వివాహం చేసుకుంటున్న జంట
ఆదర్శజంటకేదీ ఆదరణ
Published Tue, Sep 27 2016 11:51 PM | Last Updated on Mon, Sep 4 2017 3:14 PM
కులాంతర వివాహాలకు కొరవడిన
రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహం
–అమలుకాని పథకాలు
–అందని కేంద్ర సాయం
–ఆర్ధిక ఇబ్బందుల్లో ఆదర్శజంట
ఆదర్శజంటకేదీ ఆదరణ
సాక్షి, చిత్తూరు:
‘కులాంతర వివాహాల ప్రోత్సాహ పథకం’ నీరుగారుతోంది. సమసమాజ స్థాపనకు కులాంతర వివాహాలు తోడ్పడతాయని..వీరికి అన్ని రకాలుగా అండదండలు ఉంటాయని నాయకులు, అధికారులు చెప్పడమే కానీ చేతల్లో చూపించడం లేదు. దీంతో కులాల అంతరాలను దాటుకొని ఒక్కటైన జంట నిరాదరణకు గురవుతున్నారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన ప్రోత్సాహాకాలు రాకపోవడంతో ఆర్థికంగా చితికిపోతున్నారు. ఆదుకోవాల్సిన ప్రభుత్వం చేతులెత్తేయడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆర్థిక సహాయం కోసం ఏళ్ల తరబడి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నా ఫలితం లేకపోవడంతో నిరుత్సాహానికి గురవుతున్నారు.
కుల సంకెళ్లు తెంచుకుని ఒక్కటైన ఆదర్శజంటలకు సర్కారు నుంచి ఎలాంటి ప్రోత్సాహం లభించడం లేదు. ఈ తరహా వివాహాలపై 1997లో అప్పటి ప్రభుత్వం జస్టిస్ పుల్లయ్య కమిటీని వేశారు. 1999లో పుల్లయ్య కమిటీ ప్రభుత్వానికి నివేదిక కూడా సమర్పించింది. ఈ నివేదికను రాష్ట్ర కేబినేట్ కూడా ఆమోదించింది. ఈ నివేదిక ప్రకారం విద్యార్హతను బట్టి విద్య, ఉద్యోగాల్లో ఒక శాతం రిజర్వేషన్ ఇవ్వాలని ప్రభుత్వానికి సూచించింది. చదువులేని వారికి ఆయా జిల్లాల్లోనిఎస్సీ, ఎస్టీ,బీసీకార్పొరేషన్లు ఉపాధి కల్పించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలి. కులాంతర వివాహం చేసుకున్న జంట ఇళ్లు కోసం దరఖాస్తు చేసుకుంటే కచ్చితంగా ఇళ్లు ఇవ్వాలని ప్రభుత్వానికి సూచించింది. వీటన్నింటికీ ప్రభుత్వం ఆమోదం తెలిపినా.. అమలులో మాత్రం నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది.
జీవో నెం 107 అమలేదీ...
కులాంతర వివాహం చేసుకున్న జంటకు సమాజం చిన్న చూపు చూస్తుంది. దీన్ని నివారించడానికి ప్రభుత్వం జీవో 107 విడుదల చేసింది. దీని ప్రకారం ఎస్సీ,ఎస్టీ కార్పొరేషన్ జేడీలు, డీఆర్‌డీఏ పీడీ, పరిశ్రమల శాఖ ఉన్నతాధికారి, లీడ్ బ్యాంక్ మేనేజర్‌లు ఆరు నెలలకు ఒక సారి మానిటరింగ్ చేయాల్సి ఉంటుంది. సోషియల్ హెరాస్‌మెంట్ లేకుండా జంటకు భద్రత కల్పించేందుకు అధికారులు అన్ని చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. జిల్లాలో ఈ జీవో అమలుపై అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారు. దీంతో జిల్లాలో అడపాదడపా పరువు హత్యలు కూడా జరుగుతున్నాయి. వీటిని నివారించేందుకు ప్రభుత్వమే కఠిన చర్యలు తీసుకోవాలి.
కేంద్ర ప్రోత్సాహకమేదీ...
కులాంతర వివాహాలు చేసుకున్న జంటకు రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్రం కూడా రూ. 50 వేలు అందిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వ సహాయం ఎడారిలో ఎండమావిలాగా అప్పుడప్పుడు అందుతున్నా.. కేంద్ర ప్రభుత్వం నుంచి సహాయం మాత్రం ఒక్క జంటకూ అందడం లేదు. అవగాహన లేక లబ్ధిదారులు ఉపయోగించుకోకపోవడంతో ఇది నిరుపయోగంగా మారింది. అవగాహన కల్పించాల్సిన అధికారులు పట్టించుకోకపోవడం లేదు.
నిధుల కేటాయిపులో అలసత్వం..
జిల్లాలో గత మూడు సంవత్సరాలుగా 300 కులాంతర వివాహాలు జరిగాయని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. అనధికారింగా ఈ లెక్క ఇంకా ఎక్కువే ఉంటుంది. వీరికి రూ.1.5 కోట్లు బడ్జెట్ కేటాయించాల్సి ఉండగా ప్రభుత్వం మాత్రం కేవలం రూ.30 లక్షలు విడుదల చేసి చేతులు దులుపుకుంది.
బీసీ వెల్ఫేర్
సంవత్సరం దరఖాస్తు చేసుకున్న వారు లబ్ధి చేకూరినది
2014 23 10
2015 34 04
2016 06 00
ట్రై బల్ వెల్ఫేర్
సంవత్సరం దరఖాస్తు చేసుకున్నవారు లబ్ధి చేకూరినది
2015 37 02
2016 35 09
రెండేళ్ల క్రితం దరఖాస్తు చేసుకున్నా..
కులాంతర వివాహం అనంతరం ఆర్థిక సహాయం కోసం ప్రభుత్వానికి రెండేళ్ల క్రితం దరఖాస్తు చేసుకున్నాను. అదిగో ఇదిగో అంటున్నారు కానీ సహాయం మాత్రం చేయడం లేదు. ఆదర్శ వివాహం చేసుకున్నావని మెచ్చుకోవడమే కానీ..సహాయం మాత్రం చేయడం లేదు.
– మంజునాథ్.. వాయల్పాడు.
Advertisement
Advertisement