
వివరాలు వెల్లడిస్తున్న ఎస్సై వాసు చిత్రంలో నిందితుడు ఏలూరి వీరేష్
♦ ప్రియుడితో కలిసి పథక రచన
♦ నిర్మలగిరిపై వీడిన హత్య మిస్టరీ
దేవరపల్లి : ప్రియుడితో అక్రమ సంబంధం పెట్టుకుని భర్తను హత్య చేసిన భార్య ఉదంతం ఇది. భార్యతో పాటు ఆమె ప్రియుడ్ని దేవరపల్లి పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. కేసుకు సంబంధించిన వివరాలను ఎస్సై పి.వాసు విలేకరులకు వెల్లడించారు. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం మండలం ద్రాక్షారామంకు చెందిన చేగొండి భీమశంకరం(30)నకు అదే గ్రామానికి చెందిన జయలక్ష్మితో ఈ ఏడాది మేలో వివాహమైంది. మొదటి నుంచి జయలక్ష్మి భీమశంకరాన్ని విభేదిస్తుంది. ద్రాక్షారామంలోని మాధవానంద నర్సింగ్‌హోమ్‌లో నర్సుగా పనిచేస్తోన్న ఆమె అదే ఆస్పత్రిలో పనిచేస్తోన్న ఏలూరి వీరేష్‌తో అక్రమ సంబంధం పెట్టుకుంది. జయలక్ష్మి ప్రవర్తనపై శంకరానికి అనుమానం రావడంతో అనేకసార్లు మందలించాడు.
దీంతో భర్తను అడ్డు తొలగించుకోవాలని భార్య జయలక్ష్మి, వీరేష్ పథకం రూపొందించారు. తాను వీరేష్‌తో ఎటువంటి అక్రమ సంబంధం కొనసాగించడంలేదని, చేసిన పాపాలను పోగొట్టుకోవడానికి నిర్మలగిరికి వెళ్లి ప్రార్థన చేసి వద్దామని భర్త భీమశంకరంను నమ్మబలికింది. దీనిలో భాగంగా జయలక్ష్మి తన భర్తతో గత నెల 29న దేవరపల్లి మండలం గౌరీపట్నం నిర్మలగిరి పుణ్యక్షేత్రానికి వచ్చింది. పుణ్యక్షేంత్రంలో ప్రార్థన చేశారు. అనంతరం భీమశంకరంతో జయలక్ష్మి మాట్లాడుతూ ఇటీవల ఆసుపత్రిలో రక్త పరీక్షలు చేయించిన రిపోర్టు వచ్చిందని, నీ ఆరోగ్యం బాగాలేదని తేలినందున నీరసం రాకుండా ఇంజెక్షన్ ఇస్తానని నమ్మబలికింది.
భర్త అంగీకరించడంతో కిటమిన్ హై పవర్ డ్రగ్ ఇంజెక్షన్ ఇచ్చింది. అనంతరం 90 సెకన్ల వ్యవధిలో భీమశంకరం ప్రాణాలు విడిచాడు. జయలక్ష్మి తిరిగి గ్రామానికి వెళ్లిపోయింది. నిర్మలగిరిపై శంకరం మృతదేహాన్ని గుర్తించిన ఎస్సై పి.వాసు కొవ్వూరు సీఐ సి.శరత్‌రాజ్‌కుమార్ ఆధ్వర్యంలో అనుమానస్పదమృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిర్మలగిరిపై సీసీ కెమెరాల ఫుటేజ్‌ల ఆధారంగా కేసు ఛేదించినట్టు ఎస్సై వివరించారు.