ఇంటి గొడవలపై టీటీడీపీ దృష్టి
♦ చంద్రబాబుతో నేడు భేటీ!
♦ తేదీ మార్చాలన్న రేవంత్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: ఆధిపత్య పోరు చివరకు వ్యక్తిగత గొడవలకు దారితీస్తున్న పరిణామాలపై తెలంగాణ తెలుగుదేశం పార్టీలో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇంటి గొడవలను పరి ష్కరించుకోకుంటే ఇబ్బందులు తప్పవన్న ఆలోచనకు వచ్చిన టీటీడీపీ నాయకత్వం ఆ దిశలో ప్రయత్నాలు మొదలు పెట్టింది. శనివారం రాత్రి టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు, పార్టీ తెలంగాణ కమిటీ అధ్యక్షుడు ఎల్.రమణతో, వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి గొడవపడిన సంఘటన పార్టీలో తీవ్ర చర్చకు దారితీసింది. రేవంత్‌రెడ్డి తీరుపై రాష్ట్ర అధ్యక్షుడు రమణసహా అనేకమంది సీనియర్లు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు సమాచారం.
ఈ వ్యవహారంలో అధినేత చంద్రబాబు వద్ద తాడోపేడో తేల్చుకోవాలని వారు భావిస్తున్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడినైన తన పట్ల రేవంత్ కనీస మర్యాద లేకుండా క్రమశిక్షణ పరిధి దాటి వ్యవహరిస్తున్నారని రమణ తన సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది. వరంగల్ పార్లమెంటు స్థానం, నారాయణఖేడ్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు జరగాల్సి ఉన్న సమయంలో పార్టీ శ్రేణులకు తప్పుడు సంకేతాలు వెళ్లేలా జరుగుతున్న సంఘటనలకు బ్రేక్ వేయాలని రమణ భావిస్తున్నారు. వీలైనంత త్వరగా పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుతో భేటీ కావాలని ఆయన నిర్ణయించుకున్నట్లు సమాచారం.
ఈ మేరకు సోమవారం ఉదయం పదకొండు గంటలకు బాబుతో భేటీకి సమయం కోరారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే తాను ఏసీబీ కార్యాలయానికి వెళ్లి సంతకం చేయాల్సి ఉన్న దృష్ట్యా సమావేశం తేదీని మార్చాలని రేవంత్ కోరినట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే తెలంగాణలో తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొం టున్న పార్టీని గట్టెక్కించేందుకు ప్రయత్నించాల్సిన తరుణంలో ఆధిపత్యం కోసం కొందరు తాపత్రయ పడుతున్న తీరుపై పార్టీ సీనియర్లు పెదవి విరుస్తున్నారు. పార్టీలో జరుగుతున్న కుమ్ములాటలతోపాటు, వరంగల్ ఎంపీ స్థానానికి జరగనున్న ఉప ఎన్నికల్లో అనుసరించాల్సి వ్యూహంపైనా బాబుతో భేటీలో చర్చించనున్నారని సమాచారం.