే దశకు చేరుకుంటున్నా, ఎస్సీ విద్యార్థులు 6,804 మందికి మాత్రమే రూ.2.64 కోట్లు మంజూరయ్యాయంటే సంక్షేమశాఖ అధికారుల తీరు ఏ విధంగా ఉందో అర్థం అవుతుంది. ఫీజు రీయింబర్స్‌మెంటు కింద రూ.8.56 కోట్లు మంజూరయ్యాయి. ఓ ఉన్నతాధికారి పేరు చెప్పి.. సంక్షేమ శాఖల్లోని ఓ ఉన్నతాధికారి పేరు చెప్పి ఫీజు రీయింబర్స్‌మెంటు నిధుల్లో కమీషన్లు వసూలు చేస్తున్నారని ఆరోపణలున్నాయి. కొన్ని కళాశాలల బాధ్యులే ఏజెంట్లుగా వ్యవహరిస్తూ విడుదలైన బోధనా రుసుంలో పర్సంటేజీలు వసూలు చేసి సంక్షేమ శాఖల అధికారులకు సమర్పించాలంటూ దోపిడీకి పాల్పడుతున్నారు. ఈ భాగోతంపై అవినీతి నిరోధకశాఖ అధికారులకు ఫిర్యాదులు అందాయి. సంక్షేమశాఖ వసతి గృహాలపై ఇటీవలే రాష్ట్ర వ్యాప్తంగా ఏక కాలంలో దాడులు జరిగిన సంగతి తెలిసిందే. ఈ తరహాలో విచారించేందుకు ఏసీబీ అధికారులు యోచిస్తున్నట్లు సమాచారం. సంక్షేమ అధికారులు, కళాశాలల యాజమాన్యం మిలాఖతై విద్యార్థులకు అందాల్సిన బోధనా రుసుం ఫీజుల్ని కళాశాలలకు విద్యార్థుల పేరుతో విడుదలవుతున్న ఫీజు రీయింబర్స్‌మెంటు నిధుల్ని పంచుకుంటున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. విద్యార్థి పేరుతో ప్రభుత్వం విడుదల చేసే ఫీజులు అందినట్లు విద్యార్థి సంతకంతో కూడిన అక్విటెన్సులు పలు కళాశాలలు సంక్షేమ శాఖలకు ఇవ్వడం లేదు. పారదర్శకంగా ఉపకార వేతనాలు అందించేందుకు బయోమెట్రిక్ విధానం ప్రవేశపెట్టామని ఉన్నతాధికారులు చెబుతున్నా, అమలు తీరు ప్రశ్నార్ధకంగా మారుతోంది. విద్యార్థి దరఖాస్తు రిజిస్టర్ అయినా ముడుపులు ముట్టజెప్పనిదే ఆన్లైన్ వ్యవస్థ ముందుకు కదలడం లేదని పలువురు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. అకౌంట్ నంబరు సరిగా నమోదు చేయడం లేదని, ఏదో ఒక కొర్రీతో ఇబ్బందుల పాల్జేస్తున్నారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు.