ఎవరా ఇద్దరు?
-
రెవెన్యూశాఖలో అవినీతి కుదుపు
-
తహసీల్దార్లను హెచ్చరించిన కలెక్టర్
-
ఇప్పటికే ఒకరు సెలవులో.. మరొకరు అదే బాటలో..
-
మరిపెడ ఘటన నేథ్యంలో ఉద్యోగుల్లో ఆందోళన
-
మరికొన్ని మండలాల్లోనూ రెక్కీ నిర్వహించిన ఏసీబీ
హనమకొండ అర్బన్ : ‘కొందరు తహసీల్దార్లపై అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. పద్ధతి మార్చుకోవాలని పదేపదే హెచ్చరించినా మార్పు కనిపించడం లేదు. ప్రస్తుతం నా ముందున్న వారిలో ఇద్దరు తహసీల్దార్లపై తీవ్రమైన అవినీతి ఆరోపణలు ఉన్నాయి. మీ తీరు ఇలాగే ఉంటే క్షమించేది లేదు. మీ వల్ల శాఖకు చెడ్డపేరువస్తోంది’ అంటూ ఇటీవల జరిగిన జిల్లా స్థాయి సమావేశంలో స్వయంగా జిల్లా కలెక్టర్ కరుణ తహసీల్దార్లను హెచ్చరించారు.
రెవెన్యూశాఖలో అధికారులపై ఆరోపణలు సహజమే అయిప్పటికీ కలెక్టర్ ప్రత్యేకించి ఇద్దరు అధికారులంటూ ప్రస్తావించడం రెవెన్యూ వర్గాల్లో చర్చనీయాంశమైంది, సమావేశం అనంతరం ఎవరికి వారు.. ఎవరా ఇద్దరు...? అంటూ తమ వద్ద ఉన్న సమాచారం మేరకు అంచనాలు వేసుకోవడం మొదలు పెట్టారు. రెవెన్యూ వర్గాల్లో జరగుతన్న చర్చ ప్రకారం ఇద్దరిలో ఒకరు మహబూబాబాద్ డివిజన్‌లో తహసీల్దార్ కాగా.. మరొకరు ములుగు డివిజన్ పరిధిలో పనిచేస్తున్నారని సమాచారం. ఉన్నతాధికారుల హెచ్చరికలతో పరిస్థితి తీవ్రత గ్రహించిన ఓ అధికారి ఇప్పటికే సెలవు పెట్టగా మరొకరు కూడా అదే ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలిసింది.
ములుగు డివిజన్ పరిధిలో ఉన్న తహసీల్దార్‌పై ఉన్నతాధికారులకు సైతం పలు ఫిర్యాదులు అందినట్లు తెలిసింది. చివరికి వీఆర్‌ఏల వేతనాల్లో కూడా వాటా అడుగుతున్నారని, ప్రతీ విషయంలో సిబ్బందిలో అవినీతిని ప్రోత్సహిస్తున్నారని, కాదన్న వారిని వేధింపులకు గురిచేస్తున్నారనేది చాలాకాలంగా వస్తున్న ఆరోపణ. ప్రస్తుతం ఈ సమాచారం ఉన్నతాధికారులకు కూడా చేరినట్లు తెలుస్తోంది.
మరిపెడ ఘటన తరువాత...
మరిపెడలో మహిళా తహసీల్దార్ ఏసీబీకి పట్టుబడడంతో రెవెన్యూ శాఖలో కుదుపు వచ్చింది. తాజాగా మరికొన్ని మండలాల్లో కూడా ఏసీబీ అధికారులు రెక్కీ నిర్వహించారనే సమాచారం ఆ శాఖలో కలవరం పుట్టిస్తోంది. దీంతో కొన్ని చోట్ల అధికారులు సైతం కార్యాలయాల్లో ఉండాలంటేనే జంకుతున్నారు.
మార్పులకు కలెక్టర్ శ్రీకారం
రెవెన్యూలో అవినీతి విషయంలో తీవ్రంగా స్పందిందిన కలెక్టర్.. జిల్లాలోని అందరు ఆర్డీఓలను తమ పరిధిలోని ఉద్యోగుల పనితీరుపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఆర్డీఓల నుంచి వచ్చిన నివేదిక ఆధారంగా తహసీల్దార్లు, ఇతర సిబ్బందికి బదిలీలు ఉండే అవకాశాలు ఉన్నాయి. జిల్లా పరిస్థితి, తహసీల్దార్ల పనితీరుపై పూర్తిస్థాయి అవగాహన ఉన్న కలెక్టర్ కరుణ.. బదిలీల విషయంలో ఇప్పటికే ఒక అవగాహనకు వచ్చినట్లు సమాచారం.
డీటీలదీ అదేతీరు...
రెవెన్యూ శాఖ నుంచి వెళ్లి పౌరసరఫరాల శాఖలో డీడీ సీఎస్‌లుగా, గోదాం ఇన్‌చార్జ్‌లుగా పనిచేస్తున్న డిప్యూటీ తహసీల్దార్లపై కూడా అవినీతి ఆరోపణల వస్తుండడంతో అధికారులు మండిపడుతున్నారు. పౌరసరఫరాల శాఖలో ఉన్న డీటీలందరినీ మార్చాలని స్వయంగా కలెక్టర్ కరుణ జాయింట్ కలెక్టర్‌ను ఆదేశించారు. ప్రస్తుతం ఈ వ్యహారం తుది దశకు చేరుకుంది. పౌరసరఫరాల్లో కూడా త్వరలో బదిలీలు జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. మొత్తంగా జిల్లాల విభజన సమయంలో రెవెన్యూ శాఖలో వస్తున్న అవినీతి అరోపణలు అధికారులను తీవ్రంగా కలవరపెడుతున్నాయి. ఎప్పుడేం జరగుతుందోనని, తమపై ఆరోపణలు ఉంటే ఎక్కడికి బదిలీ చేస్తారోనని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు.