Economic reform
-
ఆర్థిక సంస్కరణలతో ‘ప్రగతి’ పరుగులు
సాక్షి, హైదరాబాద్: ఆర్థిక సంస్కరణలతో దేశప్రగతి పరుగులు తీస్తోందని కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నక్వీ అన్నారు. గురువారం హైదరాబాద్‌లోని కోట్ల విజయభాస్కర్‌రెడ్డి స్టేడియంలో ప్రధానమంత్రి ముద్ర యోజన ప్రమోషన్ క్యాంపెయిన్‌ను మంత్రి ప్రారంభించారు. అనంతరం నక్వీ మాట్లాడుతూ బలమైన ఆర్థిక వ్యవస్థ గల దేశంగా భారతదేశాన్ని ప్రపంచం గుర్తించిందని అన్నారు. భారతదేశం ప్రస్తుతం పెట్టుబడులకు అత్యంత భద్రమైన, బలమైన గమ్యస్థానంగా మారిందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం 2015లో ప్రారంభించిన ప్రధానమంత్రి ‘ముద్ర యోజన’లో భాగంగా దాదాపు రూ.9.13 కోట్ల మందికి రుణాలు మంజూరు చేసినట్లు తెలిపారు. ‘ముద్ర యోజన’లబ్ధిదారుల్లో సుమారు 76 శాతం మంది మహిళలు ఉన్నారని మంత్రి వెల్లడించారు. 55 శాతానికిపైగా ఎస్సీ, ఎస్టీ, ఇతర వెనుకబడిన తరగతులు, అల్పసంఖ్యాక వర్గాలవారు ఉన్నారని వివరించారు. పేద కుటుంబాల్లో వెలుగులు నింపాలన్నదే ముద్ర లక్ష్యమని అన్నారు. నోట్ల రద్దు ఫలితాలను ఇస్తోందని పేర్కొన్నారు. ముద్ర యోజనతోపాటు ‘స్టార్టప్ ఇండియా’‘స్టాండప్ ఇండియా’’ తదితర పథకాల గురించి మంత్రి వివరించారు. ‘జన్‌ధన్’లో అగ్రగామి జన్‌ధన్ ఖాతాలు తెరిపించడం, నగదు లావాదేవీలు నిర్వహించడంలో రాష్ట్రం ముందుందని నక్వీ అన్నారు. స్టాండప్ ఇండియా కార్యక్రమం కింద కొంత వెనుకబడి ఉన్నామని రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. దేశంలోనే అగ్రగామిగా మహిళా గ్రూపులు పనిచేస్తున్నాయని, వివిధ కార్యక్రమాల కింద రూ.3,700 కోట్ల రుణాలు పంపిణీ చేసినట్లు చెప్పారు. రాష్ట్ర గ్రామీణావృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ స్త్రీనిధి ద్వారా మహిళలకు రూ.35 కోట్ల రుణాలు అందజేసినట్లు తెలిపారు. స్వయం సహాయక సంఘాలకు వృత్తి నైపుణ్యంలో శిక్షణ ఇప్పిస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణ, కేంద్ర మాజీమంత్రి బండారు దత్తాత్రేయ, ఎమ్మెల్యేలు మాగంటి గోపీనా«థ్, కిషన్‌రెడ్డి, చింతల రాంచంద్రారెడ్డి, స్టీఫెన్సన్, బ్యాంక్ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రూ.500 కోట్ల విలువ గల చెక్కులను 14 వేల స్వయం సహాయక గ్రూపులకు అందజేశారు. పలు బ్యాంకుల నుంచి మంజూరైన ముద్ర రుణాలను మంత్రులు పంపిణీ చేశారు. డిజిటల్ చెల్లింపులు జరిపే విధానం, ‘భారత్ క్యూఆర్ కోడింగ్’, ‘భీమ్ యాప్’ను డౌన్లోడ్ చేసుకోవడం, బ్యాంకు ఖాతాలను ‘ఆధార్’తో జోడించడం వంటి అంశాలను కూడా వివరించారు. దాదాపు 35 బ్యాంకులు, ఆర్థిక సంస్థలు తమ ఉత్పత్తులు, సేవల గురించి వివరించేందుకు 60 స్టాళ్లను ఏర్పాటు చేశాయి. 9 రకాల ఆర్థిక సేవలను అక్కడికక్కడే అందజేశాయి. -
