విద్యుదాఘాతంతో రైతు మృతి
– విద్యుత్ వైర్లకు మరమ్మతులు చేస్తుండగా ప్రమాదం
– మునుగోడు మండలం కొరటికల్‌లో ఆలస్యంగా వెలుగులోకి..
(కొరటికల్)మునుగోడు:
విద్యుదాఘాతంతో ఓ రైతు మృతిచెందాడు. ఈ ఘటన మండలంలోని కొరటికల్ గ్రామంలో ఆలస్యంగా ఆదివరం వెలుగులోకి వచ్చింది. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొరటికల్ గ్రామానికి చెందిన మాలిగ నర్సింహ్మ(45) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈయన వ్యవసాయ భూమి వాగును ఆనుకొని ఉంది. కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలతో పొలానికి నీరు పెట్టలేదు. శుక్రవారం నుంచి వర్షం తగ్గడంతో శనివారం ఉదయం వ్యవసాయ భూమి వద్దకు వెళ్లాడు. వాగు నాలుగురోజుల పాటు ఉధృతంగా పారడంతో మోటార్ విద్యుత్ వైర్లు తెగిపోయాయి. గమనించిన నర్సింహ్మ వాటికి మరమ్మతులు చేస్తూ విద్యుదాఘాతానికి గురై మృతిచెందాడు.
రాత్రి వరకూ ఇంటికి రాకపోవడంతో..
వ్యవసాయ బావి వద్దకు వెళ్తున్నానని నర్సింహ ఇంట్లో చెప్పి ఉదయం బయలుదేరాడు .సాయంత్రం అవుతున్నా ఇంటికి రాకపోవడంతో అతడి భార్య గ్రామంలోనే ఉండి ఉంటాడని అనుకుంది. రాత్రి ఎనిమిది గంటల వరకు నర్సింహ ఆచూకీ తెలియకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురై వ్యవసాయ బావి వద్దకు వెళ్లారు. అక్కడ టిఫన్ బాక్స్, చెప్పులు చూసి ఇక్కడే ఉండి ఉంటాడని వెతకగా కొద్ది దూరంలోనే వాగులో ఓ తాటిబొత్తకు చిక్కి విగతజీవుడిగా కనిపించాడు. గమనించిన గ్రామస్తులు విషయాన్ని పోలీసులకు తెలియచేయగా ఎస్‌ఐ ఇఫ్తేకర్ అహ్మద్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని నల్లగొండ ప్రభత్వు ఆస్పత్రికి తరలించారు. మృతుడి భార్య ఫిర్యాదు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ తెలిపారు.