
గుళ్లు సరే.. మరి మద్యం షాపు ?
పుష్కర ఘాట్‌లకు ఆటంకం అంటూ దేవాలయాలు, పేదల నివాసాలను నిర్ధాక్షణ్యంగా తొలగిస్తున్న అధికారులు నిబంధనలకు విరుద్ధంగా హైవేకు 50మీటర్ల దూరంలో ఏర్పాటు చేసిన మద్యం దుకాణాన్ని తొలగించకపోవటంపై గ్రామస్తులు విమర్శ వర్షం కురిపిస్తున్నారు.
వైన్ షాపు అధికార పార్టీ నాయకుల కనుసన్నల్లో నడుస్తున్నదని అధికారులు గుర్తించే విధంగా పసుపు జెండాలను రక్షణ కవచంలా ఏర్పాటు చేశారని, అందుకే అధికారులు నిబంధనలకు విరుద్ధంగా వైన్ షాపును నిర్వాహిస్తున్న తమకు రావాల్సిన వాటాలను అందుకుని అటువైపు కన్నెతైనా చూడటం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పుష్కర ఘాట్‌కు సమీపంలో ఎటువంటి తినుబండారాలు అమ్మకూడదంటూ చిరువ్యాపారులకు హుకుంజారీ చేసిన అధికార యంత్రాంగం అధికార పక్షం నేతల కనుసన్నల్లో నడుస్తున్న వైన్ షాపుకు మాత్రం ఎటువంటి నింబంధనలు విధించకపోవటంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పెనుమూడి–పులిగడ్డ వారధికి పోలీస్ చెక్ పోస్టుకు మద్యలో 214–ఎ జాతీయ రహదారికి 50 మీటర్ల దూరంలో ఏర్పాటు చేసిన మద్యం దుకాణంతో భక్తులు తీవ్ర అసౌకర్యానికి గురికావటంతో పాటు ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగే విధంగా ఉంటుందని స్థానికులు భావిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసిన మద్యం దుకాణాన్ని తొలగించాలని స్థానికులు కోరుతున్నారు.