కేంద్రం విధానాలతో బ్యాంకులు నిర్వీర్యం
→ ఉద్యోగులు కష్టపడినా స్పందన శూన్యం → న్యాయమైన కోరికలు తీరేవరకు పోరాడతాం → యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ కన్వీనర్ ప్రభాకర్ → జీవీఎంసీ గాంధీ పార్కు వద్ద బ్యాంకు ఉద్యోగుల నిరసన → పాల్గొన్న 3వేల మంది ఉద్యోగులు సమ్మె విజయవంతం ద్వారకానగర్ (విశాఖ దక్షిణ): కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సంస్కరణల పేరుతో ప్రభుత్వ రంగ బ్యాంకులను నిర్వీర్యం చేస్తోందని యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంకు యూనియన్స్ కన్వీనర్ సి.ఎ.ఎస్.ప్రభాకర్ అన్నారు. తమ న్యాయమైన కోరికలు తీరేవరకు పోరాడతామని స్పష్టం చేశారు. దేశవ్యాప్త సమ్మెలో భాగంగా జీవీఎంసీ గాంధీ పార్కు వద్ద యూనియన్ నాయకులు, అధికారులు సమ్మె చేపట్టారు. ప్రభాకర్ మాట్లాడుతూ దేశంలో పెద్దనోట్ల రద్దు తరువాత బ్యాంకు ఉద్యోగులు కష్టపడి పనిచేసినా కేంద్రప్రభుత్వం తగిన విధంగా స్పందించలేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఉద్యోగులకు రావల్సిన మొత్తాలను ఇవ్వడం లేదన్నారు. ఉద్యోగ విరమణ తరువాత లభించే మొత్తాలను పెంచాలని, వీటిపై ఆదాయపన్ను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఎన్డీఏ ప్రభుత్వం బ్యాంకుల పట్ల అవలంబిస్తున్న తీరును వ్యతిరేకిస్తున్నామన్నారు. బ్యాంకుల విలీనంపై వ్యతిరేకత బ్యాంకింగ్‌లో ఔట్సోర్సింగ్ విధానాలు విరమించుకోవాలన్నారు. బ్యాంకుల్లో ఖాళీలను తక్షణమే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. కార్మికుల చట్టాలను సవరణల ద్వారా నీరు గార్చడం, బ్యాంకులను విలీనం చేయడం వంటివాటిని వ్యతిరేకిస్తున్నామన్నారు. అన్ని స్థాయిల్లోనూ తగినంత ఉద్యోగ నియామాకాలు జరగాలని, పూర్తి 5 రోజులు బ్యాంకింగ్ సదుపాయాన్ని అమలు చేయాలని కోరారు. కార్యక్రమంలో ఎన్.సాంబశివరావు(ఎన్సీబీఈ), యుగంధర్(ఏఐబీఈఏ), జి.వాసుదేవరావు(ఏఐబీవోసీ) బి.రమణమూర్తి(ఏఐబీవోసీ), పలు సంఘాల నాయకులు పి.ఎన్.మల్లేశ్వరరావు, ఆర్.వి.రవికుమార్, జి.రామచంద్రరావు, జె.శంకర్రాజు, ఆల్ ఇండియా బ్యాంకు ఎంప్లాయిస్ అసోసియేషన్ కార్యదర్శి బి.ఎస్.రాంబాబు, ఎస్ఎస్బీఈఏ నాయకుడు కె.ఎస్.కృష్ణ, ఎస్బీహెచ్ ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్‌రెడ్డి, ఎస్బీహెచ్ అధ్యక్షుడు రాజశేఖర్, కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
ఆర్థిక సంస్కరణలకు పాతికేళ్లు
