ఈ అభాగ్యురాలెవరో?
► దిక్కుతోచని స్థితిలో గర్భిణి
కాకినాడ క్రైం : ఓ అమాయక గిరిజన యువతి తనకు ఎవరూ లేరంటూ కాకినాడ ప్రభుత్వాస్పత్రికి వచ్చింది. ఆమెగర్భిణికావడం, సహాయకులు ఎవరూ లేకపోవడంతో ఆమెను ఆస్పత్రిలో జాయిన్ చేసుకునేందుకు వైద్యులు నిరాకరించారు. తన పేరు పార్వతి అని, తమది కొత్తపల్లి అని మాత్రమే ఆ యువతి చెబుతోంది. మరే ప్రశ్నకు సమాధానం చెప్పకపోవడంతో ఆమె వివరాలు తెలియరాలేదు. వైద్యులు ఆమెను ఆస్పత్రిలో జాయిన్ చేసుకోకపోవడంతో అధికారులకు విలేకరులు ఫోన్ చేసి విషయం చెప్పారు. దీంతో వారు స్పందించి ఆమెను ఐసోలేషన్ వార్డులో జాయిన్ చేశారు.
ఆ యువతి ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరనే విషయాలు తెలియకపోవడంతో సిబ్బంది సందిగ్ధంలో పడ్డారు. గర్భవతి అయిన ఆ యువతి షాక్‌కు గురై ఉంటుందని, ఎవరో ఇక్కడికి తీసుకువచ్చి వదిలేసి ఉంటారని పలువురు పేర్కొంటున్నారు. ఆమె గిరిజన యువతి కావడంతో ఐటీడీఏ అధికారులు స్పందించి ఆమెను చేరదీయాలని కోరుతున్నారు.