
భూవివాదమే ప్రాణం తీసిందా..?
ఆయనో న్యాయవాది.. పేరు ఉదయ్‌కుమార్. ఆయన తండ్రి ఆర్మీలో పనిచేసి ఉద్యోగ విరమణ చేశాడు. దీంతో ఆయనకు ప్రభుత్వం శామీర్‌పేట మండలం జవహర్‌నగర్ పంచాయతీ పరిధిలోని చెన్నాపూర్ సర్వేనెంబర్ 700లో ఐదెకరాల స్థలాన్ని కేటాయించింది. ఈ భూమి విషయంలో కొంతమందితో అతడికి వివాదం నెలకొంది. ఈ నేపథ్యంలో న్యాయవాదిని గుర్తు తెలియని వ్యక్తులు కీసర మండలం కీసరదాయర శివారులో చంపేసి కారులో మృతదేహాన్ని ఉంచి దహనం చేశారు. శనివారం అతనికి భార్య అనేకసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదు. చివరకు ఆదివారం ఉదయం కారులో అతడిని దహనం చేసిన విషయం బయట పడింది
- కీసర
* న్యాయవాదిని దారుణంగా హత్య చేసిన దుండగులు
* తన తండ్రి మాజీ సైనికుడి పొలం విషయమై గొడవలు
* కీసరదాయర శివారులో ఘటన
* వివరాలు సేకరించిన డీసీపీ, ఏపీసీ
* కలకలం సృష్టించిన ఉదయ్‌కుమార్ హత్య
కీసర: న్యాయవాది ఉదయ్‌కుమార్(45) హత్య జిల్లాలో ఆదివారం కలకలం రేపింది. మండల పరిధిలోని కీసరదాయర శివారులో దుండగులు ఆయనను చంపేసి కారులో మృతదేహం ఉంచి కాల్చేశారు. సంఘటనా స్థలాన్ని మల్కాజిగిరి డీసీపీ రాంచంద్రారెడ్డి, పేట్ బషీరాబాద్ ఏసీపీ రఫీక్ తదితరులు పరిశీలించారు. పోలీసులు జాగిలాలతో వివరాలు సేకరించారు. జాగిలం ఘటనా స్థలం నుంచి కీసర రహదారిలో ఉన్న ఓ నీళ్లసంపు వద్దకు వెళ్లింది. కాప్రా శ్రీనివాస ఆఫీసర్స్ కాలనీకి చెందిన ఉదయ్‌కుమార్, జగదీశ్వరి దంపతులు. ఉదయ్‌కుమార్ ఈసీఐఎల్‌లోని ఓ సీనియర్ న్యాయవాది వద్ద పనిచేస్తున్నాడు.
ఇదిలా ఉండగా, శని వారం మధ్యాహ్నం తన మారుతీ కారులో వెళ్లిన ఉదయ్‌కుమార్ తిరిగి రాలేదు. కుటుంబీకులు ఆయన ఫోన్ కాల్ చేసినా లిఫ్ట్ చేయలేదు. ఆదివారం ఉదయం కీసరదాయర గ్రామ శివారులో ఓ కారులో వ్యక్తి మృతదేహం కాలిపోయి ఉంది. ఘటనా స్థలంలో ఓ చెప్పుల జత, సగం చినిగిపోయిన దుండగుడిదిగా భావిస్తున్న చొక్కా, అగ్గిపెట్టె, కారులో కాలిపోయిన మృతుడికి సంబంధించిన సెల్‌ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
రహదారి గొడవే కారణమా..?
భూవివాదమే న్యాయవాది ఉదయ్‌కుమార్ హత్యకు దారి తీసి ఉంటుందని కుటుంబీకులు, పోలీసులు అనుమానిస్తున్నారు. ఉదయ్‌కుమార్ తండ్రి నకులుడు ఆర్మీలో పనిచేసి రిటైర్డ్ అయ్యారు. ఆయనకు సర్కార్ శామీర్‌పేట మండలం జవహర్‌నగర్ పంచాయతీ పరిధిలోని చెన్నాపూర్ సర్వేనెంబర్ 700లో ఐదెకరాల స్థలాన్ని కేటాయించింది. ఇటీవల సదరు భూమిలోకి వెళ్లే రహదారి విషయంలో కొందరితో వివాదం నెలకొందని కుటుం బీకులు తెలి పారు. 5 నెలల క్రితం ఉదయ్‌కుమార్ తండ్రి నకులుడిపై కొందరు దాడిచేసి గాయపర్చారని.. ఈ నేపథ్యంలో ఉదయ్‌కుమార్ హత్య జరిగిందా అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి.
దేశసేవ చేస్తే పుత్రశోకం మిగిలింది
కుమారుడి హత్యతో నకులుడు షాక్‌కు గురయ్యాడు. ఘటనా స్థలంలో ఆయన గుండెలుబాదుకుంటూ రోదించాడు. దేశసేవ చేసిన తనకు పుత్ర శోకం మిగిల్చారని ఆయన రోదించిన తీరు అక్కడున్న వారికి కంటతడి తెప్పించింది. మాంసపు ముద్దగా మారిన తన భర్త ఉదయ్‌కుమార్‌ను చూసి మృతుడి భార్య జగదీశ్వరి గుండెలుబాదుకుంటూ రోదించింది. అయితే, ఇటీవల ఉదయ్‌కుమార్ ఓ కేసు విషయంలో కీసర ఠాణాకు వచ్చినట్లు పోలీసులు తెలిపారు. అయితే, ఉదయ్‌కుమార్, జగదీశ్వరి దంపతులకు సంతానం లేదు. మల్కాజిగిరి బార్ అసోసియేషన్ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు తెలుసుకున్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని ఈ సందర్భంగా వారు పోలీసులను డిమాండ్ చేశారు. కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ గురువారెడ్డి తెలిపారు.