1991 జూన్ 21న ప్రధాని పదవి చేపట్టిన వెంటనే సంస్కరణల పర్వానికి పీవీ శ్రీకారం దేశంలో ఆర్థిక సంస్కరణలకు ఆధ్యుడైన పీవీ నరసింహారావు ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసి పాతికేళ్లు పూర్తయ్యింది. 1991 జూన్ 21న ప్రధాని పదవి చేపట్టిన వెంటనే సంస్కరణల పర్వానికి శ్రీకారం చుట్టారు. ప్రముఖ ఆర్థిక వేత్త మన్మోహన్ సింగ్‌కు ఆర్థికమంత్రిగా బాధ్యతలు అప్పగిస్తూ పీవీ వేసిన విత్తన ప్రభావమే నేటి మన 2 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ. అప్పటికే విదేశీ కరెన్సీ నిల్వలు లేక ఎదుర్కొంటున్న చెల్లింపులు సంక్షోభం నుంచి గట్టెక్కడానికి రూపాయి విలువను తగ్గించడం ద్వారా మన్మోహన్ సంస్కరణల తొలి అడుగు వేశారు. ఆర్థిక వ్యవస్థ ద్వారాలు తెరవడానికి మన్మోహన్ చేస్తున్న ప్రయత్నాలకు గట్టి మద్దతునిస్తూ, విమర్శలను అడ్డుకుంటూ పీవీయే సంస్కరణల్ని ముందుండి నడిపించారు. సరిగ్గా ఈ పాతికేళ్లు పూర్తయిన సమయంలోనే నరేంద్ర మోదీ ప్రభుత్వం పలు రంగాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి పరిమితుల్ని పెంచడం విశేషం. తాజా నిర్ణయాలతో ఇండియా పూర్తి స్వేచ్ఛాయుత ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవించిందని మోదీ ప్రకటించడం పీవీకి ఘనమైన నివాళి. -
సంస్కరణలు వేగవంతం చేయండి
వ్యాపారాలకు అనుకూల పరిస్థితులు ఏర్పడేలా చూడండి - భారత్‌ను కోరిన అమెరికా - వైస్ ప్రెసిడెంట్ జో బెడైన్ వాషింగ్టన్: పెట్టుబడుల రాకకు, వ్యాపారాల నిర్వహణకు అనుకూల పరిస్థితులు కల్పించేలా ఆర్థిక సంస్కరణల అమలును మరింత వేగవంతం చేయాలని అమెరికా ఉపాధ్యక్షుడు జో బెడైన్.. భారత్‌ను కోరారు. మేధోహక్కులను పరిరక్షించడం, వాణిజ్య నిబంధనలను సరళతరం చేయడంపైనా దృష్టి సారించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో భారత్-అమెరికాల మధ్య తొలి వ్యూహాత్మక, వాణిజ్య చర్చలు.. ఇరు దేశాల సంబంధాల్లో నూతన శకాన్ని ఆవిష్కరించగలవని బెడైన్ వ్యాఖ్యానించారు. అమెరికా-ఇండియా బిజినెస్ కౌన్సిల్ (యూఎస్ఐబీసీ) 40వ వార్షిక సదస్సులో పాల్గొన్న సందర్భంగా బెడైన్ ఈ విషయాలు చెప్పారు. భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్, కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈ సదస్సులో పాల్గొన్నారు. వ్యాపార సంస్థలు తమ ఉత్పత్తులు, సర్వీసులను మార్కెట్లో స్వేచ్ఛగా విక్రయించుకునే వీలు కల్పించేలా విదేశీ పెట్టుబడులపై పరిమితులు తొలగించాల్సిన అవసరం ఉందని బెడైన్ పేర్కొన్నారు. వాణిజ్య నిబంధనల సరళీకరణ ద్వారా మాత్రమే ఇది సాధ్యపడుతుందన్నారు. అటు వాతావరణంలో ప్రతికూల మార్పులను సరిదిద్దేందుకు కూడా ఇరు దేశాలు మరింతగా పరస్పరం సహకరించుకోవాలని, ఇది ప్రపంచంలోనే రెండు అతి పెద్ద ప్రజాస్వామ్య దేశాల ఆర్థిక ప్రగతిలో కొత్త శకాన్ని ఆవిష్కరించగలదని బెడైన్ చెప్పారు. ఇరు దేశాలు వాణిజ్య సంబంధాలు వేగవంతంగా పటిష్టం చేసుకుంటున్నాయని అమెరికా విదేశాంగ మంత్రి జాన్ కెర్రీ పేర్కొన్నారు. ఇండియాలో ఇన్వెస్ట్ చేయండి.. సుష్మా స్వరాజ్ భారత్‌లో అపార వ్యాపార అవకాశాలు ఉన్నాయని, వీటిని అందిపుచ్చుకునేందుకు పెద్ద ఎత్తున ఇన్వెస్ట్ చేయాలని అమెరికన్ ఇన్వెస్టర్లకు సుష్మా స్వరాజ్ పిలుపునిచ్చారు. భారత్ పట్టణీకరణను పెంచేందుకు, ప్రజలందరికీ చౌకగా విద్యుత్‌ను, అందుబాటు ధరల్లో ఇళ్లను అందించేందుకు కృషి చేస్తోందని ఆమె తెలిపారు. అలాగే అంతర్జాతీయ తయారీ కేంద్రంగా భారత్‌ను తీర్చిదిద్దేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటోందని మంత్రి వివరించారు. వీటన్నింటా కూడా వ్యాపార అవకాశాలు ఉన్నాయని, అమెరికా ఇన్వెస్టర్లు వీటిని అందిపుచ్చుకోవచ్చని ఆమె పేర్కొన్నారు. మరోవైపు, వ్యాపారాలకు అనువైన దేశాల జాబితాలో భారత్ .. టాప్ 50లోకి చేరాలంటే .. కాంట్రాక్టుల అమలును మెరుగుపర్చాలని, దివాలా చట్టాలను ఆధునీకరించాలని అమెరికా వాణిజ్య మంత్రి పెనీ ప్రిట్జ్కర్ అభిప్రాయపడ్డారు. భారత్‌లో వ్యాపారపరమైన కాంట్రాక్టుల వివాదాలు పరిష్కారం కావడానికి సంవత్సరాలు పట్టేస్తుందని, నిబంధనలు తరచూ మారిపోతుంటాయని ఆమె వ్యాఖ్యానించారు. ఇలాంటి పరిస్థితుల వల్ల భారత్‌లో వ్యాపార నిర్వహణ చాలా ఖరీదైన వ్యవహారంగానూ, అనూహ్యమైన విధంగానూ ఉంటోందని పెనీ పేర్కొన్నారు. ఇవే దేశీ, విదేశీ పెట్టుబడుల రాకకు అవరోధంగా మారుతున్నాయన్నారు. ఇలాంటి వాటిని పరిష్కరించే దిశగా అత్యుత్తమ విధానాలదే రూపకల్పన చేసేందుకు ఇరు దేశాల బృందాలు కలిసి పనిచేయనున్నాయని పెనీ చెప్పారు. నూయి, భార్తియాకు పురస్కారాలు.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వృద్ధిలో అందర్నీ భాగస్వాములు చేసే దిశగా కృషి చేస్తున్నందుకు గాను పెప్సీకో చైర్మన్ ఇంద్రా నూయి, హిందుస్తాన్ టైమ్స్ గ్రూప్ చైర్పర్సన్ శోభనా భార్తియా ప్రతిష్టాత్మక పురస్కారాలు అందుకున్నారు. 2015 సంవత్సరానికి గాను యూఎస్ఐబీసీ.. గ్లోబల్ లీడర్షిప్ అవార్డును దక్కించుకున్నారు. భారత్-అమెరికా సంబంధాల్లో యూఎస్ఐబీసీ కీలకపాత్ర పోషిస్తోందని ఈ సందర్భంగా ఇంద్రా నూయి పేర్కొన్నారు. రెండు దేశాల మీడియా, టెక్నాలజీ సంస్థలు కలిసి పనిచే సేందుకు అపార అవకాశాలున్నాయని శోభనా భార్తియా తెలిపారు. ప్రముఖ ఇండియన్-అమెరికన్ ఆర్టిస్టు నట్వర్ భవ్సార్.. ఆర్టిస్టిక్ అచీవ్మెంట్ పురస్కారాన్ని అందుకున్నారు. -
మరిన్ని సంస్కరణలు అవసరం: ఫిక్కీ
