అన్ని కాలేజీలకు ఆర్‌టీఎఫ్‌ను వెంటనే చె ల్లించాలి | As soon as all the colleges to live to pay | Sakshi
Sakshi News home page

అన్ని కాలేజీలకు ఆర్‌టీఎఫ్‌ను వెంటనే చె ల్లించాలి

Published Wed, Sep 9 2015 12:43 AM | Last Updated on Sun, Sep 3 2017 9:00 AM

As soon as all the colleges to live to pay

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, వికలాంగుల సంక్షేమ శాఖలకు సర్కార్ ఆదేశం
 
హైదరాబాద్: ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకంలో భాగంగా అన్ని  కాలేజీలకు రీయింబర్స్‌మెంట్ ఆఫ్ ట్యూషన్‌ఫీజు (ఆర్‌టీఎఫ్)ను వెంటనే చెల్లించాలని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, వికలాంగుల సంక్షేమ శాఖలను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో స్థానికత సమస్య ఎక్కువగా వస్తున్నందున.. రాష్ట్ర విభజనచట్టం ప్రకారం తెలంగాణలో పదేళ్లపాటు రాష్ట్రపతి ఉత్తర్వులు అమల్లో ఉంటాయని, దీని ప్రకారం స్థానికతకు సంబంధించిన ఉత్తర్వుల ప్రకారం విద్యార్థుల స్థానికతను గుర్తించాలని ఎస్సీ అభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి జె.రేమండ్‌పీటర్ సూచించారు. స్కాలర్‌షిప్‌ల కింద బడ్జెట్ విడుదల చేసినందున, వెంటనే అన్నిశాఖలు అన్ని కాలేజీల ఆర్‌టీఎఫ్ బకాయిలను చెల్లించాలని ఆదేశించారు.

ఇంతకు ముందు విద్యార్థులకు మెయింటినెన్స్ ఫీజు (ఎంటీఎఫ్) చెల్లించాలి.. ఆర్‌టీఎఫ్ బకాయిలు చెల్లించాల్సిందిగా సూచించామని, ఇప్పుడు ఎంటీఎఫ్‌తో సంబంధం లేకుండా అన్ని కాలేజీలకు ఆర్‌టీఎఫ్ బకాయిలను చెల్లించాలన్నారు. మంగళవారం రంగారెడ్డి కలెక్టరేట్ నుంచి జిల్లాల్లోని వివిధ సంక్షేమశాఖ జాయింట్ డెరైక్టర్లు, డీడీలు, సహాయ సంక్షేమ, అసిస్టెంట్ అకౌంట్స్, సీజీజీ అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లింపులు, అంబేడ్కర్ ఓవర్సీస్ పథకం, స్కాలర్‌షిప్స్, హాస్టళ్ల తీరుపై సమీక్షించారు. ఆర్‌టీఎఫ్, ఎంటీఎఫ్ బకాయిలను చెల్లించిన తర్వాతే తదుపరి కేటాయింపులు ఆర్థికశాఖ నుంచి వస్తాయని చెప్పారు. ప్రభుత్వ ఇంటర్, డిగ్రీ కాలేజీలు, యూనివర్సిటీ డిగ్రీ కాలేజీలకు బయోమెట్రిక్ అథెంటికేషన్ అవసరం లేదని, ప్రైవేట్ కాలేజీలు ఆధార్‌తో పరిశీలించాలని సూచించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ పొందే అర్హత ఉందా లేదా అన్న విషయాన్ని జిల్లా అధికారులు ముందుగానే  విద్యార్థులకు తెలియజేయాలని సూచించారు. జిల్లాల్లోని సంక్షేమశాఖల అధికారులంతా ఒక యూనిట్‌గా ఏర్పడి విద్యార్థుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. పోస్ట్‌మెట్రిక్ స్కాలర్‌షిప్‌లో డిపార్ట్‌మెంట్ అటాచ్డ్ హాస్టళ్లలో ఈ-పాస్‌లో విద్యార్థులు రిజిష్టర్ చేసుకోవాలని సూచించారు. ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులతో తండాల అభివృద్ధికి ప్రభుత్వం నిర్ణయించిందని, తండాల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలన్నారు. రుణాల మంజూరులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు గత ఏడాది ఎంపిక చేసిన యూనిట్ల గ్రౌండింగ్ చేయాలని, ఈ రుణాలను ఈ నెలాఖరు వరకు మంజూరు చేయాలని చెప్పారు.

కల్యాణలక్ష్మి, షాదీముబారక్, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీస్ కేసుల్లో పరిహారాలు, హక్కులకు సంబంధించి ఫ్లెక్సీలు, బోర్డుల ద్వారా వివరాలను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలన్నారు. ఎస్సీ, ఎస్టీల దాడులు, అత్యాచారాలు జరిగిన వారం రోజుల్లోగా పరిహారం ఇవ్వాలని సూచించారు. ఈ సమావేశంలో బీసీశాఖ ముఖ్యకార్యదర్శి టి.రాధ, ఎస్టీ సంక్షేమశాఖ కమిషనర్ బి.మహేశ్‌దత్ ఎక్కా, మైనారిటీ సంక్షేమ శాఖ కమిషనర్ తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement
Advertisement