మరిన్ని సంస్కరణలు అవసరం: ఫిక్కీ
న్యూఢిల్లీ: దేశ ఆర్థిక వ్యవస్థ రెండంకెల స్థాయిలో వృద్ధిని సాధించేందుకు తగిన పునాది వేయాలంటే.. ఆర్థిక సంస్కరణల కొనసాగింపు చాలా ముఖ్యమని పారిశ్రామిక మండలి ఫిక్కీ పేర్కొంది. అంతేకాకుండా.. పన్నుల హేతుబద్ధీకరణ, పెట్టుబడులకు చౌకగా నిధులను అందించడం వంటివి కూడా అవసరమేనని ఫిక్కీ కొత్త ప్రెసిడెంట్ జ్యోత్స్న సూరి అభిప్రాయపడ్డారు.
ప్రతిపాదిత వస్తు-సేవల పన్ను(జీఎస్‌టీ)ను తక్షణం అమలు చేయడంతోపాటు ఈ పన్ను రేటు తక్కువగా ఉండేలా చూడాలని ఆమె పేర్కొన్నారు. బడ్జెట్‌పై మాట్లాడుతూ.. ఇది వార్షిక ప్రణాళిక మాత్రమేనని, ఒక్క రోజులో మొత్తం ఆర్థిక వ్యవస్థను సమూలంగా మార్చేయడం సాధ్యం కాదన్నారు. కాగా, అధిక వడ్డీరేట్లే పరిశ్రమకు అతిపెద్ద ఆందోళనని.. రేట్లను తగ్గించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇటీవలే ఆర్‌బీఐ పాలసీ రేటు(రెపో)ను పావు శాతం కోత విధించడం ప్రోత్సాహకర పరిణామమేనని.. అయితే, పరిశ్రమకు నిజమైన ప్రయోజనం దక్కాలంటే కనీసం 1-1.5%మేర వడ్డీరేట్లు తగ్గాల్సిన అవసరం ఉందని ఆమె పేర్కొన్నారు.