న్యూఢిల్లీ: దేశ ఆర్థిక వ్యవస్థ రెండంకెల స్థాయిలో వృద్ధిని సాధించేందుకు తగిన పునాది వేయాలంటే.. ఆర్థిక సంస్కరణల కొనసాగింపు చాలా ముఖ్యమని పారిశ్రామిక మండలి ఫిక్కీ పేర్కొంది. అంతేకాకుండా.. పన్నుల హేతుబద్ధీకరణ, పెట్టుబడులకు చౌకగా నిధులను అందించడం వంటివి కూడా అవసరమేనని ఫిక్కీ కొత్త ప్రెసిడెంట్ జ్యోత్స్న సూరి అభిప్రాయపడ్డారు. ప్రతిపాదిత వస్తు-సేవల పన్ను(జీఎస్టీ)ను తక్షణం అమలు చేయడంతోపాటు ఈ పన్ను రేటు తక్కువగా ఉండేలా చూడాలని ఆమె పేర్కొన్నారు. బడ్జెట్‌పై మాట్లాడుతూ.. ఇది వార్షిక ప్రణాళిక మాత్రమేనని, ఒక్క రోజులో మొత్తం ఆర్థిక వ్యవస్థను సమూలంగా మార్చేయడం సాధ్యం కాదన్నారు. కాగా, అధిక వడ్డీరేట్లే పరిశ్రమకు అతిపెద్ద ఆందోళనని.. రేట్లను తగ్గించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇటీవలే ఆర్బీఐ పాలసీ రేటు(రెపో)ను పావు శాతం కోత విధించడం ప్రోత్సాహకర పరిణామమేనని.. అయితే, పరిశ్రమకు నిజమైన ప్రయోజనం దక్కాలంటే కనీసం 1-1.5%మేర వడ్డీరేట్లు తగ్గాల్సిన అవసరం ఉందని ఆమె పేర్కొన్నారు. -
ఈ ఏడాది 5.5 శాతం వృద్ధి
వాషింగ్టన్: బీజేపీ సారథ్యంలోని కొత్త ప్రభుత్వం ఆర్థిక సంస్కరణలకు సుముఖంగా ఉండడం, పాలనలో పారదర్శకతను తెచ్చే యత్నాలు చేస్తుండడంతో భారత ఆర్థిక వ్యవస్థ ఈ ఏడాది 5.5 శాతం వృద్ధి చెందవచ్చని ప్రపంచ బ్యాంకు భావిస్తోంది. ఇండియా గతేడాది 4.7 శాతం వృద్ధి సాధించింది. ‘భారత్ గత రెండేళ్లలో గడ్డు పరిస్థితులను ఎదుర్కోవడంతో వృద్ధి రేటు ఐదు శాతం దిగువకు పడిపోయింది. అంతకుముందు సంవత్సరాల్లో ఇది 8 శాతానికిపైగా ఉంది. ప్రస్తుతం పరిస్థితిలో మార్పు వస్తోంది. పలు ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ లభించింది. వచ్చే ఏడాది 6.3 శాతం, 2016లో 6.6 శాతం వృద్ధి రేటును భారత్ సాధించే అవకాశం ఉంది..’ అని ప్రపంచ బ్యాంక్ ఆర్థికవేత్త ఆండ్రూ బర్న్స్ మీడియాకు తెలిపారు. ప్రపంచ ఆర్థిక తీరుతెన్నులపై ప్రపంచ బ్యాంకు నివేదికను రూపొందించిన బృందానికి ఈయన సారథి. వర్ధమాన దేశాల అంచనాల తగ్గింపు ఆర్థికాభివృద్ధి విషయంలో వర్ధమాన దేశాలకు ఈ ఏడాది నిరాశ ఎదురవుతుందని ప్రపంచ బ్యాంకు నివేదిక తెలిపింది. వర్ధమాన దేశాలు ఈ సంవత్సరం 5.3% పురోగతి సాధిస్తాయని గత జనవరిలో వేసిన అంచనాను బ్యాంక్ ప్రస్తుతం 4.8%కి కుదించింది. ఈ దేశాలు వచ్చే ఏడాది 5.4%, 2016లో 5.5% వృద్ధి సాధించవచ్చని తెలిపింది. చైనా ప్రభుత్వ యత్నాలు సఫలమైతే ఆ దేశ ఆర్థిక వ్యవస్థ ఈ ఏడాది 7.6% విస్తరిస్తుందని అంచనా వేసింది. ఆసియా దేశాల్లో వృద్ధి రేట్లు తక్కువ స్థాయిలో ఉంటాయని పేర్కొంది. పేదరికాన్ని రూపుమాపాలంటే నిర్మాణాత్మక సంస్కరణలను వేగంగా అమలుచేసి విస్తృత ఆర్థిక పురోగతిని సాధించాల్సి ఉందని వరల్డ్ బ్యాంక్ గ్రూప్ ప్రెసిడెంట్ జిమ్ యాంగ్ కిమ్ తెలిపారు. నివేదికలోని ముఖ్యాంశాలు: - ఈ ఏడాది గడిచేకొద్దీ ప్రపంచ ఆర్థిక పురోగతి జోరందుకుంటుంది. గ్లోబల్ ఎకానమీ ఈ ఏడాది 2.8%, వచ్చే ఏడాది 3.4%, 2016లో 3.5 శాతం వృద్ధిచెందుతుంది. - ఈ సంవత్సరం ప్రపంచ ఆర్థిక పురోగతిలో 50 శాతానికిపైగా వాటా అధికాదాయ దేశాలదే