రూపే కార్డుతో రూ.2లక్షల ప్రమాదబీమా
నిడదవోలు : రూపే కార్డులతో 40 రోజుల్లో కనీసం ఒక్కసారైనా సొమ్ము లావాదేవీలు జరిపితే ఖాతాదారులకు రూ. 2 లక్షల ప్రమాద బీమా వర్తిస్తుందని ఆంధ్రాబ్యాంక్ డిప్యూటీ జనరల్ మేనేజర్ కారే భాస్కరరావు చెప్పారు. పట్టణంలో శుక్రవారం ఆంధ్రాబ్యాంక్ నవశక్తి శాఖ ప్రారంభోత్సవానికి వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా 118 ఆంధ్రాబ్యాంక్ శాఖల ద్వారా కోటి రూపే కార్డులు పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు వివరించారు. ప్రస్తుతం జిల్లాలో తమ బ్యాంక్ ద్వారా రూ. 7,620 కోట్ల టర్నోవర్ జరుగుతోందని చెప్పారు. త్వరలో గణపరం మండలం పిప్పరలో ఆంధ్రాబ్యాంక్ నవశక్తి శాఖను ప్రారంభించనున్నామన్నారు. రిజర్వు బ్యాంక్ ఆదేశాల మేరకు 2 వేల జనాభా ఉన్న ప్రాంతాల్లో త్వరలో బ్రాంచీలను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆంధ్రాబ్యాంక్ సీనియర్ మేనేజర్ పి.దేవదాస్ తదితరులు పాల్గొన్నారు.