కేంద్రం విధానాలతో బ్యాంకులు నిర్వీర్యం
→ ఉద్యోగులు కష్టపడినా స్పందన శూన్యం
→ న్యాయమైన కోరికలు తీరేవరకు పోరాడతాం
→ యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ కన్వీనర్ ప్రభాకర్
→ జీవీఎంసీ గాంధీ పార్కు వద్ద బ్యాంకు ఉద్యోగుల నిరసన
→ పాల్గొన్న 3వేల మంది ఉద్యోగులు సమ్మె విజయవంతం
ద్వారకానగర్ (విశాఖ దక్షిణ): కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సంస్కరణల పేరుతో ప్రభుత్వ రంగ బ్యాంకులను నిర్వీర్యం చేస్తోందని యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంకు యూనియన్స్ కన్వీనర్ సి.ఎ.ఎస్.ప్రభాకర్ అన్నారు. తమ న్యాయమైన కోరికలు తీరేవరకు పోరాడతామని స్పష్టం చేశారు. దేశవ్యాప్త సమ్మెలో భాగంగా జీవీఎంసీ గాంధీ పార్కు వద్ద యూనియన్ నాయకులు, అధికారులు సమ్మె చేపట్టారు. ప్రభాకర్ మాట్లాడుతూ దేశంలో పెద్దనోట్ల రద్దు తరువాత బ్యాంకు ఉద్యోగులు కష్టపడి పనిచేసినా కేంద్రప్రభుత్వం తగిన విధంగా స్పందించలేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఉద్యోగులకు రావల్సిన మొత్తాలను ఇవ్వడం లేదన్నారు. ఉద్యోగ విరమణ తరువాత లభించే మొత్తాలను పెంచాలని, వీటిపై ఆదాయపన్ను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఎన్‌డీఏ ప్రభుత్వం బ్యాంకుల పట్ల అవలంబిస్తున్న తీరును వ్యతిరేకిస్తున్నామన్నారు.
బ్యాంకుల విలీనంపై వ్యతిరేకత
బ్యాంకింగ్‌లో ఔట్‌సోర్సింగ్ విధానాలు విరమించుకోవాలన్నారు. బ్యాంకుల్లో ఖాళీలను తక్షణమే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. కార్మికుల చట్టాలను సవరణల ద్వారా నీరు గార్చడం, బ్యాంకులను విలీనం చేయడం వంటివాటిని వ్యతిరేకిస్తున్నామన్నారు. అన్ని స్థాయిల్లోనూ తగినంత ఉద్యోగ నియామాకాలు జరగాలని, పూర్తి 5 రోజులు బ్యాంకింగ్ సదుపాయాన్ని అమలు చేయాలని కోరారు. కార్యక్రమంలో ఎన్.సాంబశివరావు(ఎన్‌సీబీఈ), యుగంధర్(ఏఐబీఈఏ), జి.వాసుదేవరావు(ఏఐబీవోసీ) బి.రమణమూర్తి(ఏఐబీవోసీ), పలు సంఘాల నాయకులు పి.ఎన్.మల్లేశ్వరరావు, ఆర్.వి.రవికుమార్, జి.రామచంద్రరావు, జె.శంకర్రాజు, ఆల్ ఇండియా బ్యాంకు ఎంప్లాయిస్ అసోసియేషన్ కార్యదర్శి బి.ఎస్.రాంబాబు, ఎస్‌ఎస్‌బీఈఏ నాయకుడు కె.ఎస్.కృష్ణ, ఎస్‌బీహెచ్ ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్‌రెడ్డి, ఎస్‌బీహెచ్ అధ్యక్షుడు రాజశేఖర్, కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.