ఉంటుంది. గతేడాది ఇది 40 శాతం కంటే తక్కువ స్థాయిలో ఉంది. - అనేక దేశాల ఆర్థిక ఆరోగ్యం ప్రస్తుతం మెరుగుపడింది. - చైనా, రష్యాలను మినహాయిస్తే ముఖ్యంగా భారత్, ఇండోనేసియాల్లో వర్ధమాన దేశాల స్టాక్ మార్కెట్లు గణనీయ పురోగతి సాధించాయి. వృద్ధి అంచనాలను పెంచిన డీబీఎస్ బ్యాంక్ ముంబై: వచ్చే ఆర్థిక సంవత్సరం (2015-16) భారత్ ఆర్థికాభివృద్ధి అంచనాలను డీబీఎస్ బ్యాంక్ పెంచింది. ఇప్పటివరకూ ఈ వృద్ధి రేటు అంచనా 6.1 శాతంకాగా, దీనిని 6.5 శాతానికి పెంచుతున్నట్లు బ్యాంక్ బుధవారం తెలిపింది. కేంద్రంలో సుస్థిర ప్రభుత్వం ఏర్పాటు, దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న సంస్కరణలు అమల్లోకి వస్తాయన్న ఊహాగానాలు అంచనాలు పెంచడానికి కారణమని సంస్థ పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2014-15) వృద్ధి రేటు 5.5 శాతమని డీబీఎస్ బ్యాంక్ అంచనావేస్తోంది. -
ఆర్టీసీకి బాబు యాక్సిడెంట్
కార్మికుల కడుపు కొట్టాడు ఆర్థిక సంస్కరణల పేరుతో ఆర్టీసీని ప్రైవేటీకరించేందుకు అర్రులు చాచారు. కార్మికుల పొట్ట కొట్టేందుకు చూశారు. కడుపు కాలి నోరెత్తితే జీతం కట్‌చేసి కేసులు పెట్టారు. ఆందోళనకు దిగితే జైలుపాలు చేశారు. లక్షకుపైగా కార్మికులను రోడ్డుపాలు చేసేందుకు ప్రయత్నించారు. చంద్రబాబు ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులపై చూపించిన రాక్షసత్వం ఇదంతా. లోపభూయిష్ట విధానాలతో ఆర్టీసీని అధోగతి పాలుచేసి చార్జీల పెంపుతో ప్రయూణికుల నడ్డి విరవడమే కాదు.. కార్మికులను రోడ్డెక్కేలా చేశారు. తొమ్మిదేళ్ల పాలనలో ఆరుసార్లు బస్సు చార్జీలు పెంచి ప్రయాణికుల ను ఉక్కిరిబిక్కిరి చేసిన బాబు నిర్వాకంపై ప్రత్యేక కథనం. షేక్ పోలుకల్ యూసుఫ్, కర్నూలు, ‘వద్దు బాబోయ్.. ఆ కష్టాల పాలన మళ్లీ మాకొద్దు.. ఆ తొమ్మిదేళ్లు అర్ధాకలితో అలమటించాం.. సంస్థ అభివృద్ధికి రెక్కలు ముక్కలయ్యేలా పనిచేసినా ఇల్లు గడిచేది కాదు. క్యాజువల్ పేరుతో ఉద్యోగులను తీసుకుని సక్రమంగా పనిచేయట్లేదని ఇంటికి పంపారు. న్యాయం కోసం ఆందోళన చేస్తే జైలుకు పంపారు. రెగ్యులర్ చేయాలని కోరితే నిలుపుదల చేస్తూ జీవోలిచ్చారు. వద్దు బాబోయ్ వద్దు.. చంద్రబాబు పాలన మాకొద్దు..’ అంటున్నారు ఆర్టీసీ కార్మికులు. ప్రైవేటీకరణ కోసం ఆర్టీసీని ముక్కలు చేయాలనుకున్న బాబు పాలన గుర్తుచేసుకుని భయపడిపోతున్నారు. జీతం పెంచమని 24 రోజులు సమ్మెచేస్తే జైలులో పెట్టించిన ఘటనలను వారు ఇప్పటికీ మరచిపోలేకపోతున్నారు. కార్మికులపై కాటు వేసిన కాంగ్రెస్ ఆర్టీసీని ప్రైవేటీకరించాలని చూసిన బాబు ఆలోచనల్ని అనుసరిం చాలని వైఎస్ మరణం తర్వాత అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నించింది. ఆర్టీసీని నాలుగు ముక్కలు చేయాలనే ఆలో చనకు కూడా వచ్చింది. దీంతో మళ్లీ కార్మికుల్లో అభద్రతాభావం ఏర్పడింది. ప్రైవేటు బస్సులు అద్దె ప్రతిపాదికన పెద్ద ఎత్తున తీసుకోవడం, రిజర్వేషన్, గుడ్‌విల్ కేంద్రాలతోపాటు గ్రౌండ్ బుకింగ్ కేంద్రాల ప్రైవేటీకరణకు టెండర్లు పిలవడం వంటి వాటితో పాటు డిస్ ఎంగేజ్ పేరుతో కార్మికులను ఇంటికి కూడా పంపింది. సత్తా ఉన్న నేతకే ఓటు రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆర్టీసీ కూడా రెండు ముక్కలైంది. ఈ నేపథ్యంలో కష్టాలు తప్పవని భావించిన కార్మికులు, ఉద్యోగులు చంద్రబాబు వస్తే అవి అధికమై సంస్థ ప్రైవేటుపరం అవుతుందని భయాందోళనకు గురవుతున్నారు. వైఎస్ ఆశయ సాధన కోసం పనిచేసే నాయకుడిని గెలిపించుకోవాలని నిర్ణయించుకున్నారు. బాబు హయాంలో... - తొమ్మిదేళ్లలో ఆరుసార్లు చార్జీలు పెంచారు. - నష్టాల సాకుతో ప్రైవేటీకరించాలనుకున్నారు. - రూ.480కోట్ల మేర భారం వేశారు. - 1995లో అరకొర డ్రైవర్లు, కండక్టర్లను క్యాజువల్ పద్ధతిలో తీసుకుని ఆ తరువాత ఉద్యోగుల భర్తీకి బ్రేక్ వేశారు. క్యాజువల్ ఉద్యోగులను రెగ్యులర్ చేయరాదని యాక్ట్-2ను జారీ చేశారు. - వేతనాలు పెంచాలంటూ 24 రోజులు నిరవధికంగా సమ్మెచేసిన కార్మికులపై చంద్రబాబు ఉక్కుపాదం మోపారు. వారిపై కేసులు పెట్టించారు. ఉద్యమం తీవ్రరూపం దాల్చడంతో 9.5 శాతం పెంచి చేతులు దులుపుకొన్నారు. - పదివేల మంది కార్మికులను ఇంటికి పంపారు. - ఔట్ సోర్సింగ్ ఆన్ కాంట్రాక్ట్ సిస్టమ్, హైర్ బసెస్ వంటి ప్రపంచ బ్యాంకు విధానాలను ఆర్టీసీలో ప్రవేశపెట్టడమే కాకుండా ఉద్యోగులను తగ్గించి, ప్రైవేటుకు దారి సుగమం చేశారు. పెరిగిన చార్జీలు - 1994లో ఆర్డినరీ బస్సులో ప్రయాణించే వారి నుంచి కిలోమీటరుకు 17 పైసలు వసూలు చేస్తే, 2003 నాటికి 35 పైసలు చేశారు. - కిలోమీటరుకు 21 పైసలు ఉన్న ఎక్స్‌ప్రెస్ బస్సు చార్జీని 40 పైసలు పెంచారు. - సెమీ లగ్జరీ చార్జీని 45 పైసలు చేశారు. - 1995లో రూ.120కోట్లు, 1996లో 30 కోట్లు, 1997లో 60కోట్లు, 1999లో 150 కోట్లు, 2000లో 60 కోట్లు, 2003లో 60 కోట్ల చొప్పున ప్రయాణికులపై భారం వేశారు. వైఎస్ హయాంలో లాభాల బాట - మహానేత వైఎస్ పాలనలో రూ.117 కోట్ల లాభాలను ఆర్టీసీ ఆర్జించింది. - ఆర్టీసీని ప్రైవేటీకరిస్తానని చంద్రబాబు చెప్పడంతో కార్మికుల్లో ఏర్పడిన అభద్రతా భావాన్ని వైఎస్ తొలగించారు. - 2007, 2008, 2009లో కండక్టర్, డ్రైవర్ల పోస్టులు భర్తీ చేశారు. - బాబు చేసిన చట్టం-2ను ఎత్తేసి 240 రోజుల సర్వీసు పూర్తిచేసిన 12వేల మంది కాంట్రాక్టు - కార్మికులను రెగ్యులర్ చేయించారు. - వేతనాలు పెంచి ఉద్యోగుల మన్ననలు పొందారు. - రాజన్న తన పాలనలో ఆర్టీసీ చార్జీలు పెంచలేదు. - ఆర్టీసీ నష్టాల నివారణకు బడ్జెట్లో ప్రత్యేక నిధులు