‘ప్రభుత్వ’ విద్యార్థులకు ఇవ్వనున్న
యూనిఫాం వస్త్రం పక్కదారి..
స్థానిక టైలర్లను కాదని దళారులకు అవకాశం
‘టెస్కో’కు బదులుగా నాసిరకం బట్టతో దుస్తులు
పర్వతగిరి : ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ప్రైవేట్‌కు దీటుగా ఉండాలన్న భావనతో ప్రభుత్వం ఏటా రెండు జతల చొప్పున దుస్తులు అందజేస్తోంది. ఇందులో భాగంగా గతంలో ప్రభుత్వమే దుస్తులు సిద్ధం చేయించి విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా పంపిణీ చేసేది. ఇలా చేయడం ద్వారా సైజుల్లో తేడా వచ్చి విద్యార్థులు ఇబ్బంది పడ్డారు. ఈ మేరకు ‘టెస్కో’ ద్వారా నాణ్యమైన బట్ట సరఫరా చేస్తూ స్థానిక దర్జీలకు ఉపాధి కల్పించేందుకు వారితో విద్యార్థులకు బట్టలు కుట్టించాలని నిర్ణయించారు. దీంతో దళారులు రంగప్రవేశం చేసి ఎస్‌ఎంసీ తీర్మానాలు లేకుండా.. మండలాన్ని యూనిట్‌గా తీసుకుని టెస్కో ద్వారా వస్త్రం తెచ్చుకుంటున్నారు. ఆ వస్త్రం తో కూడా విద్యార్థులు దుస్తులు తయారు చేయకుండా బయట అమ్ముకుని.. నాసిరకంతో వస్త్రంలో తయారైన దుస్తులు రూపొందించి విద్యార్థులకు అందజేస్తున్నారు.
రెండు జతల చొప్పున..
ప్రభుత్వ పాఠశాలల్లో శిశు నుండి 8వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు ప్రభుత్వం ఏటా రెండు జతల చొప్పున దుస్తులను పంపిణీ చేస్తుంది. టెస్కో(ఉమ్మడి రాష్ట్రంలో ఆప్కో) ద్వారా ప్రతీ పాఠశాలకు వస్త్రం పంపిణీ చేస్తుండగా.. స్థానిక దర్జీలతో దుస్తులు సిద్ధం చేయించాలి. ఈసారి విద్యాసంవత్సరం ప్రారంభమయ్యాక ఎనిమిది నెలలకు దుస్తులు పంపిణీ చేసేదుకు రంగం సిద్ధం కాగా.. కొందరు దళారులు అక్రమాలకు తెర లేపారు. ఇందులో కొందరు ఎంఈఓలతో కుమ్మకై పాఠశాలల్లోని విద్యార్థుల సంఖ్య కంటే ఎక్కువ రాయించుకుని సరిపడా వస్త్రంతో స్థానికులను కాదని బయటి దర్జీలతో దుస్తులు సిద్ధం చేయిస్తున్నారు. మిగిలిన బట్టను మార్కెట్‌లో అమ్ముకుంటున్నారని సమాచారం. ఇక కొందరు టెస్కో నుంచి మొత్తం బట్టను బయట అమ్మేసి నాసిరకం బట్టతో దుస్తులు సిద్ధం చేయిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు టెస్కో నుంచి వచ్చే వస్త్రం మీటర్ రూ.120 వరకు ఉండగా.. బయట రూ.60కి దొరికే వస్త్రం ఉపయోగిస్తుండడంతో పెద్దమొత్తంలో దళారులకు లాభం చేకూరుతోంది.
శ్రమ దోపిడీ...
కొందరు దళారులు మొత్తం వస్త్రాలను బయట సిద్ధం చేయిస్తుండగా మరికొందరు స్థానికుల అతి తక్కువ ధర చెల్లించి కుట్టిస్తున్నారు. డ్రెస్‌కు కావాల్సిన దారం, గుండీలు తదితర సామాన్లను దర్జీలకు అందిస్తారు. ఒక్కో డ్రెస్‌కు రూ.5 చొప్పున సామగ్రి అవసరం కాగా, కుట్టినందుకు డ్రెస్‌కు రూ.10 మాత్రమే చెల్లిస్తున్నారు. అంటే రూ.15లో డ్రెస్ సిద్ధమవుతుండగా.. ప్రభుత్వం నుంచి మాత్రం దళారులు రూ.40 చొప్పున పొందుతున్నారు. ఇలా డ్రెస్‌కు రూ.25 వరకు దళారుల జేబుల్లో చేరుతోంది. ఇంత తక్కువ ధరకు కుట్టేందుకు సిద్ధంగా లేమని దర్జీలు చెబుతుండగా.. మొత్తమే ఉపాధి కరువవుతోంది.
ఇలా వెలుగులోకి..
పర్వతగిరి ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులకు దుస్తులు సిద్ధం చేస్తామని కొందరు దళారులు 20 రోజులుగా ఎంఈఓ, హెచ్‌ం, ఎస్‌ఎంసీ చైర్మన్ వెంట పడుతున్నారు. స్థానిక దర్జీలు 10 మందికే అవకాశం కల్పిస్తామని ఎస్‌ఎంసీ చైర్మన్ చెప్పడమే కాకుండా హెచ్‌ఎంకు ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. దీంతో ఎంఈఓ, హెచ్‌ఎంలు టెస్కో వద్ద వస్త్రం తెచ్చుకోవాలని దర్జీలను వరంగల్ పంపించారు. అక్కట టెస్కో గోదాంకు వెళ్లగా పర్వతగిరి విద్యార్థుల వస్త్రాన్ని హెచ్‌ఎం తీసుకున్నట్లు సంతకాన్ని వారు చూపించారు. దీంతో నివ్వెరపోయిన దర్జీలు ఆరా తీయగా.. స్థానిక దర్జీలు వస్తారని భావించి ముందుగానే మండలాన్ని యూనిట్‌గా దళారులు ఏజెంట్ ద్వారా బట్ట తీసుకువెళ్లినట్లు తేలింది.
దర్జీల పేరిట దగా!
Published Fri, Jan 6 2017 10:46 PM | Last Updated on Tue, Sep 5 2017 12:35 AM
Advertisement
Advertisement