ఆర్థిక సంస్కరణలకు పాతికేళ్లు
1991 జూన్ 21న ప్రధాని పదవి చేపట్టిన వెంటనే సంస్కరణల పర్వానికి పీవీ శ్రీకారం
దేశంలో ఆర్థిక సంస్కరణలకు ఆధ్యుడైన పీవీ నరసింహారావు ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసి పాతికేళ్లు పూర్తయ్యింది. 1991 జూన్ 21న ప్రధాని పదవి చేపట్టిన వెంటనే సంస్కరణల పర్వానికి శ్రీకారం చుట్టారు. ప్రముఖ ఆర్థిక వేత్త మన్మోహన్ సింగ్‌కు ఆర్థికమంత్రిగా బాధ్యతలు అప్పగిస్తూ పీవీ వేసిన విత్తన ప్రభావమే నేటి మన 2 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ. అప్పటికే విదేశీ కరెన్సీ నిల్వలు లేక ఎదుర్కొంటున్న చెల్లింపులు సంక్షోభం నుంచి గట్టెక్కడానికి రూపాయి విలువను తగ్గించడం ద్వారా మన్మోహన్ సంస్కరణల తొలి అడుగు వేశారు.
ఆర్థిక వ్యవస్థ ద్వారాలు తెరవడానికి మన్మోహన్ చేస్తున్న ప్రయత్నాలకు గట్టి మద్దతునిస్తూ, విమర్శలను అడ్డుకుంటూ పీవీయే సంస్కరణల్ని ముందుండి నడిపించారు. సరిగ్గా ఈ పాతికేళ్లు పూర్తయిన సమయంలోనే నరేంద్ర మోదీ ప్రభుత్వం పలు రంగాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి పరిమితుల్ని పెంచడం విశేషం. తాజా నిర్ణయాలతో ఇండియా పూర్తి స్వేచ్ఛాయుత ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవించిందని మోదీ ప్రకటించడం పీవీకి ఘనమైన నివాళి.