కేటాయించారు. ఐఏఎం నివేదిక ప్రకారం రూ.600కోట్లు మంజూరు చేశారు. - పన్ను భారాన్ని రెగ్యులర్ సర్వీసులపై 12.5 నుంచి 7 శాతం, సిటీ సర్వీసులపై 10 నుంచి ఐదు శాతానికి తగ్గించి ఆర్టీసీకి రూ.250 కోట్ల ఆర్థిక సహాయం అందించారు. - పల్లెవెలుగు సర్వీసులు ప్రవేశపెట్టి గ్రామీణులకు మేలు చేశారు. రోశయ్య, కిరణ్ హయాంలో ధరాభారం - రోశయ్య అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోపే బస్ చార్జీలు పెంచారు. ఆ తరువాత బాధ్యతలు స్వీకరించిన కిరణ్‌కుమార్‌రెడ్డి మూడేళ్లలో మూడుసార్లు పెంచారు. అంతటితో ఆగకుండా డెవలప్మెంట్ సెస్ పేరుతో మరో చార్జీ వేశారు. - నెలవారీ సీజన్ టికెట్, జెట్, జూబ్లీ హైటెక్ టికెట్లు, కపుల్ గిఫ్ట్ కార్డుల ద్వారా టోల్‌ప్లాజా చార్జీలను రూ.3 నుంచి రూ.5కు, ఇంద్ర, వెన్నెల, గరుడ, వెన్నెల ప్లస్ తదితర సర్వీసుల టోల్‌ప్లాజా చార్జీని రూ.3 నుంచి రూ.6కు పెంచారు. - పల్లె వెలుగు కనీస చార్జీ రూ.3 నుంచి రూ.5 చేశారు. - 2009లో లగ్జరీ బస్సుకు కిలోమీటరుకు 57 పైసల చొప్పున వసూలుచేస్తే, ఇప్పుడు ఆర్డినరీ బస్సుకే 59 పైసలు తీసుకుంటున్నారు. - వీరి హయాంలో ఆర్టీసీకి రూ.650 కోట్ల నష్టం వచ్చింది. కార్మికుల డిమాండ్లు ఇవీ.. - ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు చెల్లించాలి. - అధికారుల వేధింపులు అరికట్టడంతోపాటు పనిభారాన్ని తగ్గించేందుకు ఖాళీలు భర్తీ చేయాలి. - ప్రతి కార్మికుడు, ఉద్యోగికి స్థలం ఇచ్చి పక్కా గృహాలు నిర్మించి ఇవ్వాలి. - పభుత్వాస్పత్రులతో పాటు అన్ని కార్పొరేట్ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్య సేవలు ఉచితంగా అందించాలి. - పిల్లలకు మెరుగైన, ఉన్నత విద్య కోసం చేయూతనివ్వాలి. పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో పింఛన్ ఇవ్వడంతోపాటు సమస్యలు పరిష్కరించాలి. వైద్య సేవలు మెరుగుపరచా లి. బస్సుల్లో ఉచిత ప్రయాణానికి అనుమతించాలి. చంద్రబాబు కార్మికద్రోహి చంద్రబాబు ఆర్టీసీతో ఆటలాడుకున్నారు. చాలా మండలాల్లో బస్టాపులకు దూరంగా బస్స్టేషన్లు నిర్మించారు. అన్ని రాజకీయ పార్టీలు, ఆర్టీసీ యూనియన్లు కలిసి 24 రోజులు సమ్మెచేస్తే కేవలం 2.5 శాతం టాక్స్ తగ్గించిన పిసినారి బాబు. తాను జారీచేసిన రాయితీల జీవోలకు ఒక్క పైసా కూడా విదల్చకుండా కుట్రలు పన్నారు. కండక్టర్లు, డ్రైవర్లను పర్మినెంట్ చేయకుండా క్యాజువల్‌గానే ఉంచిన కార్మికద్రోహి. ప్రస్తుతం ఉన్న రూ.5వేల కోట్ల అప్పులకు చంద్రబాబే బాధ్యుడు. వైఎస్ నిర్ణయాలు, చేయూతతో సంస్థకు రూ.5వేల కోట్ల మేలు చేకూరింది. కార్మికులు చేసిన సమ్మె కాలానికి జీతాలు చెల్లించి మన్ననలు పొందారు. - ఎ.రాజారెడ్డి, వైఎస్సార్ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు