కమీషన్ల కక్కుర్తి
కమీషన్ల కక్కుర్తి
Published Fri, Feb 28 2014 2:25 AM | Last Updated on Wed, Sep 5 2018 9:18 PM
తెనాలికి చెందిన వికలాంగ విద్యార్థి కార్తీక్ ఎంటెక్ చదువుతున్నాడు. ఫీజు రీయింబర్స్‌మెంటు, ఉపకారవేతనాలకు దరఖాస్తు చేసుకున్నాడు. కానీ, ఇంతవరకు ఆన్‌లైన్‌లో అప్‌డేట్ కాలేదు. వికలాంగ సంక్షేమ శాఖకు వెళితే తమకు సంబంధం లేదన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంటుకు నోడల్ ఏజెన్సీ ఎస్సీ సంక్షేమ శాఖ అని తిప్పి పంపారు. రోజూ ఎస్సీ సంక్షేమ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా అధికారులు కనికరించడం లేదని కార్తీక్ ఆవేదన వ్యక్తంచేస్తున్నాడు. కార్తీక్ లాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్న విద్యార్థులు ఇంకా జిల్లాలో ఎందరో ఉన్నారు.
సాక్షి, గుంటూరు: విద్యార్థుల చదువుల కోసం ప్రభుత్వం మంజూరు చేస్తున్న ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంటు నిధులు సంక్షేమ శాఖల అధికారులకు, కళాశాలల యాజమాన్యాలకు కల్పతరువుగా మారాయి. జిల్లా వ్యాప్తంగా 639 కళాశాలల్లో ఫీజు రీయింబర్స్‌మెంటు పథకం కింద 76,498 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ విద్యార్థులు ఈ ఏడాది లబ్ధి పొందాల్సి ఉంది. వీరిలో 52,013 మంది రెన్యువల్, 24,485 మంది కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారున్నారు. ఎస్సీ విద్యార్థుల్లో రెన్యువల్ సంఖ్య 18,054 కాగా, ఇప్పటివరకు రిజిష్టర్ అయిన వారి సంఖ్య 16 వేల వరకు ఉంది. బార్ కోడ్, ఆధార్ అంటూ నిబంధనలతో విద్యార్థులను నానా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. విద్యా సంవత్సరం ముగిసే దశకు చేరుకుంటున్నా, ఎస్సీ విద్యార్థులు 6,804 మందికి మాత్రమే రూ.2.64 కోట్లు మంజూరయ్యాయంటే సంక్షేమశాఖ అధికారుల తీరు ఏ విధంగా ఉందో అర్థం అవుతుంది. ఫీజు రీయింబర్స్‌మెంటు కింద రూ.8.56 కోట్లు మంజూరయ్యాయి.
ఓ ఉన్నతాధికారి పేరు చెప్పి.. సంక్షేమ శాఖల్లోని ఓ ఉన్నతాధికారి పేరు చెప్పి ఫీజు రీయింబర్స్‌మెంటు నిధుల్లో కమీషన్లు వసూలు చేస్తున్నారని ఆరోపణలున్నాయి. కొన్ని కళాశాలల బాధ్యులే ఏజెంట్లుగా వ్యవహరిస్తూ విడుదలైన బోధనా రుసుంలో పర్సంటేజీలు వసూలు చేసి సంక్షేమ శాఖల అధికారులకు సమర్పించాలంటూ దోపిడీకి పాల్పడుతున్నారు. ఈ భాగోతంపై అవినీతి నిరోధకశాఖ అధికారులకు ఫిర్యాదులు అందాయి. సంక్షేమశాఖ వసతి గృహాలపై ఇటీవలే రాష్ట్ర వ్యాప్తంగా ఏక కాలంలో దాడులు జరిగిన సంగతి తెలిసిందే. ఈ తరహాలో విచారించేందుకు ఏసీబీ అధికారులు యోచిస్తున్నట్లు సమాచారం. సంక్షేమ అధికారులు, కళాశాలల యాజమాన్యం మిలాఖతై విద్యార్థులకు అందాల్సిన బోధనా రుసుం ఫీజుల్ని కళాశాలలకు విద్యార్థుల పేరుతో విడుదలవుతున్న ఫీజు రీయింబర్స్‌మెంటు నిధుల్ని పంచుకుంటున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
విద్యార్థి పేరుతో ప్రభుత్వం విడుదల చేసే ఫీజులు అందినట్లు విద్యార్థి సంతకంతో కూడిన అక్విటెన్సులు పలు కళాశాలలు సంక్షేమ శాఖలకు ఇవ్వడం లేదు. పారదర్శకంగా ఉపకార వేతనాలు అందించేందుకు బయోమెట్రిక్ విధానం ప్రవేశపెట్టామని ఉన్నతాధికారులు చెబుతున్నా, అమలు తీరు ప్రశ్నార్ధకంగా మారుతోంది. విద్యార్థి దరఖాస్తు రిజిస్టర్ అయినా ముడుపులు ముట్టజెప్పనిదే ఆన్‌లైన్ వ్యవస్థ ముందుకు కదలడం లేదని పలువురు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. అకౌంట్ నంబరు సరిగా నమోదు చేయడం లేదని, ఏదో ఒక కొర్రీతో ఇబ్బందుల పాల్జేస్తున్నారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు.
Advertisement
Advertisement