కూర బాగా వండలేదని...భార్యను హతమార్చిన భర్త
గుమ్మలక్ష్మీపురం/పార్వతీపురం: కూర బాగా వండలేదంటూ భర్త క్షణికావేశంతో కొట్టడంతో భార్య మృతి చెందిన ఘటన గుమ్మలక్ష్మీపురం మండలంలో చోటుచేసుకుంది. ఎల్విన్‌పేట పోలీసులు అందించిన వివరాల ప్రకారం.. గుమ్మలక్ష్మీపురం మండలం చినగీసాడ పంచాయతీ అచ్చబ గ్రామానికి చెందిన కోలక లక్ష్మణరావు సోమవారం సేకరించిన చింతపండును కురుపాం మండల కేంద్రానికి తీసుకెళ్లి విక్రయించి సాయంత్రం ఏడున్నర ప్రాంతంలో ఇంటికి చేరుకున్నాడు.
రాత్రి భోజనంలో వంటలు సరిగా వండలేదంటూ భార్య కోలక లక్ష్మమ్మ (44)తో ఘర్షణకు దిగాడు. క్షణికావేశంలో ఇంట్లో ఉన్న వెదురుకర్రతో లక్ష్మమ్మ పొట్ట, వీపుపై బలంగా కొట్టాడు. వెంటనే స్పందించిన ఇరుగు పొరుగువారు కుప్పకూలిన లక్ష్మమ్మను ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు రవాణా సదుపాయం లేకపోవడంతో ఇంటి వద్దే ప్రథమ చికిత్స అందించారు. పరిస్థితి విషమించడంతో లక్ష్మమ్మ ఒంటిగంట సమయంలో మృతి చెందింది.
మృతురాలి సోదరుడు మిన్నారావు మంగళవారం మధ్యాహ్నం అందించిన సమాచారం మేరకు ఎల్విన్‌పేట సీఐ జి.వేణుగోపాల్, ఎస్‌ఐ ఎస్.రాజు, పోలీసు సిబ్బంది అచ్చబ గ్రామానికి చేరుకొని వివరాలు సేకరించారు. శవపంచనామా నిమిత్తం మృతదేహాన్ని పార్వతీపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి నిందితుడు లక్ష్మణరావును అదుపులోకి తీసుకున్నారు. లక్ష్మమ్మకు ముగ్గురుకు కుమార్తెలు, ఒక కుమారుడు. వారందరికీ వివాహమైంది. సాయంత్రం వరకు తమతో ఉన్న లక్ష్మమ్మ భర్త చేతిలో హతమవ్వడంతో గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి.