మైదుకూరు(చాపాడు): పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికలను తలపించే విధంగా ఈ నెల 17న జిల్లాలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి. ఈ సారి జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలు టీడీపీ అహంకారం.. అధికార దుర్వినియోగానికి.. వైఎస్సార్‌సీపీ ఆత్మవిశ్వాసం..అభిమానికి మధ్య జరిగినట్లుగా పరిశీలకులు భావిస్తున్నారు. వైఎస్సార్‌సీపీని అణగదొక్కేందుకు ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఎన్నికల బరిలో దిగగా.. ప్రజా నమ్మకం, ఆత్మ విశ్వాససంతో వైఎస్సార్‌సీపీ బరిలో దిగింది. ఈ రెండింటికి నడుమ జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక కౌంటింగ్ కడపలో సోమవారం ఉదయం 8గంటలకు మొదలవగా, మధ్యాహ్నం 12గంటలకు గెలుపుపై క్లారిటీ రానుంది..
గెలుపోటములపై జోరుగా బెట్టింగ్‌లు.. ప్రతి మండలంలో లక్షల్లో పందేలు..
ఈ నెల 17న జిల్లాలోని మూడు డివిజన్లలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నిక గెలుపోటములపై 16వ తేదీ నుంచే జోరుగా బెట్టింగ్‌లు జరుగుతున్నాయి. టీడీపీ నిర్వహించిన పాండిచ్ఛేరి శిబిరంలో ఉన్న ఓటర్ల సంఖ్యా బలం చూసుకుని గెలుస్తామనే ధీమాతో తెలుగు తమ్ముళ్లు పందేలకు సిద్ధమవగా.. సంఖ్యా బలంతో పాటు ప్రజా నమ్మకం, ఆత్మ విశ్వాసం, క్రాస్ ఓటింగ్ నమ్మకంతో వైఎస్సార్‌సీపీ వర్గీయులు.. ఇలా ఎవరికి వారే గట్టి ధీమాతో బెట్టింగులకు పాల్పడినట్లు తెలుస్తోంది. ప్రతి మండలంలో రూ.50 లక్షల నుంచి రూ.70లక్షల వరకూ పందేలు జరిగినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. మండలంలోని ప్రతి గ్రామంలో రూ.5లక్షల నుంచి రూ.10లక్షల వరకూ బెట్టింగ్‌లు జరిగినట్లు తెలుస్తోంది. ఈ లెక్కన నియోజకవర్గ వ్యాప్తంగా రూ.2.50 కోట్ల నుంచి రూ.5కోట్ల వరకూ పందేలు జరిగినట్లు సమాచారం.
క్రాస్ ఓటింగ్‌పైనే అందరి దృష్టి.. ప్రతి మండలంలో జరిగిందంటున్న విశ్లేషకులు..
ఈ నెల 17న జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలో క్రాస్ ఓటింగ్ జరిగిందన్న ధీమాతో వైఎస్సార్‌సీపీ వర్గీయులు గెలుస్తామనే విశ్వాసంతో ఉండగా, ఓటింగ్ వరకూ సంఖ్య బలంతో ధీమాగా ఉన్నా రెండు రోజులుగా క్రాస్ ఓటింగ్ ఫీవర్‌తో తెలుగు తమ్ముళ్లు బేజారవుతున్నారు. మైదుకూరు నియోజకవర్గంలోని ప్రతి మండలంలో క్రాస్ ఓటింగ్ జరిగి ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఎన్నిక జరిగిన తీరు, నియోజకవర్గంలో ఉన్న పార్టీ మెజార్టీ సభ్యుల ఆధారంగా, వైఎస్సార్‌సీపీని గెలిపించాలనే పట్టుదలతో క్రాస్ ఓటింగ్ జరిగి ఉండవచ్చని సీనియర్ రాజకీయ నాయకులు చెప్పుకొస్తున్నారు. ఈ క్రమంలో వైఎస్సార్‌సీపీ 25–35ఓట్ల తేడాతో గెలుస్తుందని నియోజకవర్గానికి చెందిన ఓ మాజీ సీనియర్ నేత తమ కార్యకర్తలకు చెప్పినట్లు విశ్వసనీయ సమాచారం. మైదుకూరు మున్సిపాలిటీలో 8, మండలంలో 2, దువ్వూరులో 3, చాపాడులో 2, ఖాజీపేటలో 11, బ్రహ్మంగారిమఠంలో 4 చొప్పున టీడీపీ నుంచి వైఎస్సార్‌సీపీకి క్రాస్ ఓట్లు పడ్డాయని, ఇదే క్రమంలో మైదుకూరులో 2, దువ్వూరులో 2, బ్రహ్మంగారిమఠంలో 1, ఖాజీపేట, చాపాడు మండలాల్లో 2 ఓట్ల చొప్పున టీడీపీకి క్రాస్ ఓటింగ్ చేసి ఉంటారనే అంచనాల్లో ఇరు పార్టీల నాయకులు ఉన్నారు. ఏది ఏమైనా గెలుపు ధీమాతో రెండు వర్గాలు భారీ మొత్తంలో పందెం కాయడం గమనార్హం.
కాయ్ రాజా కాయ్.!
Published Mon, Mar 20 2017 12:05 AM | Last Updated on Tue, Aug 14 2018 5:56 PM
Advertisement