పిల్లలతో రాములమ్మ
- మహిళను అరెస్ట్ చేసిన పోలీసులు
- అనాథగా మారిన ముగ్గురు చిన్నారులు
శ్రీశైం ప్రాజెక్టు: నిత్యం మద్యం తాగి హింసిస్తున్న భర్తను ఓ మహిళ దారుణంగా హత్య చేసింది. ఈ ఘటన సున్నిపెంట శనివారం తెల్లవారు జామున చోటు చేసుకుంది. తండ్రి మృతి, తల్లి జైలు పాలు కావడంతో ముగ్గురు చిన్నారుల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు సున్నిపెంటకు చెందిన పానుగంటి రంగనాయకులు (33)కు ప్రకాశం జిల్లా దోర్నాల మండలం హసనాబాద్‌కు చెందిన రాములమ్మతో 14 సంవత్సరాల క్రితం వివాహమైంది. వీరికి 6వ తరగతి చదువుతున్న కుమార్తె రంగలక్ష్మి, మూడు, రెండవ తరగతి చదువుతున్న రంగసాయి, అశోక్ సంతానం. ఽరంగనాయకులు హమాలీ పని చేసే వాడు. అయితే మద్యానికి బానిసై నిత్యం భార్యను వేధించేవాడు. అలాగే కుటుంబం గడవటానికి పైసా కూడా ఇచ్చేవాడు కాదు. పిల్లలను పోషించేందుకు రాములమ్మ స్థానికంగా ఇళ్లలో పని చేసేది. అలా సంపాదించిన డబ్బును కూడా మద్యానికి ఇవ్వాలని రంగనాయకులు భార్యను వేధించేవాడు. ఈ క్రమంలో శుక్రవారం భార్యాపిల్లలను తీవ్రంగా కొట్టాడు. అనంతరం అందరిని చంపేస్తానని గొడ్డలితో బెదిరించడంతో భయపడిన ఆమె రాత్రంతా ఓ చోట తలదాచుకుంది.
శనివారం తెల్లవారు జామున ఇంటికి చేరుకున్న ఆమెకు గొడ్డలిని పక్కనే పెట్టుకుని నిద్రిస్తున్న భర్త కనిపించాడు. ఎప్పటికైన భర్తతో తనకు, బిడ్డలకు ప్రాణాప్రాయం ఉందని భావించింది గొడ్డలితో అతని తలపై నరకడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న సర్కిల్ ఇన్‌స్పెక్టర్ విజయకృష్ణ , ఎస్‌ఐ ఓబులేష్ సిబ్బందితో ఘటన స్థలానికి చేరుకున్నారు. హత్యకు కారణాలు తెలుసుకుని రాములమ్మను అదుపులోకి తీసుకున్నారు. తండ్రి హత్యకు గురికావడం, తల్లిని పోలీసులు అరెస్ట్ చేయడంతో ముగ్గురు చిన్నారులు అనాథలుగా మారారు. ప్రస్తుతానికి బంధువులు చేరదీశారు.